Home > Editorial > వ్యూహా, ప్రతివ్యూహాలతో రాష్ట్రపతి ఎన్నికలు

వ్యూహా, ప్రతివ్యూహాలతో రాష్ట్రపతి ఎన్నికలు

ఖతర్ ఆర్ధిక దిగ్భంధనానికి వెనుక రహస్య అజెండా
విద్యార్ధుల్లో కొరవడుతున్న సాఫ్ట్ స్కిల్స్

president elections_apduniaరాష్ట్రపతి ఎన్నికల వేడి రాజుకుంటోంది. ఎన్నికల కమిషన్‌ షెడ్యూల్‌ విడుదల చేసిన నేపథ్యంలో అధికార, ప్రతిపక్షాలు వ్యూహాలను ముమ్మరం చేస్తున్నాయి. అభ్యర్థి ఎంపిక విషయమై చర్చించేందుకు అధికార బిజెపి ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటుచేసింది. ఈ కమిటీలో బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, సమాచార ప్రసార శాఖ మంత్రి వెంకయ్యనాయుడు సభ్యులుగా ఉన్నారు. రాష్ట్రపతి ఎన్నికల విషయమై ఈ కమిటీ భాగస్వామ్య పక్షాలతో చర్చలు జరపనున్నట్లు అమిత్‌ షా వెల్లడించారు. రాష్ట్రపతి అభ్యర్థి ఎవరనే విషయాన్ని బిజెపి ఇంకా నిర్ణయించలేదని, ఆయా పార్టీలతో త్రిసభ్య కమిటీ చర్చల తర్వాతే అభ్యర్థిని ప్రకటిస్తామన్నారు. ఇంతకుముందు ఎన్‌డిఎ కూటమిపార్టీలతో బిజెపి అధిష్టానం ఒక్కసారి మాత్రమే సమాలోచనలు జరిపింది. మరో వంక ప్రతిపక్షాలు ఇప్పటికే పలు దఫాలు భేటీ జరిపి అభ్యర్థి ఎంపికపై కసరత్తులు ప్రారంభించాయి. ప్రతిపక్షాల తరపున రాష్ట్రపతి అభ్యర్థిని ఎవరనేది నిర్ణయించేందుకు ఏడుగురు సీనియర్‌ సభ్యులతో కమిటీని నియమించాయి.రాష్ట్రపతి ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అభ్యర్థుల ఎంపికపై చర్చ జరుగుతోంది. అధికార, ప్రతిపక్షాలు ఎవరె వరిని అభ్యర్థులుగా దించబోతున్నాయనే అంశమై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే ఆయా పక్షాలు ఇప్పటికే ఒక స్పష్టతకు వచ్చినట్లు సమాచారం. అధికార ఎన్డీఏ తరపున తొలుత రాష్ట్రపతి పదవికి లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహా జన్‌, మణిపూర్‌ గవర్నర్‌ నజ్మా హెప్తుల్లా, జార్ఖండ్‌ గవర్నర్‌ ద్రౌపదీ ముర్మూ, కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రి తావర్‌ చంద్‌ గెహ్లాట్‌ పేర్లు వినిపించాయి. కానీ చివరికి జార్ఖండ్‌ గవర్నర్‌, బిజెపి నాయకురాలు ఒరిస్సాకు చెందిన ద్రౌపది ముర్మూను అభ్యర్థిగా ప్రకటించే అవకాశముంది. దీంతో ఆదివాసీ మహిళ పేరుతో కుల సెంటిమెంట్‌ను తీసుకొచ్చేందుకు బిజెపి వ్యూహ్యం పన్నుతోంది. కాంగ్రెస్‌, దాని మిత్రపక్షాలు, వామపక్షాలు, జనతా పరివార్‌ పార్టీల ఉమ్మడి అభ్యర్థి ఎవరవుతారనే ఊహాగానాలు జోరందు కుంటున్నాయి. తొలుత జెడియు సీనియర్‌ నేత శరద్‌ యాదవ్‌, ఎన్సీపి అధ్యక్షుడు శరద్‌ పవార్‌లలో ఎవరినో ఒకరిని ఎంపిక చేస్తారని భావించడం జరిగింది. పశ్చిమ బెంగాల్‌ పాలక పక్షం తణమూల్‌ మాత్రం మళ్లీ ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీనే నిలబెట్టా లని కోరింది. ఇటీవల ఎన్డీయే పక్షమైన శివసేన కూడా ప్రణబ్‌ను మళ్లీ నిలబెట్టాలని అధికార పక్షానికి కోరింది. సమాజ్‌ వాదీ పార్టీ స్థాపకుడు ములాయం సింగ్‌ యాదవ్‌ కూడా ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారనే అభిప్రాయాలు వ్యక్తమౌతు న్నాయి. చివరికి సిపిఎం ప్రతిపాదించిన గాంధీ మనుమడు; దౌత్యవేత్త గోపాలకృష్ణ గాంధీ పట్ల అంగీకారం తెలిపినట్లు సమాచారం. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి అభ్యర్థులుగా ఎవర్ని నిలబెట్టాలనే విషయంపై ప్రతిపక్ష పార్టీలు సమావేశం కానున్నాయి. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ సమావేశానికి సిపిఎం, జెడియు, ఆర్జేడీ, బిఎస్సీ, ఎస్పీ, సిపిఐ, డిఎంకె, తృణముల్‌ కాంగ్రెస్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ తదితర రాజకీయ పక్షాలకు చెందిన నేతలు హాజరుకానున్నారు. రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో ప్రతి పక్షపార్టీల్లో ఏకాభిప్రాయం ఈ సమావేశంలో వచ్చే అవకాశముంది. ఇప్పటికే పలుమార్లు ఆయా పార్టీల అధినేతలు ఈ విషయంపై చర్చించారు. రాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేసేందుకు ప్రతిపక్షాల నుంచి ఏడుగురు సభ్యులతో కూడిన ఓ బందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బందంలో గులాం నబీ ఆజాద్‌(కాంగ్రెస్‌), శరద్‌ యాదవ్‌(జెడియు), లాలూప్రసాద్‌ యాదవ్‌(ఆర్జేడీ), సీతారాం ఏచూరి(సిపిఎం), ఓబ్రియన్‌(తణమూల్‌ కాంగ్రెస్‌), రాంగోపాల్‌ యాదవ్‌ (ఎస్పీ), ప్రఫుల్‌ పటేల్‌(ఎన్సీపి) తదితరులు సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ ఇప్పటికే పలుసార్లు భేటీ అయ్యింది. గత సాంప్రదాయాన్ని ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం విస్మరిస్తోందని, దేశ ప్రథమ పౌరుడిని ఎన్నుకొనే ముందు ప్రతిపక్షాలతో చర్చించి అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తిని నియమించాలని ఇప్పటికే కాంగ్రెస్‌, సిపిఎం, సిపిఐ తదితర పార్టీలు డిమాండ్‌ చేశాయి. అయితే తమకు అనుకూలంగా వ్యవహరిస్తాయని భావిస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వైసిపి, తమిళనాడుకు చెందిన అన్నాడిఎంకె వంటి పార్టీలతో భేటీలు జరుపుతోంది.ఎన్డీయేలోని మిత్రపక్షాలు, మద్దతునిస్తున్న ఇతర చిన్నాచితక పార్టీలతో కలుపుకొంటే అధికార బిజెపికి ఇప్పుడు ఎలక్టోరల్‌ కాలేజీలో 48.64 శాతం ఓట్లున్నాయి. దీనికి తోడు వైసిపి తన మద్దతును ప్రకటించింది. వైసిపి ఎలక్టోరల్‌ ఓట్ల శాతం 1.53గా ఉంది. బిజెపి శిబిరానికి ఇప్పుడున్న బలానికి (48.64 శాతం) వైసిపి కలిస్తే వారి అభ్యర్థికి 50.17 శాతం ఎలక్టోరల్‌ కాలేజీ మద్దతు ఉన్నట్లే.
అన్నాడిఎంకె, టిఆర్‌ఎస్‌ కూడా ఎన్‌డియే అభ్యర్థికే మద్దతిచ్చే అవకాశాలెక్కువగా కనిపిస్తున్నాయి. ఎన్డీయేలో కీలక పార్టీగా వ్యవహరిస్తున్న శివసేన ఇప్పటికీ తన అభిప్రాయాన్ని వెల్లడించలేదు. రాష్ట్రపతి ఎన్నికకు ఇటీవల ఈసీ ప్రకటన వెలువరించింది. జులై 20న ఎన్నిక నిర్వహించనుండగా, జులై 23న ఫలితాలను వెల్లడించ నున్నారు. ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ పదవీ కాలం జులై 23తో ముగియనుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *