Home > General > రాజధాని జిల్లాలో శంకర్ దాదాలే దిక్కు

రాజధాని జిల్లాలో శంకర్ దాదాలే దిక్కు

తెలంగాణలో జీఎస్టీ భారం 12 వేల కోట్లు
బస్సెక్కితే బాదుడే

doctors4_apduniaజిల్లాలో పల్లె జనానికి  సరైన వైద్యం అందడం లేదు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో డాక్టర్లు అందుబాటులో ఉండటం లేదు. దీంతో ఏ జబ్బు వచ్చినా ఆర్‌ఎంపీలే దిక్కు. దీనికి కారణం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సక్రమంగా పని చేయకపోవడమే. అందుబాటులో ఉండని ప్రభుత్వ వైద్యులకంటే ఇంటి వద్దకు వచ్చి వైద్య సేవలందించే ఆర్‌ఎంపీలే నయమనే స్థితికి పల్లె జనం వచ్చేశారు. రాజధాని నిర్మాణం జరుగుతున్న గుంటూరు జిల్లాలోని వందలాది గ్రామాలు ఇప్పటికీ ఆర్‌ఎంపీల వైద్యంపైనే ఆధార పడుతున్నాయంటే వైద్య, ఆరోగ్య శాఖ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆర్‌ఎంపీలు నిబంధనలకు అనుగుణంగా పని చేయాల్సి ఉన్నప్పటికీ వీరిలో కొందరు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. డెలివరీలు, చిన్న చిన్న ఆపరేషన్‌లు నిర్వహిస్తూ ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తున్నారు. ఆర్‌ఎంపీలు వైద్యసేవలు అందించేందుకు రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలి. ఇవేమీ పట్టించుకోకుండా గ్రామాల్లో క్లినిక్‌ల పేరుతో ఆసుపత్రులను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఆర్‌ఎంపీల వల్ల ఇబ్బందులు పడి అనేక మంది ప్రాణాలకు ముప్పు తెచ్చుకున్నారు. 
ఇటీవల ఫిరంగిపురానికి చెందిన పరగటి కుమారి అనే వివాహిత జ్వరంతో బాధపడుతూ స్థానిక ఆర్‌ఎంపీ అమర్లపూడి ఇమ్మానియేల్‌ను ఆశ్రయించింది. ఆమెను పరీక్షించిన ఆర్‌ఎంపీ కొన్ని మందులు రాసి ఇచ్చాడు. అవి వాడిన వెంటనే మహిళ ముఖం కాలినట్లుగా నల్లగా మారి, కంటిచూపు సైతం కోల్పోయింది. అయితే దీనిపై ఆర్‌ఎంపీని ప్రశ్నించగా.. తాను జ్వరం తగ్గేందుకు మందులు ఇచ్చానని, వాటితో కళ్లకు ఎటువంటి ప్రమాదం ఉండదని సమాధానం ఇచ్చాడు. బాధితురాలు మాత్రం తాను వైద్యం వికటించడం వల్లే కంటిచూపు కోల్పాయానంటూ ఫిరంగిపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది.  ఇలాంటి ఘటనలు ఇటీవల చాలానే చోటు చేసుకున్నాయి. గుంటూరు జిల్లాలో మొత్తం 83 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకుగాను సుమారు 20 వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పని చేస్తున్న 80 శాతం మంది సిబ్బంది జిల్లా కేంద్రమైన గుంటూరు నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో ఉదయం 9 గంటలకు ఆసుపత్రిలో ఉండాల్సిన వైద్యులు 12 గంటలకు చేరుకుంటున్నారు. తిరిగి మధ్యాహ్నం భోజన సమయానికి వెళ్లిపోతుండటంతో
రోగులకు వైద్య చికిత్సలు అందడం లేదు. పనిచేసే చోటే నివాసం ఉండాలన్న నిబంధనలు ఉన్నప్పటికీ వైద్యులు దాన్ని లెక్క చేయడంలేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు చర్యలు తీసుకుని పల్లెల్లో మెరుగైన వైద్యసేవలు అందేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *