Home > Editorial > సుప్రీం తీర్పుతో నైనా మార్పు వచ్చేనా…

సుప్రీం తీర్పుతో నైనా మార్పు వచ్చేనా…

జీహెచ్ఎంసీలో కొత్త మార్పులు...?
ములాయాం పరివార్....

supreme-apduniaఎన్నికలలో మతం, కులం, జాతి, సముదాయం, భాష పేరిట ఓట్లు అడుగడాన్ని నిషేధిస్తూ సుప్రీంకోర్టు రాజ్యాంగ పీఠం చరిత్రాత్మక తీర్పునిచ్చింది. రాజకీయాలలో మత ప్రమేయం పెరుగుతున్నందున ఈ తీర్పు రాబోయే అన్ని ఎన్నికలపై ప్రభావం చూపవచ్చు. త్వరలో ఐదు రాష్ర్టాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిలో ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ర్టాలలో కులం, మతం పేరిట ప్రచారం సాగే అవకాశాలు ఉన్నందున ఈ తీర్పు ప్రాముఖ్యా న్ని సంతరించుకున్నది. ఎన్నికలను లౌకిక ప్రక్రియగా అనుసరించడం ద్వారా రాజ్యాంగ లౌకిక భావనలను కాపాడాలని ధర్మాసనం స్పష్టం చేసింది. లౌకిక ప్రక్రియ అయిన ఎన్నికలలో మతం పాత్ర ఉండదు. రాజ్యాన్ని, మతాన్ని కలగలపడానికి రాజ్యాంగం అనుమతించదు అని ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనం వివరించింది. అయి తే ఈ మెజారిటీ తీర్పుతో ముగ్గురు న్యాయమూర్తులు విభేదించారు. ఇటువంటి ఆంక్షల వల్ల ప్రజాస్వామ్యం పేలవంగా మారుతుందని, న్యాయ వ్యవస్థ చట్టాన్ని తిరగరాయడమే అవుతుందని వారు అభిప్రాయపడ్డారు. తాజా తీర్పులో సుప్రీంకోర్టు ధర్మాసనం రాజ్య లౌకిక లక్షణాన్ని దృఢపరుస్తూనే, మనిషికి, దేవుడికి మధ్య ఉన్న సంబంధం వ్యక్తిగతమైనదనీ, అందులో రాజ్యం జోక్యం చేసుకోకూడదు అని కూడా స్పష్టం చేసింది. ఈ విధంగా మత స్వాతంత్య్రాన్ని స్పష్టంగా గుర్తించింది. రాజకీయాలు మతానికి అతీతంగా ఉండాలనేది ఆధునిక రాజ్య లక్షణం. ఈ మత రాజకీయాల సమ స్య అన్ని దేశాలను మధ్యయుగాల నుంచి వేధిస్తున్నది. జాతి రాజ్యాలు, ప్రజాస్వామ్యం పునాదులుగా ఆధునిక రాజ్యం వేళ్ళూనుకునే క్రమంలో రాజకీయాలలో మత ప్రాధాన్యం ఉండకూడదనే భావన స్థిరపడ్డది. మతం పేర సాగిన యుద్ధా లు తద్వారా సాగిన రక్తపాతం, విధ్వంసం కూడా మతాన్ని వ్యక్తిగత అంశంగా పరిమితం చేయడానికి దోహదపడ్డాయి. లౌకిక రాజ్యం అంటే మతాన్ని రాజకీయాల నుంచి, రాజ్య పాలన నుంచి దూరంగా పెట్టడమే తప్ప, మతాన్ని పూర్తిగా మనిషి జీవన విధానంలో లేకుండా నిర్మూలించడం కాదనే స్పష్టత కూడా కాలక్రమేణా ఏర్పడ్డది. ఈ కారణంగానే యూరోపియన్ దేశాలలో సామాజిక బహుళత్వాన్ని గౌరవించే సంస్కృతి కూడా బలపడ్డది. ఆధునిక రాజ్యానికి లౌకికత్వం ఒక మూలస్తంభంగా మారింది. అయితే ఇటీవల మళ్ళా కార్పొరేట్ సంస్థలు బలపడి, ప్రజాస్వామ్య వ్యవస్థలు బలహీనపడుతున్న నేపథ్యంలో మత రాజకీయాలకు ఊతం లభిస్తున్నది. ఏడు దశాబ్దాలుగా ప్రజాస్వామిక లౌకిక రాజ్యంగా స్థిరపడిన భారత గణతంత్రం కూడా మత రాజకీయాల ఒత్తిడులకు గురవుతున్నది. వ్యక్తిగత మత స్వాతంత్య్రాన్ని కాపాడుకుంటూనే మత విద్వేష రాజకీయాలను అరికట్టే క్రమంలో సుప్రీంకోర్టు ఈ తీర్పును ఇచ్చింది. ఈ తీర్పు స్పష్టంగా భారత గణతంత్ర స్వభావాన్ని, రాజ్యాంగస్ఫూర్తిని ప్రతిబింబిస్తున్నది, పరిరక్షిస్తున్నది. ప్రజా ప్రాతినిధ్య చట్టం (1951)లోని 123 (2) సెక్షన్ ప్రకారం- కులం, మతం, జాతి, సముదాయం, భాష పేర అభ్యర్థి కానీ, అతడి ఏజెంటు కానీ ఓట్లు అడుగకూడదు. ఈ విధంగా అడిగినట్టు రుజువైతే ఎన్నిక చెల్లదు. మహారాష్ట్ర అసెంబ్లీకి 1992లో జరిగిన ఎన్నికలలో అనేక మంది అభ్యర్థులు మత ప్రాతిపదికన ఓట్లు అడిగారనే ఆరోపణలు వచ్చాయి. ఈ వివాదం సుప్రీంకోర్టును చేరింది. 1995లో ప్రధాన న్యాయమూర్తి జెఎస్ వర్మ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం హిందుత్వం మతం కాదని, జీవన విధానమని తీర్పునిచ్చింది. ఈ తీర్పును మళ్ళా పరిశీలించాలని కోరుతూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఎన్నికలలో మతం పేర ఓట్లు అడుగడాన్ని సవాలు చేస్తూ ఇరవై ఏండ్లుగా సాగుతున్న ఈ వివాదానికి తాజా తీర్పుతో స్పష్టత ఏర్పడ్డది. కానీ వివాదానికి మూలమైన హిందుత్వ ప్రచారంపై గతంలో ఇచ్చిన తీర్పును మళ్ళా పరిశీలించడానికి ప్రస్తుత ధర్మాస నం ఆసక్తి చూపలేదు. రాజకీయాలను, మతాన్ని కలపడాన్ని రాజ్యాంగం నిషేధిస్తున్నదని ధర్మాసనం స్పష్టంగా చెప్పింది. గత రెండు దశాబ్దాలుగా రాజకీయాలలో మత ప్రభావం విపరీతంగా పెరిగిపోయింది. అయితే ఈ మత ప్రమేయాన్ని చట్టాల ద్వారా అరికట్టడం అంత సులభం కాదు. పౌరుల మత స్వాతంత్య్రానికి భంగం వాటిల్లకూడదు. మతంపైనా, ఇతర అంశాలపైనా అర్థవంతమైన చర్చకు ఆటంకం కలుగకూడదు. లౌకికత్వమంటే మతాన్ని మొత్తంగా నిషేధించడం కాదు. రాజకీయ నాయకుల ప్రసంగాలలో మతపరమైన అంశాలను పరిమితం చేస్తూ ఒక రేఖ గీయడం కూడా అంత సులభం కాదు. ఈ నేపథ్యంలో ప్రజాస్వామ్య భావనలను గౌరవిస్తూనే, రాజ్యాంగ లౌకిక స్వభావాన్ని కాపాడటమనేది న్యాయ వ్యవస్థకు సవాలుగా మారింది. అందువల్ల న్యాయస్థానం వ్యక్తి స్వేచ్ఛను బలపరుస్తూనే, లౌకికవాదాన్ని పటిష్ఠంచేసే తీర్పునిచ్చింది. మతపరమైన, విద్వేషపూరితమైన ప్రసంగాలకు అడ్డుకట్ట వేస్తూనే సందర్భాన్ని, అర్థాన్ని బట్టి అనుమతించడానికి సుప్రీంకోర్టు దిశానిర్దేశం చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *