Home > Editorial > పాకిస్తాన్ లో కలసి రాని పదవులు

పాకిస్తాన్ లో కలసి రాని పదవులు

ర్యాంకులు సరే... అనుకూలతలు ఏవీ
రాష్ట్రాలలో రాజకీయ ప్రకంపనలు

Pakistan_day2_apduniaపాకిస్థాన్ కథ మళ్ళా మొదటికి వచ్చింది. ప్రజా ప్రభుత్వం ఐదేండ్ల ఆయుష్షు తీరక ముందే అంతమైపోవడం అక్కడ సంప్రదాయంగా మారిపోయినట్టున్నది. అయితే ఈసారి సైన్యం తెరవెనుక ఉంటే, న్యాయవ్యవస్థ తన చేతులకు బురద అంటించుకున్నది. అవినీతి కేసులో పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు వ్యతిరేకంగా తీర్పు రావడంతో ఆయన పదవిని కోల్పోక తప్పలేదు. పనామా పేపర్స్ కుంభకోణం భారీ వివాదంగా మారి నవాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని కూల్చేదశకు తీసుకుపోయింది.70ఏళ్ల పాక్ ప్రజా పరిపాలనను ఓసారి పరీక్షిస్తే ఇది తేటతెల్లమవుతుంది. స్వాతంత్ర్యం పొందిన నాటి నుంచి నేటి వరకు ఒక్కరంటే ఒక్కరూ ప్రధానమంత్రి పదవిలో ఐదేళ్లు ఉండలేదు.  సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడమో లేదా సైనిక తిరుగుబాటో ఏదో ఒకటి ప్రధాని పదవిని మధ్యలోనే త్యజించాల్సి వస్తోంది.  పనామా వ్యవహారంలో సుప్రీంకోర్టు నవాజ్ షరీఫ్ ను అనర్హుడిగా ప్రకటించడంతో మధ్యలోనే పీఠం దిగాల్సి వచ్చింది. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగాల్సి ఉండగా సెంటిమెంట్ ప్రకారం ప్రధానికి పదవీగండం వచ్చిపడింది. మధ్యలోనే అధికారానికి దూరం కావాల్సి రావడం షరీఫ్ కు ఇది ముచ్చటగా మూడోసారి.నవాజ్ షరీఫ్ రికార్డు స్థాయిలో మూడుసార్లు పాక్ ప్రధాని అయ్యారు. అదే రికార్డుతో మూడుసార్లు పదవీచ్యుతుడయ్యారు. ఒక్కసారి కూడా ఐదేళ్లకాలం గడపలేకపోయారు. మూడుసార్లూ బలవంతంగా ఆయనను గద్దె దింపారు. ఒకసారి ప్రెసిడెన్సీ రూల్, మరోసారి మిలిటరీ కుట్ర… తాజాగా అవినీతి కేసులో సుప్రీంకోర్టు తీర్పు… ఇలా మూడుసార్లూ షరీఫ్ పదవీకాలం ముగియకముందే దిగిపోయారు. మరో ఏడాది అయితే సార్వత్రిక ఎన్నికలు వచ్చేవి. ఈ సారి రికార్డు బ్రేక్ చేసేలా కనిపించినా అంతలోనే పనామా కేసు ఆయన మెడకు చుట్టుకొని గద్దె దించింది.పాక్ నియంత జియావుల్ హక్… షరీఫ్ ను రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. 1981లో వెస్ట్ పంజాబ్ ఆర్థికమంత్రిగా చేశారు. 1985లో పంజాబ్ ప్రావిన్స్ కు సీఎం అయ్యారు. 1990 నవంబర్ లో తొలిసారి పాకిస్థాన్ కు ప్రధాని అయ్యారు షరీఫ్. అయితే అధ్యక్షుడు గులాం ఇషాక్ ఖాన్ తో షరీఫ్ కు విభేదాలు తలెత్తాయి. దీంతో ఇషాక్ తో కలిసి అప్పటి ఆర్మీ చీఫ్ అబ్దుల్ వహీద్ కాకర్ 1993లో షరీఫ్ ను గద్దె దింపారు.1997లో ఆయన రెండోసారి భారీ మెజారిటీతో గెలిచి ప్రధాని అయ్యారు. అయితే అప్పుడు కూడా వరుసగా ఇద్దరు ఆర్మీ చీఫ్ లు జహంగీర్ కరామత్, పర్వేజ్ ముషారఫ్ తో షరీఫ్ కు పడలేదు. జహంగీర్ రాజీనామా చేయగా, ముషారఫ్ మాత్రం 1999 అక్టోబర్ లో తిరుగుబాటు చేసి షరీఫ్ ను గద్దెదింపారు. తన కొలంబో-కరాచీ విమానాన్ని హైజాక్ చేయించడానికి షరీఫ్ ప్రయత్నించారన్న ఆరోపణలతో ఆయనను పదవి నుంచి దించడంతోపాటు జీవితకాల శిక్ష విధించారు. 14 నెలల జైలు శిక్ష తర్వాత షరీఫ్ అమెరికా జోక్యంతో దేశం నుంచి బయటపడి సౌదీ అరేబియా వెళ్లిపోయారు. 2007లో పాకిస్థాన్ తిరిగొచ్చారు. 2013లో మూడోసారి పాక్ ప్రధాని అయ్యారు.మూడోసారి పాక్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన షరీఫ్ కు నాలగేళ్ల పదవీకాలం సాఫీగా సాగింది. పదవీగండం సెంటిమెంట్ ను బ్రేక్ చేసేలా కనిపించారు. కానీ అనూహ్యంగా పనామాగేట్ వ్యవహారం వెలుగుచూడటం, దానిపై ప్రతిపక్షాలు కోర్టును ఆశ్రయించడం, దర్యాప్తు కోసం జిట్ ఏర్పాటు, సుప్రీంకు జిట్ నివేదిక పరిణామాల క్రమంలో ప్రధానిగా అనర్హుడిని చేస్తూ ధర్మాసనం ఇచ్చింది. దీంతో షరీఫ్ రాజీనామా చేయాల్సి వచ్చింది.2016లో పరిశోధనాత్మక పాత్రికేయుల అంతర్జాతీయ బృందం కోటి పదిహేను లక్షల డాక్యుమెంట్లను బయటపెట్టడంతో ప్రపంచ వ్యాప్తంగా 
అనేకమంది ప్రముఖులు ఇరకాటంలో పడ్డారు. పనామా దేశంలోని మొస్సాక్ ఫొన్సెకా అనే లా ఫర్మ్‌కు నుంచి ఈ పత్రాలు బయట పడటం వల్ల పనామా పేపర్స్ కుంభకోణంగా పేరు పొందింది. షరీఫ్ కొడుకులు హుస్సేన్, హసన్, బిడ్డ మరియం పేర బ్రిటిష్ వర్జీనియా ఐలాండ్స్‌లో మూడు డొల్ల కంపెనీలు నమోదై ఉన్నాయనే సమాచారం ఈ పత్రాలలో ఉన్నది. ఈ కంపెనీలు రెండున్నర కోట్ల డాలర్ల మేర లావాదేవీలు జరిపాయి. లండన్‌లోని నాలుగు అపార్ట్‌మెంట్‌లను తాకట్టుగా పెట్టి లావాదేవీలు జరిపినట్టు వెల్లడికావడంతో, షరీఫ్‌పై ఆరోపణలకు లండన్ ఆస్తులు కేంద్రబిందువుగా మారాయి. పనామా పేపర్స్ విషయమై షరీఫ్ రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నాయి. చివరికి ఈ వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. గత ఏప్రిల్‌లో సుప్రీం కోర్టు ఉన్నత స్థాయి దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ 
నివేదిక షరీఫ్‌కు వ్యతిరేకంగా రావడంతో షరీఫ్ ప్రభుత్వం రోజులు లెక్కపెట్టుకుంటూ గడిపింది. సుప్రీం కోర్టు తీర్పు వ్యతిరేకంగా రావడంతో షరీఫ్ ప్రభుత్వం కూలిపోయింది. పాకిస్థాన్‌లో ప్రభుత్వాలు నిలకడగా ఉండవనేది మరోసారి ధ్రువపడింది. పాకిస్థాన్‌లో ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టించడంలో అందరి బాధ్యతా ఉన్నది. సైనిక పాలనకు అంతం పాడి, దేశాధ్యక్షుడికి ఉన్న విశేష అధికారాలను తగ్గించి, పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించే ప్రక్రియ పాకిస్థాన్‌లో ప్రారంభమైన తరువాత, దేశాధ్యక్షుడు గులాం ఇషాక్ ఖాన్ సైన్యం మద్దతుతో పార్లమెంటును రద్దు చేశారు. దీంతో ప్రధాని షరీఫ్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అవినీతి, అసమర్థత కారణాలను చూపి ప్రభుత్వాన్ని రద్దు చేసే అధికా రం దేశాధ్యక్షుడికి లేదని న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. దీంతో ప్రజాస్వామ్యం నిలబడింది. కానీ ఆ తరువాత కాలంలో షరీఫ్ సుప్రీంకోర్టుతో అనవసర వివాదానికి దిగక పోవలసింది. దేశాధ్యక్షుడు, ప్రధాని, న్యాయస్థానం మధ్య వివాదాలు సృష్టించుకోవడం వల్ల మధ్యలో సైన్యం పాత్ర కీలకంగా మారింది. పాకిస్థాన్‌లోని రెండు ప్రధాన 
రాజకీయ పక్షాలు బాధ్యతారహితంగా వ్యవహరించాయి. చివరికి న్యాయస్థానం కూడా అదే రీతిలో వ్యవహరించడమే ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా పరిణమించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *