Home > Editorial > తమిళ రాజకీయ శూన్యతకు పరిష్కారం

తమిళ రాజకీయ శూన్యతకు పరిష్కారం

కమలానికి గుజరాత్ పరీక్షే
కేంద్ర ఆర్థిక విధానాలపై విమర్శలు

rajinikanth-kamlhassan-apduniaజయలలిత మరణానంతరం తమిళనాడు రాజకీయరంగంలో ఏర్పడిన శూన్యాన్ని పూడ్చగల వారెవరు? సాంప్రదాయక రాజకీయాలు పునరుజ్జీవనం పొందుతాయా లేక మళ్లీ సినీగ్లామర్ ఆధిక్యంలోకి వస్తుందా? ఇద్దరు తమిళ సూపర్‌స్టార్లు రజనీకాంత్, కమల్‌హాసన్ రాజకీయాల్లో ఆసక్తి చూపుతున్నందున ఈ అంశం చర్చనీయాంశమవుతున్నది. సుప్రసిద్ధ సినీనటుడు శివాజీ గణేశన్ స్మారక కేంద్రం ప్రారంభోత్సవం సందర్భంగా రాజకీయ, సినీ ప్రముఖులతో పాటు ఈ మిత్రులిద్దరూ వేదికనలంకరించారు.తాను రాజకీయాల్లో ప్రవేశించానని ఈ మధ్యన పదేపదే చెబుతున్న కమల్ హాసన్ తాను ఇక్కడికి రావటం కొందరికి బహుశా పాలకపార్టీకి ఇబ్బందికరంగా ఉండవచ్చని, అయినా మహానటుడు శివాజీ గణేశన్‌పట్ల అభిమానంతో వచ్చానన్నారు. కమల్‌హాసన్ రాజకీయ ప్రవేశాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ రజనీకాంత్, సినీగ్లామర్, డబ్బు మాత్రమే రాజకీయాల్లో విజయం చేకూర్చవని, అంతకుమించి ఏదో ఉందని, అది కమల్‌కు తెలుసునేమో అన్నారు. ఇప్పుడు చెప్పకపోవచ్చు. రెండునెలల క్రితం అడిగితే చెప్పేవాడేమో అన్నారు.రజనీకాంత్ రాజకీయ ఆకాంక్షలు పలుమార్లు ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలేదు. “జయలలిత తిరిగి అధికారంలోకి వస్తే తమిళనాడును దేవుడుకూడా కాపాడలేడు” అన్నది 1996 ఎన్నికల సందర్భంగా ఆయన ప్రసిద్ధ ప్రకటన. డిఎంకె అధిక మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. ఆయన అభిమాన సంఘాల ప్రభావం అటువంటిది. తమిళ రాజకీయాల్లో స్థానం కొరకు పావులు కదుపు తున్న బిజెపి, జయలలిత అస్వస్థురాలైన దగ్గరనుంచి ఆ పార్టీపై పట్టు సాధించే ప్రయత్నాలు చేస్తోంది. అంతకుముందే రజనీకాంత్‌ను ఆకర్షించే యత్నాల్లో ఉంది. గత సంవత్సరం రజనీ తన అభిమాన సంఘాలతో సమావేశం సందర్భంగా, రాజకీయ రంగ ప్రవేశ ప్రకటన చేస్తారని పరిశీలకులు ఊహాగానాలు చేసినా ఆయన దాన్ని ఫోటోలకే పరిమితం చేశారు. ఆయన ప్రధానంగా ఆధ్మాత్మికుడు. ‘దేవుడు శాసిస్తాడు..రజనీ పాటిస్తాడు’ అన్నది ఆయన తాత్వికత. రజనీ రాజకీయాల్లోకి వస్తున్నాడని అతని సన్నిహితులు ప్రకటించినపుడు తమిళ దురభిమానులు కొందరు ‘అతడు కన్నడిగుడు తమిళనాడులో అనుమతించబోము’ అంటూ ప్రదర్శనలు చేశారు.కమల్ హాసన్ కొంతకాలంగా రాజకీయ వ్యాఖ్యలు చేస్తూ అవినీతిమయమైన తమిళ రాజకీయాలను ప్రక్షాళన చేయటమే కర్తవ్యమంటున్నాడు. “మనకు మెరుగైన పరిపాలన కావాలి. అరచేతిలో స్వర్గంలాంటి సత్వర పరిష్కారాలు వాగ్దానం చేయలేను. మార్పు క్రమం ప్రారంభిస్తాను’ అన్నారు. ద్రవిడ రాజకీయాలు బ్రాహ్మణులను ఏనాడో పక్కకు తోసేశాయి. అయితే కమల్‌హాసన్‌లో నాస్తికత్వం కనిపిస్తుంది. కుల, మతతత్వ రాజకీయాలకు వ్యతిరేకి. ఆయన కేరళ ముఖ్యమంత్రి విజయన్‌ను కలిసినప్పుడు ‘వామపక్ష అభిమాని’గా ముద్రవేసే ప్రయత్నం జరగ్గా, ‘నేను మధ్యేమార్గ వాదినిఏ వైపు మొగ్గను’ అని కమల్ ప్రకటించాడు. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీపార్టీ అధ్యక్షుడు కేజ్రీవాల్ చెన్నైలో కమల్‌ను కలిసిన సందర్భంగా ఊహాగానాలను త్రోసిపుచ్చుతూ ‘నేను ఆప్ నుంచి పాఠాలు తీసుకుంటాను అయితే భాగస్వామ్యం లేదు’ అని ప్రకటించాడు.పాలక ఎఐఎడిఎంకె సంక్షోభంలో ఉన్నా దాదాపు నాలుగేళ్ల పదవీకాలం ఉంది. అదే దాన్ని కాపాడే అవకాశం ఉంది. 1967లో కాంగ్రెస్‌ను చిత్తుచేసిన దగ్గరనుంచి డిఎంకె, అటు తర్వాత డిఎంకెఎఐఎడిఎంకె మధ్య అధికారం చేతులు మారుతూ వచ్చింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పాల్గొనదలిస్తే సూపర్ స్టార్లు ఇప్పటినుంచే సన్నాహాలు ప్రారంభించాలి. అయితే రజనీకాంత్ అన్నట్లు రాజకీయాల్లో నెగ్గుకు రావాలంటే సినీగ్లామర్, డబ్బుకు అదనంగా ఏదో కావాలి. అదేమిటో తెలుసుకునేలోపు పుణ్యకాలం గడిచిపోనూవచ్చు. శివాజీగణేశన్ రాజకీయాల్లో రాణించలేదు. విజయ్‌కాంత్ ఒక ఊపు ఊపుతాననుకుని చతికిలబడ్డాడు. శరత్‌కుమార్ అంతే. కర్నాటకలో రాజ్‌కుమార్, అంబరీస్ అంతే. పాలకపార్టీలు అప్రతిష్టపాలై, రాజకీయ శూన్యం ఏర్పడినపుడే కొత్త ఆకర్షక నాయకులకు ప్రజలు బ్రహ్మరథం పడతారు. అందుకు ఉదాహరణ ఎన్‌టి.రామారావు. అంతేగాని సినిమాల్లో రాణించటం రాజకీయాల్లో అధికార అందలానికి నిటారు నిచ్చెనకాదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *