Home > Editorial > కశ్మీర్ సమస్య పరిష్కారం దిశగా అడుగులు

కశ్మీర్ సమస్య పరిష్కారం దిశగా అడుగులు

చంద్రులు ఇద్దరు దొందు..దొందే
సింగిల్‌ పాయింట్‌ అజెండాలో మోడీ

rajnath-singh-apdniaకశ్మీర్ సమస్య పరిష్కారం కోసం జాతీయస్థాయిలో అన్ని పక్షాలు దృష్టి సారించాయి. కశ్మీర్‌లో రాజ్‌నాథ్ పర్యటిస్తుంటే, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని కాంగ్రెస్ బృందం జమ్ములో పర్యటనను ప్రారంభించింది. కశ్మీర్ సమస్య బుల్లెట్లతో పరిష్కారం కాదు, కశ్మీరీలను అక్కున చేర్చుకోవడం వల్లనే పరిష్కారమవుతుందంటూ ప్రధాని మోదీ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో పేర్కొన్నట్టు దానికి కొనసాగింపుగా కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ జమ్ముకశ్మీర్‌లో నాలుగురోజుల పర్యటన చేపట్టారు.కశ్మీర్ పురోభివృద్ధికి కీలకమైన పర్యాటక రంగానికి పూర్వ వైభవం తేవడంపై కూడా కేంద్రం దృష్టి సారించింది. పర్యాటకులు కశ్మీర్‌ను సందర్శించవచ్చునని రాజ్‌నాథ్ ఆహ్వానించారు. దీనిని బట్టి మిలిటెంట్ కార్యకలాపాల పట్ల కఠినంగా వ్యవహరిస్తూనే, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని, వీటికి తోడు చర్చల ద్వారా పరిష్కారం సాధించాలనేది కేంద్రం వ్యూహమైనట్టు అర్థమవుతున్నది తాము అందరి మాటలు వింటామని పర్యటన కు ముందే చెప్పిన రాజ్‌నాథ్‌సింగ్ కశ్మీర్‌లో పర్యటించిన మూడు రోజులు వివిధ ప్రతినిధి బృందాల విన్నపాలను స్వీకరించారు. కశ్మీర్‌లో పర్యటన ముగించుకొని జమ్ముకు వెళ్ళే ముందు కూడా అన్నిపక్షాల అభిప్రాయాలు వింటామని మరోసారి ప్రకటించారు. కశ్మీర్‌లో పౌరసత్వానికి సంబంధించిన 35ఎ అధికరణంపై సుప్రీంకోర్టులో విచారణ సాగుతున్న అంశాన్ని ప్రస్తావించినప్పుడు- తాము ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా వ్యవహరించబోమని స్పష్టం చేశారు. కశ్మీర్ సమస్య పరిష్కారానికి తోడ్పడే వారెవరైనా సరే, వారిని ఆహ్వానించి చెప్పేది వింటున్నామని ఆయన వివరించారు.ఇప్పటివరకు ఐదుసార్లు కశ్మీర్ పర్యటన చేపట్టిన కేంద్రహోం మంత్రి, అవసరమైతే యాభైసార్లయినా రావడానికి సిద్ధమని ప్రకటించడం కేంద్ర ప్రభుత్వ దృఢ నిశ్చయాన్ని వెల్లడిస్తున్నది. పద్దెనిమిది ఏండ్ల లోపు పిల్లలను విచారించినప్పుడు, వారిని నేరస్తుల మాదిరిగా చూడకుండా, బాల నేరస్తుల చట్టం ప్రకారం నడుచుకోవాలని రాజ్‌నాథ్‌సింగ్ భద్రతాదళాలకు హితవు చెప్పారు. కేంద్ర మంత్రి రాజకీయ నాయకులు, సామాజిక ప్రముఖులు, వ్యాపారస్తులు, విద్యార్థులు మొదలైన భిన్నవర్గాలతో మాట్లాడి వారి నుంచి విజ్ఞాపనలు, సూచనలు స్వీకరించారు. రాజ్‌నాథ్‌సింగ్ పర్యటన కశ్మీర్‌లో ఏకాంత సౌహార్ద్ర వాతావరణం నెలకొల్పగలిగినా అదొక ముందడుగుగానే భావించవచ్చు. హోం మంత్రి పర్యటన చర్చలకే పరిమితం కాలేదు. అనేక ప్రతినిధి బృందాల నుంచి సూచనలు వింటూనే జమ్ముకశ్మీర్ పోలీసు, సీఆర్‌పీఎఫ్, బీఎస్‌ఎఫ్ సిబ్బందితో మాట్లాడి శాంతిభద్రతల పరిస్థితిని సమీక్షించారు. గవర్నర్ వోహ్రాతో, ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీతో చర్చలు జరిపారు. ప్రధాని ప్రకటించిన ఎనభైవేల కోట్ల రూపాయల అభివృద్ధి ప్యాకేజీ అమలుతీరును తెలుసుకున్నారు. విద్యార్థి వర్గాల తో కూడా సంభాషించారు. 35ఎ అధికరణంపై చేసి న వ్యాఖ్యను బట్టి కశ్మీరీల మనోభావాలు గాయపడకుండా వ్యవహరించాలని, సాంత్వన చర్యలు చేపట్టాలని భావిస్తున్నట్టు కనిపిస్తున్నది.హురియత్ నాయకులు పలువురు నిర్బంధంలో ఉన్నారు. వారిని విడుదల చేసి, చర్చలు జరుపాలని ఫరూఖ్ అబ్దుల్లా కోరడం గమనార్హం. బీజేపీ, కాంగ్రెస్, పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్ వంటి ప్రధాన పార్టీలతో పాటు, పలు స్థానిక రాజకీయ పక్షాలు తమ ప్రతినిధి బృందాలను పంపి కేంద్ర హోం మంత్రికి వినతి పత్రాలు సమర్పించాయి. రాజకీయ, వ్యాపారాది భిన్న రంగాల ప్రతినిధి బృందాలు చేసిన ప్రధాన సూచన కశ్మీర్ సమస్య పరిష్కారానికి చర్చలు జరుపాలనేది. ప్రజలు శాంతి నెలకొనాలని కోరుకుంటున్నారు. అందుకు చర్చలే మార్గమని కూడా భావిస్తున్నారు. గతంలో వాజపేయి ప్రభుత్వం మానవతా భావన ప్రాతిపదికగా కశ్మీర్ సమస్యను పరిష్కరిస్తామని ప్రకటించింది. ఇప్పటికీ అన్ని వర్గాలు అదే భావనను వ్యక్తం చేస్తున్నా యి. బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా నేతృత్వంలోని ప్రతినిధి బృందం గతేడాది కశ్మీర్‌లో పర్యటించి ఒక నివేదికను రూపొందించింది. కశ్మీర్ ప్రజలల్లో కేంద్రం పట్ల విశ్వాసం నెలకొల్పాలనేది ఇందులో ప్రధానాంశం. మానవ హక్కుల పరిరక్షణపై శ్రద్ధ తీసుకోవాలని కూడా ఈ కమిటీ సూచించిం ది. భావస్వేచ్ఛను కాపాడాలని కోరింది. అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని కూడా సూచించింది. కొన్ని దశాబ్దాలుగా యుద్ధ పరిస్థితులు ఉండటం, వినోద వసతులు లేకపోవడం వల్ల అనేక మంది యువకులు మానసిక రుగ్మతలకు గురవుతున్నారు. ఉపాధి అవకాశాలు కల్పించడంతోపాటు యువత ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి సారించడం తక్షణ అవసరం. రాజ్‌నాథ్ తాజా పర్యటనతో మొత్తం సమస్య పరిష్కారమై పోతుందని లోయలోని ప్రజలతో సహా ఎవరూ నమ్మడం లేదు. కానీ ఆ వైపుగా అడుగులు పడటమే ఊరట కలిగిస్తున్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *