Home > Bhakti > హనుమంత వాహనంపై శ్రీ గోవిందరాజస్వామి వైభవం

హనుమంత వాహనంపై శ్రీ గోవిందరాజస్వామి వైభవం

షిర్డీ ఆలయంలో ఎనర్జీ పెడల్స్
గ్రేటర్ లో బోనాల ముస్తాబు
 
Hanumantha-Vahanam_apduniaతిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన సోమవారం ఉదయం శ్రీ గోవిందరాజస్వామివారు హనుమంత వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. ఉదయం 7.00 నుండి 8.30 గంటల వరకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. భక్తజన బృందాల చెక్కభజనలు, కోలాటాలు, కేరళ కళాకారుల డ్రమ్స్, మంగళవాయిద్యాల నడుమ హనుమంత వాహనసేవ వైభవంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. త్రేతాయుగంలో శ్రీరామభక్తునిగా ప్రసిద్ధిగాంచినవాడు హనుమంతుడు. రాముడు భక్తాగ్రగణ్యుడైన హనుమకు ఆత్మతత్త్వాన్ని బోధించినట్టు ప్రాచీనవాఙ్మయం నుండి తెలుస్తోంది. బుద్ధి, బలము, యశస్సు, ధైర్యము, నిర్భయత్వం, ఆరోగ్యం, అజాడ్యం, వక్తృత్వం హనుమంతుని స్మరిస్తే లభిస్తాయి. అందువల్ల శరణాగతికి ప్రతీకగా స్వామివారు హనుమంత వాహనంపై ఊరేగుతారు. అనంతరం ఉదయం 9.30 నుండి 11.00 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవిందరాజస్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్ళతో అభిషేకం చేశారు. సాయంత్రం 4.00 నుండి 5.00 గంటల వరకు వసంతోత్సవం వైభవంగా జరిగింది. అనంతరం సాయంత్రం 5.00 నుండి 6.00 గంటల వరకు శ్రీవారు బంగారు తిరుచ్చిపై నాలుగు మాడ వీధుల్లో ఊరేగారు. రాత్రి 8.00 నుండి 9.30 గంటల వరకు గజ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. 
 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *