Home > Editorial > అట‌కెక్కిన‌ విశ్రాంతి కేంద్రాలు!

అట‌కెక్కిన‌ విశ్రాంతి కేంద్రాలు!

డిజిటిల్‌ అక్షరాస్యత అంతా మిధ్య
తీవ్ర ఉద్రిక్తతల మధ్య చల్లటి ఒప్పందం

rest roomsహైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ ను ఆనుకుని విశ్రాంతి కేంద్రాలను ఏర్పాటు చేస్తామని హెచ్ ఎం డి ఏ చేసిన ప్రకటన కాగితాలకే పరిమితమైందా? దూర ప్రాంతాల నుంచి వ‌చ్చే వారికి అవుట‌ర్ రింగ్ రోడ్ లో రెస్ట్ సెంటర్స్ ఇప్పట్లో అందుబాటులోకి రావా? అంటే, అవుననే అనిపిస్తోంది. అవుట‌ర్ లో లాజిస్టిక్ హ‌బ్ ల ఏర్పాటుకు గ‌త అక్టోబ‌ర్ లోనే అనుమ‌తి వ‌చ్చినా ఇప్పటి వ‌ర‌కూ ప‌నులు ప్రారంభం కాక‌పోవ‌డంతో ఈ సందేహాలు బలపడుతున్నాయి. అవుట‌ర్ రింగ్ రోడ్ ను ఆనుకుని విశ్రాంతి కేంద్రాల‌ను ఏర్పాటు చేస్తామ‌ని హెచ్ఎండిఎ అధికారులు ప్రకటన చేసి ఏళ్ళు గ‌డుస్తున్నా కార్యరూపం దాల్చడం లేదు. దీంతో ప్రయాణికులకు ఆపసోపాలు తప్పడంలేదు. న‌గ‌రానికి వ‌చ్చే సంద‌ర్శకులు, ప్రయాణీకులతో పాటు న‌గ‌ర వాసులు కూడా శివారు ప్రాంతాల‌కు వెళ్ళి సేద‌ తీరేందుకు అనువుగా లాజిస్టిక్ కేంద్రాల‌ను ఏర్పాటు చేయాల‌ని నిర్ణయించారు.  ప‌బ్లిక్, ప్రైవేటు పార్టనర్‌ షిప్‌లో ఎంతో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులుగా హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ రెండు లాజిస్టిక్‌ హబ్‌ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఓఆర్‌ఆర్‌పై ఉన్న 19 ఇంటర్‌ చేంజ్‌ జంక్షన్లను భవిష్యత్‌ అభివృద్ధి కేంద్రాలుగా చేసుకొని ప్రాథమికంగా బొంగులూరు ఇంటర్‌ చేంజ్‌ వద్ద, పెద్ద అంబర్‌పేట ఇంటర్‌చేంజ్‌ సమీపంలో రెండు లాజిస్టిక్‌ హబ్‌లను పీపీపీ విధానంలో ప్రైవేటు సంస్థలను ఎంపిక చేశారు. గత ప్రభుత్వ సమయంలోనే ఈ ప్రతిపాదిత లాజిస్టిక్‌ పార్కులకు సంబంధించి టెండర్‌ ప్రక్రియ, ఎంపిక పూర్తయినా ప్రభుత్వ అనుమతులు మాత్రం ఏళ్ల తరబడిగా పెండింగ్‌లోనే ఉన్నాయి. రాష్ట్ర విభ‌జ‌న అన‌ంతరం ఐటీ, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్‌ చొరవతో ప్రాజెక్టులో కదలిక వచ్చింది. ఈ మేర‌కు గత అక్టోబర్‌లోనే దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి పరిపాలనా అనుమతి సైతం వచ్చినా ఇంకా పనులను ప్రారంభించడంలో మాత్రం ఆస‌క్తి చూపించ‌డం లేదు. హెచ్ఎండిఎ ప్రక‌ట‌న‌ల‌కు, చేస్తున్న పనులకు పొంత‌న లేకుండా పోతుంద‌నే విమర్శలు వినిపిస్తున్నాయి. హైద‌రాబాద్ ను విశ్వన‌గ‌రంగా తీర్చిదిద్దాల‌ని ఓ వైపు తెలంగాణ స‌ర్కార్ ఉత్సాహం చూపిస్తుంటే మ‌రోవైపు ప్రభుత్వ సంస్థల నుంచి మాత్రం ఆస‌క్తి క‌నిపించ‌డం లేదు. న‌గ‌రాభివృద్ధిలో భాగంగా హెచ్ఎండిఎం చేసిన అవుట‌ర్ లాజిస్టిక్ హ‌బ్ ల ప్రక‌ట‌న ఎప్పటికి కార్యరూపం దాలుస్తుందో వేచి చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *