Home > General > ప్రమాదంలో ప్రజారోగ్యం

ప్రమాదంలో ప్రజారోగ్యం

తిరుపతి సిగలో "సెల్‌" పువ్వు
పరిహారం అందక మత్స్య కారుల ఆందోళన

seasonal_apduniaఎన్ని సమీక్షలు జరిపినా, ఎన్ని సార్లు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసిన వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వీడడం లేదు. సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాల్సిన అధికారులు వాటిని సాధారణంగా తీసుకుంటున్నారు. ఎప్రిల్‌, మేలో ఎండధాటికి జనం అల్లాడారు. గత వారంలో కురిసిన వర్షానికి వాతావరణంలో మార్పులు వచ్చాయి. దీంతో పాటే సీజనల్‌ వ్యాధులూ వచ్చాయి. వీటిని నియంత్రించాల్సిన వైద్య ఆరోగ్య శాఖ ఎప్పటిలాగానే నిర్లక్ష్య ధోరణి అవలంభిస్తోంది. దీనికి తోడు ఆ శాఖలో నిధుల కొరత కూడా వైద్య చికిత్సలపై ప్రభావం చూపుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు నిధుల లేమి వెంటాడుతోంది. ఆయా ఆసుపత్రులకు సరైన స్థాయిలో నిధులు మంజూరు కాకపోవడంతో రోగులకు పూర్తి స్థాయిలో వైద్య చికిత్సలు అందడం లేదనే భావన వ్యక్తం అవుతోంది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన
తరువాత వైద్య ఆరోగ్య శాఖకు కేటాయించే నిధుల్లో కోత పెట్టటం, కేంద్రం ఇచ్చే ఎన్‌ఆర్‌హెచ్‌ఎం నిధులను మంజూరు చేయడంలోనూ నిర్లక్ష్య ధోరణి కన్పిస్తోంది. నిధుల లేమి కారణంగా అనేక కార్యక్రమాలు వైద్య ఆరోగ్య శాఖలో నిలిచిపోయాయి.మారిన వాతావరణ పరిస్థితుల దృష్ట్యా జిల్లాలో మలేరియా, టైఫాయిడ్‌, వైరల్‌, డెంగ్యూ జ్వరాలతో ప్రజలు ఆసుపత్రుల్లో చికిత్సలు పొందుతున్నారు. ఈ మధ్యనే శెట్టూరు ప్రాంతంలో డెంగ్యూతో ఒక వ్యక్తి మరణించాడు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా వైద్య ఆరోగ్య శాఖ వ్యహరింస్తుండడంతో పేద ప్రజలు మృత్యువాత పడుతున్నారు. సీజనల్‌ వ్యాధులపై ప్రజలను ముందుగానే చైతన్య పరచాల్సిన అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. ప్రజలు ఆసుపత్రి వరకు వస్తేగాని ఎలాంటి జబ్బులు వస్తున్నాయనే విషయాలు గుర్తించటం లేదు. జిల్లా వ్యాప్తంగా సీజనల్‌ వ్యాధులు విస్తృతంగా ప్రబలుతున్నాయి. ప్రజలు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. అధికారిక లెక్కల ప్రకారం దాదాపు 2,500 జ్వరాల బారిన పడ్డారు. అనధికారికంగా ఈ సంఖ్య రెండింతలు ఉన్నట్లు
తెలుస్తోంది. డెంగ్యూ లక్షణాలు దాదాపు 150 మందికి ఉన్నట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్య లోపం కారణంగా దోమలు ఉత్పత్తి అంతకంతకు పెరుగుతోంది. దోమల నియంత్రణకు చేపడుతున్న చర్యలు నామమాత్రంగానే ఉంటున్నాయి. సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తం చేయాల్సిన అధికారులే నిద్రమత్తులో ఉండడంతో ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారు. గతంలోనూ ఇదే క్రమంలో డెంగ్యూ వ్యాధితో జిల్లా కేంద్రంలో ఒకే కుటుంబంలో ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడ్డారు. జిల్లా వ్యాప్తంగా మరో ఎనిమిది మంది మృతి చెందారు. జిల్లాలో డెంగ్యూ, విషజ్వరాలకు మెరుగైన చికిత్స అందుబాటులో లేకపోవటంతో ప్రజలు ఇతర ప్రాంతాల్లోని ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది.ప్రభుత్వం ప్రతి శుక్రవారం నిర్వహించే డ్రైడే పట్ల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. డ్రైడేను నామమాత్రంగా జరిపి మమ
అనిపించటం తప్పితే క్షేత్ర స్థాయిలో ఫలితాలు సాధించటం లేదు. డ్రే డే పేరుతో నిధులు స్వాహా చేస్తున్నారనే విమర్శలూ లేకపోలేదు.అన్ని పిహెచ్‌సి స్థాయిల్లో సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని సూచనలు ఇచ్చాం. డెంగ్యూ లక్షణాలు ఉంటే వెంటనే సమాచారం ఇవ్వాలని మెడికల్‌ ఆఫీసర్లకు చెప్పాం. సీజన్‌ ప్రారంభం కావటంతో దోమల నియంత్రణకు ఇతర శాఖల సమన్వయంతో కృషి చేస్తున్నాం. ప్రజలు కూడా తమ బాధ్యతగా సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా వైద్యఆరోగ్య శాఖ అధికారి. డాక్టర్‌ వెంకట రమణ,  సూచిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *