Home > Editorial > విపత్తులను ఎదుర్కొనేందుకు ప్రణాళికలు

విపత్తులను ఎదుర్కొనేందుకు ప్రణాళికలు

తొలకరి కనిపించింది... మాయమైపోయింది
సౌత్ లో మిగులు కరెంట్ వినియోగించుకొనేందుకు ప్లాన్

floods_apduniaఈశాన్యంలోని అసోం, అరుణాచల్‌ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరంతోపాటు, పశ్చిమాన గుజరాత్, రాజస్థాన్ రాష్ర్టాలలో వరదలు ముంచెత్తి బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదల మూలంగా దేశవ్యాప్తంగా ఏటా వేలాది మంది మరణిస్తున్నారు. గత ఏడాది సాగిన ఒక అధ్యయనం ప్రకారం- కనీసం పదిశాతం జనాభా సామాజిక విధ్వంసానికి గురవుతున్నది. ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ మార్పులు సంభవించడం వల్ల, రుతుచక్రం మారిపోయి ప్రకృతి బీభత్సాలు సంభవిస్తున్నయి. వరదలు ఎప్పుడో ఒకసారి రావ డం కాదు, ఇక ముందు తరచుగా సంభవించే అవకాశాలు ఉన్నాయి. తూర్పున బీహార్, ఒడిషా రాష్ర్టాల్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా వరదలు ముంచెత్తాయి. ఝార్ఖండ్‌లోని కొన్ని ప్రాంతాలను కూడా వరదలు ముంచెత్తాయి. అసోంను ముంచెత్తుతున్న వరదలు కజిరంగా జాతీయ పార్కులోని మూగజీవుల ప్రాణాలను బలి తీసుకున్నాయి. వరదల్లో దాదాపు వంద వరకు వివిధ జంతువులు మృత్యువాత పడ్డాయి. ఇందులో ఏడు ఒంటికొమ్ము ఖడ్గమృగాలు, 85 దుప్పులతో పాటు పలు అడవి జంతువులు చనిపోయినట్లు పార్కు 
అధికారులు వెల్లడించారు. వరదల కారణంగా అసోం రాష్ట్రంలో మృతుల సంఖ్య 70కు చేరుకుంది. రాష్ట్రంలోని 29 జిల్లాలకు చెందిన దాదాపు 25లక్షల మంది నిరాశ్రయులయ్యారు.వీరి కోసం ప్రభుత్వం వెయ్యికి పైగా సహాయక శిబిరాలను నడుపుతోంది. కజిరంగా జాతీయ పార్కుకు జరిగిన నష్టాన్ని పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం భారీగా సాయాన్ని ఇచ్చేందుకు అంగీకరించిందని రాష్ట్ర పర్యావరణ శాఖ మంత్రి హర్షవర్దన్‌ వెల్లడించారు. ఈ నిధులతో అత్యవసర పరిస్థితుల్లో మూగ జీవాలను కాపాడేందుకు చర్యలు చేపడతామన్నారు. ప్రపంచ వారసత్వ ప్రదేశంగా కజిరంగా జాతీయ పార్కుకు గుర్తింపు ఉంది. ప్రపంచంలోని మూడింట రెండొంతుల ఒంటికొమ్ము ఖడ్గ మృగాలు ఈ పార్కులోనే ఉన్నాయి. ఉత్తరాది రాష్ర్టాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వరదలు తీవ్రరూపం దాల్చుతున్నాయి. రాజస్థాన్‌లోని పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తుతున్నాయి. రంగంలోకి దిగిన ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు సిరోహి, పాలి ఏరియాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. మరోవైపు హిమాచల్‌ప్రదేశ్‌లోని మనాలిలో వరదల 
ఉధృతికి రోహ్‌తక్ టన్నెల్‌కు సమీపంలో రహదారి పూర్తిగా దెబ్బతిన్నది.జూన్ మొదలుకొని జూలై రెండవ వారం వరకు అస్సాం వరద తాకిడికి గురై అల్లల్లాడింది. వేల ఎకరాల పంట నష్టంతో పాటు కజిరంగా జాతీయ పార్కు తొంభై శాతం జలమయమైంది. ఈశాన్యంలో వరదలు రావడం ఈ ఏడాది మొదటిసారి కాదు. తరచుగా అసోం అనుభవిస్తున్న దుఃఖం ఇది. ఒక్క అసోంలో నే కాదు, దేశంలోని అన్ని వరద బాధిత ప్రాంతాల ప్రజల దైన్యమిది. గత కొన్ని వారాలలో దేశవ్యాప్తంగా రుతుపవన వానల వల్ల కనీసం ఏడువందల మంది మరణించారు. అయితే అసోంలో వరద బీభత్సం ఉధృతంగా ఉన్నప్పుడు కాకుండా, తగ్గుముఖం పట్టిన దశలో ప్రధాని మోదీ సందర్శించడం, గుజరాత్ వరద ప్రాంతాలను మాత్రం ముందే పర్యటించడం పట్ల విమర్శలు వచ్చాయి. గుజరాత్ అనుభవిస్తున్న విషాదం నేపథ్యంలో ఇటువంటి విమర్శలను పట్టించుకోవలసిన అవసరం లేదు. గుజరాత్‌లో గత నూటా పన్నెండేండ్ల చరిత్రలో ఇంత భారీ వానలు పడలేదని వాతావరణ శాస్త్రవేత్తలు అంటున్నా రు. వరదల వల్ల రెండువందల మందికి పైగా మరణించారు. 
గుజరాత్ పరిస్థితి దృష్ట్యా కొంత ఎక్కువ దృష్టి పెట్టినప్పటికీ, మిగతా రాష్ర్టాల్లోని వరదబాధితులను విస్మరించారనే విమర్శలకు తావు ఇవ్వకూడదు.గుజరాత్‌లో ఇప్పటివరకు కరువుతో అల్లాడిన ప్రాంతాల్లోనే ఈసారి భారీ వానలు పడటం విశేషం. ఏడాది మొత్తం కురిసే వానలో మూడువంతులు ఒకేసారి కుంభవృష్టి కురిసింది. భవిష్యత్తులో ఓ ఏడాది కరువు పీడించవచ్చు, ఆ తరువాత వానలు పడితే భారీగా కురిసి, అదొక ప్రకృతి విపత్తుగా మారవచ్చు. అందువల్ల ప్రభుత్వాలు కూడా ఈ భారీ వానలకు, వరదలకు శాశ్వత ప్రాతిపదికన సిద్ధపడటం అవసరం. కానీ ఇప్పటివరకు ఆ దిశగా చెప్పుకోదగిన ముందడుగు పడలేదు. అస్సాం పర్యటన సందర్భంగా ప్రధాని తక్షణ సహాయం కొంత ప్రకటించడంతోపాటు మరో వంద కోట్లు శాశ్వత పరిష్కారం కోసం అధ్యయనం చేయడానికి కేటాయించినట్టు వెల్లడించారు. శాశ్వత పరిష్కారం అనే మాట 
ప్రధాని నోట రావడం హర్షించదగినదే అయినప్పటికీ, ఈ హామీ ఈశాన్య ప్రాంతానికి మాత్రమే పరిమితమైంది. ఆ బృహత్కార్యం ఇంకా అధ్యయనం సాగి ఆచరణ రూపం దాల్చవలసి ఉన్న ది. ఇప్పటి వరకు వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, ఆహార పొట్లాలు ఇవ్వడం వరద ఉధృతి తగ్గిన తరువాత ఇతరత్రా సహాయాలు చేయడం వరకే ప్రభుత్వాలు పరిమితం అయి ఉన్నాయి. ఇప్పుడు గుజరాత్, ఈశాన్య ప్రాంతాలలో కూడా ఇదే తరహా సహాయ చర్యలు సాగుతున్నయి.వాతావరణ పరిస్థితులు భారీ మార్పులకు లోనయిన నేపథ్యంలో భారీ వానలు, వరదల వంటి ప్రకృతి బీభత్సాలను ఎదుర్కొనే విధానం కూడా మారాలె. ప్రతి రెండు లేదా మూడేండ్లకు ఒకసారి ఈ జల ప్రళయాలు వస్తాయనే అంచనాతో వ్యూహాలను రూపొందించుకోవాలె. ఒకప్పుడు వరద నష్టం అంటే ప్రాణ నష్టం లెక్కవేసేవారు. పంట నష్టం, ఇతర ఆస్తి నష్టం కూడా పరిగణనలోకి తీసుకునే వారు. కానీ 1980 దశకం నుంచి ఈ అంచనా తీరు మారిపోయింది. పారిశ్రామిక, వ్యవసాయ, సామాజిక మౌలిక వసతులకు కలిగే నష్టాన్ని, జీడీపీ ఎంత శాతం 
దెబ్బతింటున్నదనే ప్రాతిపదికన అంచనా వేసుకోవాలి. ఉదాహరణకు ఇటీవలి వరదల వల్ల అహ్మదాబాద్‌లోనే 150 కర్మాగారాలు మూతపడ్డాయి. మూడేండ్లకు ఒకసారి వచ్చే వాన నీటిని కాపాడుకుని కరువు కాలంలో వాడుకోవడానికి జలాశయాలు నిర్మించుకోవాలె. ప్రతి గ్రామాన్ని, ప్రాంతాన్ని ప్రాతిపదికగా తీసుకొని ఎత్తు పల్లాలు, నీటి పారుదల ఆధారంగా నిర్మాణాలు జరుగాలె. జలమయమయ్యే ప్రాంతంలో గోదాములు, నివాసాలు ఉండకూడదు. ప్రతి నీటిపాయ గమనాన్ని నిర్దేశించి, ఉపయోగించుకోగలిగితే చాలు. పారిశ్రామికంగా, సామాజికంగా నష్టం కనిష్ఠ స్థాయిలో ఉండే విధంగా వ్యూహాలు చేపడితే వరదలు వచ్చినప్పుడు సహాయ చర్యలపై ఇంతగా ఒత్తిడి ఉండదు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *