Home > Editorial > సామాజిక బాధ్యత మరిచిపోవద్దని సుప్రీం చురకలు

సామాజిక బాధ్యత మరిచిపోవద్దని సుప్రీం చురకలు

నినాదాలకే పరిమితమవుతున్నరోడ్డు భద్రతా ప్రమాణాలు
చివరి అంకానికి చేరుకున్న పార్లమెంట్

supreme-apduniaరోడ్డు ప్రమాదాలలో ఏటా లక్షన్నర మందికిపైగా జనం చనిపోవడం పట్ల సుప్రీం కోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. మద్యం దుకాణాలను, రాష్ట్రాల హైవేల వెంబడి గల మద్యం దుకాణాలను సుప్రీం కోర్టు నిషేధించింది. జాతీయ రహదారు లలో ఫలానా చోట మద్యం దుకాణం ఉందని తెలిపే సైన్‌ బోర్డులను కూడా ఉంచరాదని సుప్రీం కోర్టు రూలింగ్‌ ఇవ్వడం హర్షించదగ్గ పరిణామం. జాతీయ రహదారుల వెంబడి గల మద్యం దుకాణాల్లో పెద్ద ఎత్తున అమ్మకాలు జరుగుతాయని, మద్యం సేవించి వాహనదారులు, ట్రక్కు డ్రైవర్లు చేసే రోడ్డు ప్రమాదాలకు ఎవరు బాధ్యత వహించాలని, గాలిలో కలిసి పోతు న్న ప్రాణాలకు జవాబుదారీ ఎవరని సుప్రీం కోర్టు నిలదీసింది. రోడ్డు ప్రమాదా ల్లో మరణించిన వ్యక్తి కుటుంబాలకు లక్షో, లక్షన్నరో ఇచ్చి చేతులు దులుపు కుంటున్న రాష్ట్ర ప్రభుత్వాల తీరును ధర్మసనం తలంటింది. సమాజ హితవు కూడా ప్రభుత్వం బాధ్యత అని గుర్తుచేస్తూ, సామాజిక బాధ్యతతో, ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కచ్చితమైన వైఖరి అనుసరించాలని అత్యున్నత న్యాయస్థానం హితవు పలికింది. మద్యం అమ్మకాలను నిషేధించడం రాష్ట్ర ప్రభుత్వాల రాజ్యాం గపరమైన బాధ్యత అని గుర్తు చేసింది. జాతీయ రహదారులు, హైవేలలో ఉన్న మద్యం దుకాణాలను తొలగించడంలో రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు వ్యవహరిస్తున్న తీరును, నిస్సహాయ ధోరణిని ధర్మాసనం తప్పు పట్టింది. ప్రభుత్వాల వైఫల్యం కారణంగా మద్యం సేవించి, వాహనాలు నడిపే వారి సంఖ్య పెరిగిపోతూ, దురదృష్టకరమైన ప్రమాదాలకు దారి తీస్తున్నదని కోర్టు వ్యాఖ్యానించింది. రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఆదాయపు వనరులు పెంచు కోవడానికి ఎన్నో ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి. రెవెన్యూ పెంచుకోవడానికే జాతీయ రహదారుల వెంబడి లిక్కర్‌ షాపులకు లైసెన్స్‌లు ఇస్తామనడం సరైన కారణం కాదు. ఈ దుకాణాలను తొలగించడం ద్వారా, ప్రమాదాలను అరికట్టేందుకు అన్ని విధాలా చర్యలు తీసుకోవాలని అధికారులను హెచ్చరించిందిసామాజిక బాధ్యతతో, ప్రజాసంక్షే మాన్ని దృష్టిలో పెట్టుకుని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలోనూ అమలు చేసేందుకు తక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. రోడ్డు ప్రమాదాలలో ఏటా లక్షా 50 వేల మందికిపైగా మరణిస్తున్నారు. మద్యం సేవించి వాహనాలను నడపడం వల్ల ఏటా జరుగుతున్న ప్రమాదా లలో వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఎన్ని తనిఖీలు నిర్వహించినా, హెచ్చరికలు చేస్తున్నా, ప్రకటనలు, వీడియోల ద్వారా ప్రజలలో చైతన్యం తెచ్చేందుకు చేస్తున్నా, మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారికి కళ్లెం వేయడం సాధ్యం కావడం లేదు. రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా తమ రెవెన్యూ పెం చుకునేందుకు మద్యం విధానాన్ని మారుస్తూ, మరిన్ని మద్యం దుకాణాలకు, బార్‌లకు లైసెన్స్‌లు ఇస్తూ సామాజిక బాధ్యతను విస్మరించడం పట్ల సుప్రీం కోర్టు తీవ్రంగా స్పందించింది. జాతీయ రహదారులు, రాష్ట్రాలహైవేల వెంబడి ఇప్పటికే లైసెన్స్‌లు ఇచ్చి, నడుస్తున్న మద్యం దుకాణాల లైసెన్స్‌లను 2017 మార్చి 31 తరువాత పునరుద్ధరించరాదని కూడా సుప్రీం కోర్టు ఆదేశించింది. ప్రజారోగ్యం, ప్రజల ప్రాణాలను కాపాడడం కూడా ప్రభుత్వాల బాధ్యత అని సుప్రీంకోర్టు గుర్తు చేసింది. అమ్మకాలను ముమ్మరం చేసే లక్ష్యంతో జాతీయ రహదారుల వెంబడి మద్యం దుకాణాల ఏర్పాటుకు అనుమతించరాదని ప్రస్తుతం ఉన్న చట్టాల నుంచి మినహాయింపు కోరుతూ పంజాబ్‌ ప్రభుత్వం దాఖ లు చేసిన అపీలుపై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఇదే సమ యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదాయాన్ని పెంచుకునేందుకు జాతీయ రహదారు లకు దగ్గరలో మరిన్ని మద్యం దుకాణాలను తెరిపించేందుకు సిద్ధమైంది. పంజాబ్‌ ప్రభుత్వం అపీలుపై విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు తీవ్రంగా స్పందించింది. పంజాబ్‌ రాష్ట్రం భారీ మొత్తంలో విచ్చలవిడిగా ఇస్తున్న లైసెన్స్‌ లను దుయ్యబట్టింది. జాతీయ రహదారుల సమీపంలో మద్యం దుకాణాల బదులు చక్కటి సౌకర్యాలతో కూడిన ఆసుపత్రుల ఏర్పాటు అవసరాన్ని గుర్తు చేయడం మరో విశేషం. ఇటు రెండు తెలుగు ప్రభుత్వాలు తమ ఆదాయాన్ని గరిష్ఠంగా పెంచుకునేందుకు కొత్త మద్యం విధానాలను ప్రవేశపెట్టడంలో పోటీ పడుతున్నాయి. కొత్త మద్యం విధానం ద్వారా ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం 2015-16 ఆర్థిక సంవత్సరంలో రూ. 12,258 కోట్లు రెవెన్యూ పొందింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ రెవెన్యూ మరింత పెరిగేందుకు చర్యలు తీసుకుంది. ఇక తెలంగాణ ప్రభుత్వం తమ మద్యం విధానాన్ని మరింత సరళతరం చేసింది. తెలంగాణ రాష్ట్రంలో 16 డిస్టిలరీలు ప్రతి నెలా 28 లక్షల కేసుల మద్యం ఉత్పత్తి చేస్తుంటే, వాటిని ప్రతి నెలా 45 లక్షల కేసుల మేరకు ఉత్పత్తి చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వమే ప్రోత్సహించడం విశేషం. సుప్రీం కోర్టు తాజాగా ఇచ్చిన తీర్పును, హితవును ఉభయ రాష్ట్రాల ప్రభుత్వాలు గమనించి జాతీయ రహదారులు, స్టేట్‌ హైవేలపై గల మద్యం దుకాణాలను మూసివేయడంతో పాటు, మద్యం తాగి వాహనాలు నడిపే వారికి కళ్లెం వేయడం ద్వారా ప్రజల ప్రాణాలను రక్షించేందుకు మరిన్ని చర్యలు చేపట్టాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *