Home > Editorial > నివేదికలకే పరిమితమవుతున్న పోలీస్ సంస్కరణలు

నివేదికలకే పరిమితమవుతున్న పోలీస్ సంస్కరణలు

కేంద్ర ఆర్థిక విధానాలపై విమర్శలు
కొరకరాని కొయ్యగా జీఎస్టీ

supremecourt-apduniaపోలీసు సంస్కరణలపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఏ ఒక్క రాష్ట్రమూ అనుసరించలేదని ‘కామన్ వెల్త్ మానవ హక్కుల ఇనిషియేటివ్’ సంస్థ నివేదిక ప్రకటించింది. 11 ఏళ్ల క్రితం 2006 సెప్టెంబర్ 23న పోలీసు వ్యవస్థలో వృత్తి నైపుణ్యం, జవాబుదారీతనం, పని సామర్ధ్యం పాదుగొల్పడానికి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గదర్శకాలను సుప్రీంకోర్టు సూచించింది. అయితే వాటిపట్ల ప్రభుత్వాల నిర్లక్షం స్పష్టంగా ద్యోతక మవుతున్నట్లు ఆ నివేదిక తెలిపింది. ఆ మార్గదర్శకాలకు అనుగుణంగా చాలా రాష్ట్రాలు చట్టం చేయాల్సి ఉండగా చేయలేదు. ఆ అధ్యయనం జరిపిన కామన్వెల్త్ సంస్థ సత్వర న్యాయసాధన కోసం, పోలీసు వ్యవస్థ- జైళ్ల సంస్కరణలకోసం రెండు దశాబ్దాలుగా కృషి చేస్తున్న లాభాపేక్షలేని సంస్థ. 18 రాష్ట్రాలలో కొన్ని విధానాలను, కొన్ని చట్టాలను, పాలనా ఉత్తర్వులను అందుకు అనుగుణంగా రూపొందించాయి కాని ఏ ఒక్కటీ అనుసరించడం లేదని సంస్థ నివేదిక తెలిపింది.చాలా రాష్ట్ర పభుత్వాలు పోలీసు వ్యవస్థను తమ కనుసన్నల్లో మెలిగే విధంగా ప్రజలకు తక్కువ జవాబుదారీతనంతో కొనసాగేలాగా జాగ్రత్తలు తీసుకొన్నాయి. పోలీసు వ్యవస్థలో సంస్కరణల యంత్రాంగాల రూపకల్పనకు ఏడు మార్గదర్శకాలను కేంద్రం సూచించినట్లునివేదిక తెలిపింది. అయితే వాటిలో ముఖ్య అంశాలను వదిలిపెట్టి పోలీసు వ్యవస్థపై తమ నియంత్రణ కొనసాగడానికి వీలైన వాటిని చాలా రాష్ట్రాలు ఎంచుకున్నాయి. పోలీస్ డైరెక్టర్ జనరల్స్ (డిజిపిలు) నియామకం, బదిలీలు ఇష్టానుసారం చేసే అధికారాన్ని తమ వద్దే ఉంచుకొన్నాయి. జిల్లాలకు అత్యున్నతాధికారులుగా ఉండే ఎస్‌పి లేదా ఏదైనా పోలీస్ స్టేషన్ ఆఫీస్ ఇన్‌చార్జీల నియామకం, బదిలీలపై తుది నిర్ణయాధికారాన్ని రాష్ట్రాలు తమ వద్దే ఉంచుకొన్నాయి. దీనివల్ల అక్రమ రాజకీయ ఉత్తర్వులను ప్రతిఘటించే శక్తి ఆ పోలీసు అధికార్ల కు లోపిస్త్తోంది.సుప్రీంకోర్టు సూచించిన ప్రకారం నియామకం, బదిలీ అధికారం పోలీసు సంఘాలకు ఉండాలి. స్వతంత్ర సంస్థల నిఘా పోలీసు వ్యవస్థపై ఉండాలన్న సూచనను కూడా తుంగలో తొక్కారు. అటువంటి యంత్రాంగాలను రూపొందించిన చోట్ల అవి తగినంతగా స్వతంత్ర సంస్థలకు ప్రాతినిథ్యం ఇవ్వకపోవడమో, ప్రతిపక్ష నాయకుని చేర్చుకోక పోవడమో జరిగింది. ఉదాహరణకు పోలీసు వ్యవస్థ గుణగణాల మదింపుకి, మార్గదర్శకాలు రూపొందించడానికి ఉద్దేశించిన ‘స్టేట్ సెక్యూరిటీ కమిషన్’ వంటివి అరకొర ప్రాతినిధ్యాలతో ఏర్పడినవే.పోలీసు వ్యవస్థలో ఆంతరంగిక వ్యవహారాల నిర్వహణ, పోలీసింగ్ సామర్ధం, ప్రజల ఫిర్యాదుల పరిష్కార సామర్ధం , జవాబుదారీతనం పెరిగినట్లు నివేదిక తెలిపింది. అయితే ఆ వ్యవస్థ పట్ల రాష్ట్రప్రభుత్వాల తీరు లోనే తప్పు ఉంది. అవి ఎప్పటి వలెనే పోలీసులపై పెత్తనాన్ని కోరుకొంటున్నాయి. తమ చెప్పుచేతల్లో పోలీసు వ్యవస్థను ఉంచుకోవడం ద్వారా పాలనా వ్యవహారాల్లో లోటుపాట్లను కప్పిపుచ్చడానికి, విచారణలను తప్పు దోవ పట్టించడానికి అవి ప్రయత్నిస్తున్నాయి. పోలీసు వ్యవస్థను ప్రజల దృష్టినుంచి ఎంత దూరంగా పెడితే అంత మంచిది ప్రభుత్వాలకి. అవి ఆ వ్యవస్థను గుప్పెట్లో పెట్టుకోవడం ద్వారా తమ ఇష్టుల అక్రమాలపై దర్యాప్తును తొక్కి పెట్టాలని, సాక్షాలు తారుమారు చేయాలనీ కోరుకొంటాయి. మాటవినని పోలీసులను బదిలీ చేస్తాయి.రాష్ట్రాలు సుప్రీంకోర్టు మార్గదర్శకాలలోని పలు అంశాలను నిర్లక్షం చేయడమో, నీరుకార్పించడమో చేశాయని కామన్‌వెల్త్ సంస్థ నివేదిక తెలిపింది. పోలీస్ డైరెక్టర్ జనరల్ నియామకంలో అధికారులతో కూడిన ఎంపిక బృందాన్ని నియమించడం, దాని సిఫార్సుల ప్రకారం పోవ డం చేయకుండా తామే స్వయంగా వారి నియామకం, బదిలీలను సాగిస్తున్నాయని, వాటిపై తుది నిర్ణయం ప్రభుత్వాలు తమ వద్దే ఉంచుకొన్నాయని తెలిపింది.

స్వతంత్ర సంస్థ ద్వారా పోలీసు వ్యవస్థ పనితీరుపై మదింపు జరపాలన్న సూచనను కూడా రాష్ట్రాలు పట్టించుకోక పోవడం మరో ఆందోళనకరమైన అంశమని కామన్‌వెల్త్ మానవ హక్కుల ఇనిషియేటివ్ అభిప్రాయపడింది.పోలీసు వ్యవస్థ మదింపునకు, విధానపరమైన మార్గదర్శకాలు రూపొందించడానికీ కొన్ని రాష్ట్రాలలో ‘స్టేట్ సెక్యూరిటీకమిషన్’ వంటివి ఏర్పడినా, అవి కేవలం రబ్బరు స్టాంపులుగా మిగిలాయి. ప్రముఖ న్యాయవాది సోలీ సోరబ్జీ సారథ్యంలో కేంద్రం 2005 లో ఒక కమిటీని ఏర్పరచినా తదుపరి ప్రభుత్వాల హయాంలో అది నిర్లక్షానికి గురయింది. కేంద్రం అధీనంలో పనిచేసే ఢిల్లీ పోలీసు వ్యవస్థకి ఇప్పటికీ స్వతంత్ర ఫిర్యాదుల అధికారి లేరని నివేదిక వెల్లడించింది. దానికి ఉన్న పూర్వపు ‘స్టేట్ సెక్యూరిటీ కమిషన్ గత అయిదేళ్లలో కేవ లం నాలుగైదు సార్లే సమావేశమైంది.ఉత్తరప్రదేశ్ మాజీ డిజిపి, సరిహద్దు భద్రతాదళం మాజీ అధిపతి ప్రకాశ్ సింగ్ 1996లో ఈ అంశంపై సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. పోలీసు వ్యవస్థలో పలు సంస్కరణలను ప్రవేశపెట్టాలని ఆయన కోరారు. తరువాత అటు వంటి అపీళ్లు మరికొన్ని దాఖలయ్యాయి. తరువాత సుప్రీంకోర్టు రాష్ట్రాలకు ఈ అంశంపై విప్లవాత్మకం అనదగ్గ గట్టి మార్గదర్శకాలను 2006లో సూచించింది. కానీ అవి అత్యంత సహజంగానిర్లక్షానికి గురి అయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Facebook Auto Publish Powered By : XYZScripts.com