Home > Editorial > మొండి బకాయిలపై చర్యలకు సిద్ధం

మొండి బకాయిలపై చర్యలకు సిద్ధం

మహిళా నీకు వందనం
జీఎస్టీ కోసం వడివడిగా అడుగులు

rbi-apduniaబ్యాంకులు, నిరర్థక ఆస్తులు(ఎన్‌పిఎలు), మొండిబాకీల సమస్య రోజురోజుకూ మోయలేని భారంగా తయారవుతుండటంతో, ఈ సమస్యలో నేరుగా జోక్యం చేసుకునేందుకు రిజర్వుబ్యాంక్‌కు అధికార మిస్తూ ఆర్థికమంత్రిత్వశాఖ రూపొందించిన ఆర్డినెన్స్‌ను రాష్ట్రపతి జారీ చేశారు. అటువంటి అధికారం రిజర్వుబ్యాంక్‌కు అసలు లేదని కాదు. పారుబాకీలు పెరుగుతుండటం పట్ల అది అనేక సందర్భాల్లో బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం 1949ని సవరిస్తూ జారీ అయిన తాజా ఆర్డినెన్స్ రిజర్వుబ్యాంక్‌కు ఆదేశిక అధికార మిస్తుంది. వచ్చే ఫిబ్రవరి నాటికి నిరర్థక ఆస్తుల్లో గణనీయమైన భాగాన్ని పరిష్కరించాలన్నది లక్ష్యం. కళ్లు మూసుకుని రద్దుచేస్తే తప్ప ఈ సమస్య పరిష్కారం అంత సులభం కాదు. 2016 డిసెంబర్ నాటికి అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులకు కలిపి నిరర్థక ఆస్తులు, పునర్యవస్థీకరించిన ఆస్తులు (రావలసిన అప్పులు) రూ.9.64లక్షల కోట్లు ఉన్నాయి. అంతకుముందు సంవత్సరంతో పోల్చితే పెరిగిన నిరర్థక ఆస్తులు రూ.6.1లక్షల కోట్లు. ఏప్రిల్-డిసెంబర్ మధ్య రాబట్టినవి రూ.46,245 కోట్లు. మొత్తం నిరర్థక ఆస్తుల్లో 60శాతం 50రుణ ఖాతాల్లోనే ఉన్నాయి.

2000సంవత్సరం నుంచి రద్దుచేసిన రుణాలు రూ.4లక్షల కోట్లు. బ్యాంకు ఖాతాలను ప్రక్షాళన చేయాలన్న రిజర్వుబ్యాంక్ ఆదేశాల వల్ల, రద్దు చేసిన నిరర్థక ఆస్తులకు బ్యాంకులు తమ ఆస్తులను సర్దుబాటు చేయటంవల్ల 2015లో రూ.37,540 కోట్లుగా ఉన్న నికరలాభం 2016లో రూ.17,993 కోట్ల నికరనష్టంగా మారింది. కోట్ల రూపాయల రుణం తీసుకుని..ఆ తరువాత కుచ్చుటోపీ పెట్టే బడా బాబుల వ్యవహారం మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. పెద్ద పెద్ద వాళ్లకు ఇష్టానుసారంగా అప్పులిచ్చేస్తున్న బ్యాంకులు తిరిగి వసూలు చేసుకోవడానికి అష్టకష్టాలు పడుతున్నాయి. వాటి పరిస్థితి చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందాన్న తయారవుతోంది.రుణాల వసూలుకు కఠిన చర్యలు తీసుకోకపోతే పారుబాకీలు రూ.14లక్షల కోట్లకు చేరి బ్యాంకింగ్ వ్యవస్థ తలకిందులయే ప్రమాదముంది. పనితీరు మెరుగు పరుచుకుని మీ బతుకు మీరు బతకండి లేదా మూసివేత చర్యలు తప్పవని అరడజను బ్యాంకులకు ఆర్థికమంత్రిత్వశాఖ ఇటీవల చేసిన హెచ్చరిక ఈ సందర్భంగా గుర్తుచేసుకోదగింది. ప్రభుత్వంనుంచి పునఃపెట్టుబడి కోరుతున్న బ్యాంకులు పలు షరతులు అంగీకరిస్తూ అవగాహన పత్రంపై సంతకం చేయాలని కొద్దిరోజుల క్రితం మరో ప్రకటన వెలువడింది. ఇవన్నీ ప్రభుత్వ బ్యాంకింగ్ రంగం ఎదుర్కొంటున్న తీవ్రమైన సంక్షోభానికి సూచికలు.మొండిబాకీల కేసులను పరిష్కరించటానికి బ్యాంక్ యాజమాన్యాలు చొరవ తీసుకోవటం లేదు. రాజీ పరిష్కారం చేస్తే అందులో ఏదో మతలబు ఉందని రిటైర్మెంట్ తర్వాత కేసులకు గురవుతామన్న భయం వారి చొరవను నిరోధిస్తున్నది. అందువల్ల అవినీతి నిరోధక చట్టాన్ని సవరించాలని వారు కోరుతున్నారు. ఇప్పుడు ఆర్డినెన్స్‌వల్ల రిజర్వుబ్యాంక్ ప్రత్యక్ష పర్యవేక్షణలో సెటిల్మెంట్లకు వీలు కలుగుతుంది. అయితే మొండిబాకీలు గత ఐదేళ్లలోనే ఎక్కువగా ఎందుకు పెరిగాయన్నది లోతుగా పరిశీలించాల్సిన అంశం. ఒక్కొక్క కేసును దాని మంచి-చెడుల ప్రాతిపదికగా నిర్ణయించాల్సి ఉంటుంది. అయితే అప్పులు పేరుకుపోవటానికి బడాబాబులకున్న రాజకీయ అండతో పాటు అనేక కారణాలున్నందున నిరర్థక ఆస్తుల సమస్య పరిష్కారానికి ఈ ఆర్డినెన్స్ మంత్రదండం కాజాలదు.అమెరికాలో 2008నాటి ద్రవ్యసంక్షోభంలో పర్వతాల్లాంటి బ్యాంకులు కుప్పకూలగా ప్రభుత్వం వాటిలో కొన్నింటికి దాదాపు 800 బిలియన్ డాలర్లు పునఃపెట్టుబడికింద చొప్పించింది. పరిస్థితి మెరుగైనాక ఆ వాటాలను ప్రజలకు విక్రయించారు. దాంతో బ్యాంకులు మళ్లీ ప్రైవేటు యాజమాన్యంలోకి వెళ్లాయి. బ్రిటన్ కూడా అదే నమూనా అనుసరించింది. ప్రభుత్వరంగంలో విశ్వాసంలేని భారత ప్రభుత్వం కూడా నెమ్మదిగా, నిలకడగా అటు ప్రయాణం చేస్తున్నట్లు సందేహించాల్సి వస్తోంది. నిరర్థక ఆస్తుల పెరుగుదలకు మూలమైన సమస్యల జోలికి వెళ్లకుండా బ్యాంకులపైనే ఒత్తిడి చేయటం, పునఃపెట్టుబడి సమకూర్చేందుకు షరతులు విధిస్తుండటం గమనించదగ్గ అంశాలు. మరో వైపు బ్యాంకుల్లో పేరుకుపోయిన లక్షల కోట్ల మొండి బకాయిల వసూలుపై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించింది. ఈ బాకీలను వసూలు చేసేందుకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న మౌలిక యంత్రాంగం సరిపోతుందా అని కేంద్రాన్ని నిలదీసింది.

మొండి బకాయిల వసూలుకు చేపడుతున్న చర్యలపై ప్రభుత్వం సమగ్ర వివరణ ఇవ్వాలని ఆదేశించింది. మొండి బకాయిలతోపాటు నిరర్ధక ఆస్తుల అంశాన్ని ప్రభుత్వం ఎలా ఎదుర్కోవాలని చూస్తోందో మరింత స్పష్టత ఇవ్వాలని ప్రధాన న్యాయమూర్తి తో కూడిన సుప్రీం బెంచ్‌ కేంద్రాన్ని వివరణ కోరింది.నిర్దిష్ట కాలపరిమితిలో మొండి బకాయిల వసూలు చేయడం సాధ్యమేనా అన్న అంశంపైనా ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని సుప్రీం బెంచ్‌ సూచించింది.. రాని బాకీల వసూలుకు మౌలిక యంత్రాంగం, డెబిట్‌ రికవరీల మెరుగుదలకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టిందో వివరించాలని కోరింది. ఇదే అంశంపై గత విచారణలోనూ డెబిట్‌ రికవరీ ట్రిబ్యునల్స్‌ దగ్గర అవసరానికి తగినంత మౌలిక వసతులు లేవని సర్వోన్నత న్యాయస్ధానం ఆందోళన వ్యక్తం చేసింది. డెబిట్‌ రికవరీ ట్రిబ్యునల్స్‌ దగ్గర ఎన్ని కేసులు పెండింగ్‌లో ఉన్నాయో ఆ వివరాలను కూడా ఇవ్వాలని కేంద్రాన్ని కోర్టు ఆదేశించింది. ఇక ఇదే కేసుపై గతంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టిఎస్‌ ఠాకూర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థల రుణ బకాయిల వసూలుకు డెబిట్‌ రికవరీ ట్రిబ్యునల్స్‌, డెబిట్‌ రికవరీ అప్పీలేట్‌ ట్రిబ్యునల్స్‌కు ఎదురవుతున్న ఆటంకాలపై అధ్యయనం చేయాలని నేషనల్‌ లా స్కూల్‌, ఐఐఎం బెంగుళూర్‌లను కోరతామని తెలిపారు. 500 కోట్లకు పైబడి రుణాలు తిరిగి చెల్లించని వారి పేర్లను ప్రకటించే అవకాశాలను పరిశీలించాలని సుప్రీంకోర్టు గతంలో ఆర్‌బీఐతో పాటు కేంద్రాన్ని ఆదేశించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Facebook Auto Publish Powered By : XYZScripts.com