Home > Bhakti > ఘనంగా సిరిమాను సంబరాలు

ఘనంగా సిరిమాను సంబరాలు

అయోధ్యలో శతకోటి రామనామ జప మహా యజ్ఞం
రాహుకేతు పూజా టికెట్ల ధర రూ. 500కి పెంపు

sirimanu-celabrations-apduniaఉత్తరాంధ్ర ప్రజల కొంగుబంగారం, విజయనగరం ప్రజల ఆరాధ్యదైవం శ్రీపైడితల్లి అమ్మవారి సిరిమాను సంబరానికి అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. నెలరోజులు పాటు జరిగే అమ్మవారి జాతర మహోత్సవాలలో ప్రధాన ఘట్టమైన సిరిమాను సంబరం నేడు అత్యంత వైభవంగా జరిగింది.సిరిలొలికించే పైడితల్లి దీవెనల కోసం లక్షల మంది భక్తులు విజయనగరం కు తరలివెళ్తున్నారు. సిరిమాను ఉత్సవాన్ని తిలకించేందుకు వస్తున్న భక్తజనంతో విజయనగరం పట్టణం కిటకిటలాడుతోంది.  విజయనగరం పట్టణంలో వెలసిన శ్రీపైడితల్లి అమ్మవారంటే జిల్లా వాసులకే కాదు, ఉత్తరాంధ్ర ప్రజలకు కొంగుబంగారం. అమ్మవారి కటాక్షం కోసం సుదూరు ప్రాంతాల నుంచి సైతం భక్తులు తరలివస్తుంటారు. ఇక అమ్మవారి సిరిమాను సంబరాలంటే విజయనగరం పట్టణంలో ఒకటే సందడి. నెల రోజుల పాటు పట్టణంలో పండగ సందడి కనిపిస్తుంది. అమ్మవారి సిరిమాను సంబరాల్లో ప్రధాన ఘట్టమైన సిరిమాను ఊరేగింపు ఉత్సవాన్ని తిలకించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా, పక్క రాష్ట్రాల నుంచి కూడా లక్షల మంది జనం తరలివస్తుంటారు. ఆ అపురూప ఘట్టం ఈ రోజు జరిగింది.

విజయనగర రాజు పెద విజయరామరాజు చెల్లెలు పైడిమాంబ అంటారు. పైడిమాంబ బాల్యం నుంచే దేవీ భక్తురాలు. 1757లో బొబ్బిలి యుద్ధంలో తాండ్రపాపారాయుని చేతిలో పెద విజయరామరాజు మరణించాడు. అయితే, అంతకుముందే ప్రెంచ్ సేనాని బుస్సీ కుట్ర విషయాన్ని తన అన్న విజయరామరాజుకు తెలియజేయాలని ఎంత ప్రయత్నించినా ఫలించలేదు. దీంతో ఆ విషయాన్ని బొబ్బిలి యుద్ధంలో ఉన్న అన్న విజయరామరాజుకు తెలియజేయాలనే పట్టుదలతో పతివాడ అప్పలనాయుడు అనే అనుచరుడు సహాయంతో ఆమె స్వయంగా గుర్రపు బగ్గీపై బయలుదేరింది. అయితే, ఇంతలోనే ఆమెకు విజయరామరాజు మరణవార్త తెలుస్తుంది. దాంతో ఆమె ఒక్కసారిగా సృహ కోల్పోగా, అప్పలనాయుడు ఆమెకు సేదతీరుస్తాడు. ఆమెకు మెలకువ వచ్చి, తాను ఇక బతకనని, దేవీలో లీనమైపోతున్నానని, తన విగ్రహం పెద్ద చెరువులో దొరుకుతుందని, దానిని ప్రతిష్టించి పూజలు చేయాలంటూ కోరుతుంది. ఆమె చెప్పినట్లుగా పైడిమాంబ విగ్రహం ప్రస్తుతం ఉన్న పెద్ద చెరువులో దొరకగా, అప్పటి తర్వాత రాజు ఆనందగజపతిరాజు దానిని ప్రతిష్టించి పూజలు చేయడం ప్రారంభించారు. పైడితల్లి అమ్మవారి విగ్రహాన్ని వెలికితీసిన పతివాడ అప్పలనాయుడే మొదటి పూజారి. ఇక అప్పటి నుంచి అంటే 1758 నుంచి అమ్మవారి సిరిమాను ఉత్సవాలు జరుగుతున్నాయి.

పైడిమాంబ సంబరాలు అంబరాన్ని తాకుతాయి. ఊకరాలనంత జనం ఉత్సవ వేడుకల్లో పాల్గొంటారు. తొలేళ్ల ఉత్సవం నుంచి ఉయ్యాల కంబాల వరకు జరిగే వేడుకల్ని పైడిమాంబ సంబరాలుగా వ్యవహరిస్తారు. వీటన్నింటిలో తొలేళ్లు ఉత్సవం, సిరిమాను సంబరం ప్రధానమైనవి. పైడితల్లి అమ్మవారి పండగకు నెల రోజుల ముందు అమ్మవారి ప్రధాన పూజారి కలలో కనిపించి సిరిమాను చెట్టును గురించి తెలియజేస్తుందని ప్రచారం. ఈ సిరిమాను ఏ ఏడాదికి ఆ ఏడాది కొత్తగా తయారు చేస్తారు. చెట్టుకు సంబంధించిన యజమాని అమ్మ ఆనతి ప్రకారం చెట్టును ఇచ్చేస్తారు. చెట్టును సిరిమానుకివ్వడానికి అద్రుష్టంగా భావిస్తారు. ఈ ఏడాది సిరిమాను చెట్టును డెంకాడ మండలం రెడ్డివలస గ్రామంలో గుర్తించారు. మంచి ముహార్తాన అన్నదానం చేసి, సిరిమాను చెట్టును కొట్టి పూజారింటికి తరలిస్తారు. అక్కడ నిపుణులైన వండ్రంగులు చెట్టును సిరిమానుగా మలుస్తారు. సిరిమాను ఉత్సవం రోజు మధ్యాహ్నాం హుకుంపేటలో గల పూజారి ఇంటి నుంచి సిరిమాను, అంజలిరథం, జాలరివల, తెల్లని ఏనుగు, పాలధార బయలుదేరి, మూడులాంతర్ల వద్ద గల అమ్మవారి ఆలయం వద్దకు చేరుకుంటాయి. అనంతరం అమ్మవారి రూపంగా భావించే ఆలయ ప్రధాన పూజారి ఆ సిరిమానును అధిరోహిస్తారు. ఆలయం వద్ద నుంచి కోట వరకు మూడుమార్లు సిరిమాను తిరుగుతుంది. ఈ సందర్భంగా లక్షలాది మంది భక్తులు సిరిమానును వీక్షిస్తూ ఆనందపరవశమవుతారు. పూజారి రూపంగా భావించే అమ్మవారు భక్తులను తన చల్లని దీవెనలు అందిస్తుంది. ఇక ఈ రోజు జరిగే శ్రీపైడిమాంబ సిరిమాను ఉత్సవానికి భారీ ఏర్పాట్లు జరిగాయి. పోలీసు, రెవిన్యూతో పాటు దేవదాయ ధర్మదాయ శాఖ, మున్సిపల్ సిబ్బంది ముమ్మర ఏర్పాట్లు చేశారు. అమ్మవారి ఉత్సవాలలో ప్రధాన ఘట్టమైన సిరిమాను సంబరాన్ని తిలకించేందుకు ఉత్తరాంధ్ర నుంచే కాకుండా ఒరిస్సా, ఛత్తీస్ గడ్ నుంచి కూడా భారీగా భక్తులు తరలివస్తారు. సంబరానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు పగడ్భందీ ఏర్పాట్లు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Facebook Auto Publish Powered By : XYZScripts.com