Home > Editorial > జీఎస్టీ కోసం వడివడిగా అడుగులు

జీఎస్టీ కోసం వడివడిగా అడుగులు

మొండి బకాయిలపై చర్యలకు సిద్ధం
రికార్డులతో హోరెత్తిస్తున్న ఇస్రో

gst goods_apduniaవివిధ పరోక్ష పన్నులు, సేవా పన్నులను విలీనం చేసే సమగ్ర పన్ను విధానమే ఈ వస్తు, సేవల పన్ను. జూలై 1 నుంచి దీనిని అమలు చేయనున్నారు. వస్తు, సేవల పన్ను అనేది వినియోగాధారిత పన్ను. ఒక సంవత్సరంలో రూ.20 లక్షలకు పైగా టర్నోవర్ ఉండే వ్యాపారస్తులు జీఎస్టీ పరిధిలోకి వస్తారు. ఈ పరిమితి ప్రత్యేక రాష్ర్టాల (ఈశాన్య రాష్ర్టాల)కు రూ.10 లక్షలుగా నిర్ణయించారు. వ్యాపారుల విభజనకు సంబంధించి ఏడాదికి రూ.1.50 కోట్లలోపు టర్నోవర్ ఉన్న వ్యాపారుల్లో 90 శాతం రాష్ట్ర జీఎస్టీ పరిధిలో, మిగిలిన 10 శాతం కేంద్ర జీఎస్టీ పరిధిలో ఉంటారు.సేవలకు సంబంధించి మొత్తం 500లకుపైగా సేవలలో దాదాపు 83 రకాల సేవలను జీఎస్టీ నుంచి మినహాయించారు. సేవలలో ముఖ్యంగా టెలిఫోన్ సేవలు, బిజినెస్ క్లాస్ విమాన ప్రయాణాలు, 5 స్టార్ రెస్టారెంట్ల బిల్లలు, బ్యాంకింగ్, బీమా సేవలు ప్రియం కానున్నాయి. ఇప్పటికే పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన టెలికాం రంగంలోని పరిశ్రమలపై పన్ను పెంపు పెనం మీది నుంచి పొయ్యిలో పడిన చందంగా మారింది.అదేవిధంగా సంవత్సరానికి రూ.1.50 కోట్లకు మించి టర్నోవర్ కలిగిన వారిలో యాభై శాతం కేంద్ర జీఎస్టీ పరిధిలో, యాభైశాతం రాష్ట్ర జీఎస్టీ పరిధిలో ఉంటారు.ఇటీవల జరిగిన వస్తు, సేవల (జీఎస్టీ) మండలి సమావేశంలో వివిధ వస్తువులు, సేవలపై విధించనున్న పన్ను రేట్లను ఖరారు చేశారు. వస్తు, సేవలపై పన్ను శ్రేణులు 5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతాల ను ఇదివరకే ఖరారు చేసిన విషయం విదితమే. దాదాపు 1218 వస్తువు లు, 500 లకు పైగా సేవలపై విధించనున్న జీఎస్టీ రేట్లను ఇటీవల ఖరారు చేశారు. మొత్తం వస్తువుల్లో దాదాపు ఏడు శాతం వస్తువులను పూర్తిగా పన్ను నుంచి మినహాయించారు. జీఎస్టీ శ్రేణి 5 శాతం పరిధిలో 14 శాతం వస్తువులు 12 శాతం శ్రేణిలో దాదాపు 17 శాతం వస్తువులను నిర్ణయించారు. అత్యధికంగా 43 శాతం వస్తువులను 18 శాతం శ్రేణిలో ఉంచగా, 28 శాతం శ్లాబులో దాదాపు 19 శాతం వస్తువులను చేర్చారు. మొత్తమ్మీద 81 శాతం వస్తువులపై పన్ను రేటు 18 శాతం, అంతకంటే తక్కువగా ఉండటం పేద, మధ్య తరగతికి కొంత ఊరట. మానవాభివృద్ధికి తోడ్పడుతూ ఆర్థికాభివృద్ధిలో ప్రముఖ పాత్ర వహించే విద్య, ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించే వైద్యరంగ సేవలను జీఎస్టీ నుంచి మినహాయించారు. దాదాపు 13 సేవలను ఐదు శాతం పరిధిలోకి తీసుకురాగా, అధిక శాతం సేవలకు 12 శాతం, 18 శాతం పన్నును నిర్ధారించారు. తక్కువ సేవలపై 28 శాతం పన్ను నిర్ణయించారు.జీఎస్టీలోని దాదాపు ఏడు శాతం వస్తువుల పైన ఎటువంటి పన్ను విధించలేదు. వీటిలో ముఖ్యంగా బియ్యం, గోధుమలు, ఇతర ఆహార పదార్థాలు ఉన్నాయి. పాలు, పెరుగు లాంటి వాటిని కూడా మినహాయించారు. అయితే కొన్ని రాష్ర్టాలు బియ్యంపై 5 శాతం వరకు వ్యాట్ విధిస్తున్నాయి. జీఎస్టీలో బియ్యంపై వ్యాట్ తొలిగిపోయి వాటి ధరలు తగ్గే అవకాశం ఉన్నది. దీనిద్వారా సామాన్య కుటుంబాల నెలసరి వ్యయం తగ్గి వారి జీవన ప్రమా ణం మెరుగుపడే అవకాశం ఉన్నది. నిత్యం వినియోగించే చెక్కర, టీ, కాఫీ, వంట నూనెలపై పన్నును 5 శాతానికి పరిమితం చేశారు. మిఠాయిలపై 5 శాతం, ప్రాణధార మందులపై రేటును 5 శాతం నిర్ణయించారు. తల నూనెలు, సబ్బులు, టూత్‌పేస్టులపై పన్నును 18 శాతంగా నిర్ధారించారు. ప్రస్తుతం వీటిపై 22-24 శాతం వరకు పన్ను విధిస్తున్నారు. జీఎస్టీ అమలు తర్వాత వీటి ధరలు తగ్గే అవకాశం ఉన్న ది. అయితే షాంపుల ధరలు, డిటర్జెంట్ పౌడర్లు, బట్టల సబ్బుల ధరలు పెరి గే అవకాశం ఉంది. ఎందుకంటే వీటిపై జీఎస్టీలో 28 శాతం పన్ను విధించారు. వీటిని కూడా రోజువారీ వినియోగించే నిత్యవసర వస్తువులుగా గుర్తించి వాటిని 18 శాతం పన్ను పరిధిలోకి తీసుకరావాలని పరిశ్రమ ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు.వాహన రంగానికి సంబంధించి జీఎస్టీ వల్ల చిన్న కార్లు ప్రియం అవు తూ, పెద్ద కార్లు ధరలు కొంతమేరకు దిగివచ్చే అవకాశాలున్నాయి. ప్రస్తు తం రూ.10 లక్షలలోపు ధర ఉన్న కార్లపై దాదాపు 24.5 శాతం పన్ను, రూ.10 లక్షల కంటే ఎక్కువ ధర గల చిన్న కార్లపై 26.5 శాతం వరకు పన్ను విధిస్తున్నారు. జీఎస్టీ అమలులోకి వచ్చాక వీటిపై 28 శాతం పన్ను, 1 నుంచి 3 శాతం వరకు సెస్‌ను కలుపుకొని దాదాపు 29 నుంచి 31 శాతం వరకు పన్ను విధించబడుతుంది. దీనివల్ల లక్షకు వెయ్యి రూపాయల చొప్పున చిన్నకార్ల వినియోగదారులపై భారం పడనున్నట్లు పరిశ్రమ వర్గాలు తెలుపుతున్నాయి. ఇదిలా ఉండగా స్పోర్ట్స్ వినియోగ వాహనాలపై ప్రస్తుతం 41.5 నుంచి 44.5 శాతం వర కు పన్ను విధిస్తున్నారు. జీఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాత వీటిపై 28 శాతం పన్ను, 15 శాతం సెస్‌ను కలుపుకొని మొత్తం 43 శాతం వరకు పన్ను విధిస్తారు. అందువల్ల పెద్ద కార్ల ధరలు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపవచ్చు. జీఎస్టీలో ఏసీలు, రిఫ్రిజిరేట్లరపై పన్ను రేటును 28 శాతంగా నిర్ణయించారు. ప్రస్తుతం వీటిపై ఎక్సైజ్, వ్యాట్ కలుపుకొని దాదాపు 27 శాతం వరకు పన్ను విధిస్తున్నారు. దీంతో వినియోగదారులపై 1 శాతం వరకు, దాదాపు 300ల నుంచి 500 వరకు భారం పడే అవకాశం ఉన్నది. కాని ప్రస్తుత సీజన్ ముగుస్తున్నందున అమ్మకాలపై దీని ప్రభావం అంతగా ఉండకపోవచ్చని వ్యాపార వర్గాలు చెబుతున్నా యి. అదేవిధంగా జీఎస్టీలో నిర్ణయించిన 12 శాతం పన్ను వల్ల మొబైల్ ధరలు పెరిగి వినియోగదారులకు భారం కానున్నాయి. గ్రానైట్ పరిశ్రమలపై జీఎస్టీ పిడుగు పడినట్లుంది. జీఎస్టీలో గ్రానైట్ పాలిష్ టైల్స్‌పై 28 శాతం పన్నును నిర్ణయించారు. ప్రస్తుతం వీటిపై వ్యాట్, సెస్ కలుపుకొని దాదాపు 17.50 శాతం వరకు పన్ను విధిస్తున్నారు. దీనితో గ్రానైట్ పాలిైష్టెల్స్ ధర 10 శాతం వరకు పెరిగి వాటి కొనుగోళ్ళు నిలిచిపోయి గ్రానైట్ కోత పరిశ్రమలు, పాలిష్ యూనిట్లు మూతపడే అవకాశం ఉన్నది. ఈ పరిశ్రమలు స్థాపించిన యజమానులు, వాటిలో పనిచేసే కూలీలు భవిష్యత్తు అగమ్యగోచరంగా మారే అవకాశం ఉన్నది. ఇదిలా ఉండగా గ్రానైట్‌కు ప్రత్యామ్నాయంగా వినియోగించే సిరామిక్ టైల్స్‌పై పన్నును 5 శాతానికి పరిమితం చేశారు. దీనివల్ల రెండు తెలుగు రాష్ర్టాల్లోని గ్రానైట్ కోత, పాలిష్ పరిశ్రమలు తీవ్ర సంక్షోభంలోకి వెళ్లనున్నాయి. ఇప్పటికే ఈ పరిశ్రమలు యాజమానులు, కార్మికులు జీఎస్టీలో ఈ పన్ను రేటును తగ్గించాలని ఆందోళన చేయడం విదితమే. జీఎస్టీలో కల్పించిన ఇన్‌పుట్ టాక్స్ క్రెడి ట్ వల్ల నిర్మాణ మౌలిక రంగాలు ప్రయోజనం పొందుతున్నాయని ఇక్రా రేటింగ్ సంస్థ పేర్కొన్నది. ప్రస్తుతం నిర్మాణ కంపెనీలపై సేవా పన్ను, వ్యాట్ కలుపుకొని సగటున 11 నుంచి 18 శాతం మేరకు పన్ను విధిస్తున్నారు. వీటిపై జీఎస్టీలో 18 శాతం పన్ను నిర్ణయండంతో ప్రభావం తటస్థం కానుంది. ప్రస్తుతం మౌలిక ప్రాజెక్టులపై జీఎస్టీ రేట్లు అమలు అయితే వ్యయం పెరుగవచ్చని, అయితే ముడి పదార్థాలపై చెల్లించే ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ వల్ల అధిక రేటు ప్రభావం తటస్థం కాగలదని ఇంకా తెలిపింది. జీఎస్టీలో బొగ్గుపై పన్ను 5 శాతంగా నిర్ణయించారు. ప్రస్తుతం దీనిపై 11.69 శాతం వరకు పన్ను విధిస్తున్నారు. బొగ్గుపై పన్ను తగ్గించడం వల్ల పర్యవసానంగా ఉక్కు ధరలు నిలకడగా ఉంటాయని అధికారులు తెలియజేస్తున్నారు. ఆరు వస్తువులకుపైగా పన్ను రేట్లను ఖరారు చేశారు. వీటిలో బంగారం, బంగారు అభరణాలపై 3 శాతం పన్ను విధించారు. దీనిపై ప్రస్తుతం రెండు శాతం పన్ను విధిస్తున్నారు. దీనిలో బంగారం, బం గారు అభరణాలు ప్రియం కానున్నాయి. రూ.500 వరకు విలువల గల పాదరక్షలపై ప్రస్తుతం 23.1 శాతం నుంచి 29.58 శాతం వరకు పన్ను విధిస్తుండగా, జీఎస్టీ అమలు అయ్యాక వీటిపై 18 శాతం పన్ను వసూ లు చేస్తారు. దీంతో పాదరక్షలు వినియోగదారులకు తక్కువ ధరకు అం దుబాటులోకి రానున్నాయి. వీటితో పాటు బిస్కెట్లపై 18 శాతం (ప్రస్తుతం 20.6 -23.11 శాతం విధిస్తున్నారు), బ్రాండ్ పేర్లతో అమ్మే ప్యాకింగ్ చేసిన ఆహార పదార్థాలపై 5 శాతం, అన్నిరకాల సహజసిద్ధమై న దారాలు, నూలుపై 5 శాతం, కృత్రిమ దారాలు, నూలుపై 18 శాతం పన్నును నిర్ణయించారు. తునికాకుపై 18 శాతం, బీడీలపై 28 శాతం పన్ను జీఎస్టీలో నిర్ణయించారు. దీనితో తెలంగాణలోని 10 లక్షల మంది బీడీలపై ఆధారపడి జీవనం సాగిస్తున్న కార్మికులపై తీవ్ర ప్రభావం చూపనున్నది. దీనితో బీడీల పరిశ్రమ, దానిపై ఆధారపడిన వారు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు దీనిపై పునరాలోచించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Facebook Auto Publish Powered By : XYZScripts.com