Home > Editorial > పార్లమెంట్‌ లో చర్చలకు దారేదీ…

పార్లమెంట్‌ లో చర్చలకు దారేదీ…

తీవ్ర ఉద్రిక్తతల మధ్య చల్లటి ఒప్పందం
బానిస బతుకులు

parliamentmansoon_apduniaపార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ నీరు కారిపోతోంది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుండి ప్రతిపక్షాలు అనుసరిస్తున్న ఏకపక్ష విధానం ఉభయ సభలను స్తంభింపజేస్తోంది. సమావేశాలను ఎలాగైనా అడ్డుకోవాలన్న ఏకైక లక్ష్యంతో ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్నాయి. లోక్‌సభలో ప్రతిపక్షం మొండిగా వ్యవహరిస్తూ ప్రతి రోజూ వాయిదా తీర్మానాలు ఇవ్వటం, స్పీకర్ వాటిని తిరస్కరించటం, ఆ తర్వాత సభను స్తంభింపజేయటం ఒక తంతుగా మారింది. ప్రతిపక్షం రాజకీయాల కోసం వాయిదా తీర్మానం వ్యవస్థను దుర్వినియోగం చేస్తోంది. రైతుల పేరుతో రాజకీయాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడవేసేందుకు ప్రయత్నిస్తోంది తప్ప కర్షకుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నించటం లేదురైతుల సమస్యలపై తక్షణం చర్చ జరపాలంటూ మొదటి మూడు రోజులూ ఉభయ సభలను స్తంభింపచేసి ఆ తర్వాత లోక్‌సభలో విపక్షాలు అదే వైఖరిని కొనసాగిస్తున్నాయి. అయితే, రాజ్యసభలో ఇతర అంశాలను అడ్డం పెట్టి సభను విపక్ష నేతలు అడ్డుకుంటున్నారు.ఎన్‌డిఏ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలనే ఏకైక ఎజెండాతో ప్రతిపక్షాలు పార్లమెంటులో రభస చేస్తున్నాయి. ఈ ప్రక్రియలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై పార్లమెంటులో చర్చ జరగకుండా చేస్తోంది. కర్షకుల సమస్యలపై చర్చ జరగాలంటూ ఉభయ సభల్లో గొడవ చేయటం ద్వారా ఆ అంశంపై చర్చను అడ్డుకోవటం ప్రతిపక్షాలకే చెల్లింది. వ్యవసాయ ఉత్పత్తులకు తగిన గిట్టుబాటు ధరలు లభించటం లేదు. పలు ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఆర్థిక సమస్యలు చుట్టుముట్టడంతో కొందరు రైతులు నిరాశకు లోనై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రైతుల ఇబ్బందులు, ఆత్మహత్యలపై పార్లమెంటులో వెంటనే చర్చ జరిపి వ్యవసాయ రంగాన్ని ఆదుకునేందుకు అవసరమైన చర్యలను వెంటనే తీసుకోవాల్సి ఉంది. రైతు సమస్యలపై యుద్ధ ప్రాతిపదికపై చర్చ జరగాల్సి ఉంది. అయితే, ప్రతిపక్షాలు ప్రతిరోజూ రైతు సమస్యలపై చర్చ జరపాలంటూనే సభలను స్తంభింపజేస్తున్నాయి తప్ప ఎలాంటి చర్చకు సహకరించడం లేదు. లోక్‌సభ ప్రశ్నోత్తరాల కార్యక్రమం ప్రారంభం కాగానే రైతు సమస్యలపై చర్చ జరపాలంటూ ప్రతిపక్షాలు స్పీకర్ పోడియం వద్దకు వచ్చి గొడవ చేస్తున్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఇస్తూ సభను స్తంభింపజేస్తున్నాయి. ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని రద్దు చేసి రైతు సమస్యలపై చర్చ జరపటం సాధ్యం కాదనేది ప్రతిపక్షాలకు బాగా తెలుసు. ప్రశ్నోత్తరాలను రద్దు చేయటం అంటే సభ్యులు వివిధ అంశాలపై అడిగిన ప్రశ్నలకు సమాధానాలను సిద్ధం చేసేందుకు ప్రభుత్వ శాఖలు రోజుల తరబడి పడిన కష్టాన్ని వృథా చేయటమే. ప్రశ్నోత్తరాల కార్యక్రమం అత్యంత ముఖ్యమైన ప్రక్రియ. ప్రభుత్వంలోని లోపాలను ఎత్తి చూపేందుకు, ప్రజల సమస్యలకు సమాధానాలు కనుగొనేందుకు, పథకాలు ఏ విధంగా అమలవుతున్నాయనేది తేల్చేందుకు ప్రశ్నోత్తరాల కార్యక్రమం ఒక ముఖ్యమైన ఆయుధం. ఇంతటి ముఖ్యమన ప్రక్రియను ప్రతిపక్షాలు కావాలనే దెబ్బ తీస్తున్నాయి. ప్రజలకు సంబంధించిన అత్యంత ముఖ్యమైన అంశంపై తక్షణం చర్చ జరపవలసి వస్తేనే ప్రశ్తోత్తరాల కార్యక్రమాన్ని రద్దు చేస్తారు. ఈ విషయం తెలిసి కూడా ప్రతిపక్షం గత వారమంతా లోక్‌సభలో ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని స్తంభింపజేయటం వెనక ఉన్న ఉద్దేశం ఏమిటి? రైతు సమస్యపై చర్చ జరిపేందుకు అనేక పద్ధతులు ఉన్నాయని స్పీకర్ సుమిత్రా మహాజన్ చెబుతున్నా ప్రతిపక్షాలు మాత్రం ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకే స్వార్థ రాజకీయాల కోసం ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని దెబ్బ తీయటం గర్హనీయం. రైతు సమస్యలపై చర్చ జరిపి ఒక పరిష్కారం కనుగొనాలనే చిత్తశుద్ధి విపక్షాలకు ఉన్నట్లు కనిపించటం లేదు. అలాంటి చిత్తశుద్ధి ఉంటే- ఈ అంశంపై ఈ పాటికి పార్లమెంటు ఉభయ సభల్లో చర్చ జరిపి ప్రభుత్వం తప్పులను ఎత్తిచూపించటం జరిగేది.సిక్కిం సెక్టార్‌లో భారత్, చైనా సైనికులు దాదాపు ఏడు వారాల నుండి ముఖాముఖి నిలబడ్డారు. రెండు దేశాల సైనికుల మధ్య ఉద్రిక్తత రోజురోజుకూ పెరుగుతోంది. డోక్లామ్‌లో తమ భూభాగంలోకి వచ్చి రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకున్న భారత్‌ను 1962లో మాదిరిగా శిక్షిస్తామంటూ చైనా ప్రతి రోజూ అవమానకరంగా హెచ్చరికలు జారీ చేస్తోంది. డోక్లామ్ మూలంగా రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంటోంది. మరోవైపు దేశంలోని పలు ప్రాంతాల్లో గోసంరక్షకులు పేట్రేగి పోతున్నారు. పలుచోట్ల దళితులపై దాడులు జరుగుతున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో శాంతిభద్రతల సమస్యలు నెలకొంటున్నాయి. ప్రజలకు సంబంధించిన పలు అంశాలపై పార్లమెంటులో చర్చ జరగవలసి ఉన్నది. అయితే, ప్రతిపక్షం ఈ అంశాలపై దృష్టి కేంద్రీకరించకుండా ఒక రోజు రైతుల సమస్య, మరోరోజు గోసం రక్షకుల అరాచకాలు, ఇంకోరోజు దళితులపై దాడుల గురించి ప్రస్తావిస్తూ ఉభయ సభలను స్తంభింపజేస్తున్నాయి. దీంతో అత్యంత కీలకమైన రైతు సమస్యలపై చర్చ జరగటం లేదు. ఇలాగే వ్యవహరిస్తే ప్రజల దృష్టిలో విపక్షం తన ప్రాధాన్యతను కోల్పోయే ప్రమాదం ముంచుకు వస్తోంది.రైతుల పట్ల మొసలి కన్నీరు కారుస్తున్నాయి తప్ప వారి సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో ప్రయత్నించటం లేదు. గత వారం రోజుల్లో ప్రతిపక్షం ఏ ఒక్క రోజూ రాజకీయ విజతను ప్రదర్శించినా రైతుల సమస్యలపై అర్థవంతమైన చర్చ జరిగి పరిష్కార మార్గాలు కొన్నయినా వెలుగులోకి వచ్చేవి. ప్రభుత్వాన్ని విమర్శించటమే ధ్యేయంగా ప్రతిపక్షాలు పని చేస్తున్నాయి కాబట్టే రైతు సమస్యలపై పార్లమెంటులో చర్చ సాధ్యం కావటం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *