Home > Politics > కంచుకోటపై టీడీపీ నిర్లక్ష్యం

కంచుకోటపై టీడీపీ నిర్లక్ష్యం

సానుకూల స్పందన రాలేదు : సీఎం చంద్రబాబు
హోదా ఇవ్వాల్సిందే : సీఎం చంద్రబాబు

telugudesam-apduniaకంచుకోటలో టీడీపీ పార్టీ నేతల మధ్య సమన్వయం కొరవడిందా? నెలకో రోజు జిల్లాకి వచ్చే ఇన్‌ఛార్జ్ మంత్రి తీరుతో సమస్యలు మరింత జఠిలమవుతున్నాయా? సమన్వయ కమిటీ భేటీల్లో సత్తా ఉండటం లేదా? టీడీపీకి ఆది నుంచీ అండగా ఉన్న ఆ జిల్లాలో తాజా రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నాయి?రాజకీయ చైతన్యానికి శ్రీకాకుళం జిల్లా పెట్టింది పేరు. టీడీపీ ఆవిర్భావం నుంచి జిల్లా ప్రజలు ఆ పార్టీని తమ గుండెల్లో పెట్టుకున్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఆ జిల్లా ప్రజలు తమవైపే ఉంటారన్న ధీమా సదరు పార్టీ నేతల్లో ఏర్పడిపోయింది. అలాంటి జిల్లాలో తాజా రాజకీయ పరిణామాలు ఆ పార్టీ తమ్ముళ్ళను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇంతకీ ఆ జిల్లా ఏమిటో అనుకుంటున్నారా? అదేనండీ- ఉత్తరాంధ్రలోని సిక్కోలు జిల్లా. ఈ జిల్లాలో తెలుగుదేశం నేతల మధ్య సమన్వయం పూర్తిగా కొరవడింది. అంతర్గత విభేదాలు పార్టీని పీడలా వెంటాడుతున్నాయి. అధినేత మందలించినా మార్పులేని, రాని శ్రీకాకుళం జిల్లా టీడీపీ నేతలను ఎలా అర్థంచేసుకోవాలో తెలియక పసుపు పార్టీ ప్రేమికులు తికమకపడుతున్నారు.

2014 ఎన్నికల్లో జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాలకు గాను, ఏడింటిలో టీడీపీ విజయం సాధించింది. తదనంతర పరిణామాల్లో భాగంగా వైసీపీ నుంచి గెలుపొందిన కలమట వెంకటరమణ పసుపు కండువా కప్పుకున్నారు. దీంతో జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేల సంఖ్య ఎనిమిదికి చేరింది. అంతటి ప్రజాబలం సంపాదించుకున్నా అధికార పార్టీ నేతల తీరుతో శ్రేణులు స్థిమితంగా ఉండలేకపోతున్నాయి. ఐవీఆర్ఎస్ సర్వే నివేదికల ఆధారంగా అధినేత చంద్రబాబు ఎన్నోసార్లు సిక్కోలు నేతలను మందలించారు. అయినా ఫలితం కనిపించటం లేదన్న మాట పార్టీలోనే వినిపిస్తోంది.
సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. టీడీపీలో ఉన్న లొసుగులను ప్రధాన ప్రతిపక్షం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ క్యాష్‌చేసుకునే పనిలో నిమగ్నమయ్యిందన్న భావన తెలుగు తమ్ముళ్ళలో ఏర్పడింది. మరోవైపు జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి పితాని సత్యనారాయణ నెలకొకసారి చుట్టం చూపుగా వచ్చినట్టు జిల్లాకు వచ్చి వెళుతున్నారట. ఇప్పటివరకూ పితాని నేతృత్వంలో జరిగిన జిల్లా టీడీపీ సమన్వయ కమిటీ సమావేశాలలో నేతలంతా కలిసి ఒకే వేదికపైకి వచ్చిన దాఖలాలు కనిపించలేదు. నేతలంతా జిల్లాలోనే ఉన్నా పితానిగారి సమన్వయ కమిటీ సలహాలు వినే తీరిక నేతలకు లేనట్టే కనిపిస్తోందట. ఇంకోవైపు ఏ క్షణంలోనైనా శ్రీకాకుళం నగరపాలక సంస్థ ఎన్నికలు జరుగుతాయని భావిస్తూ వైకాపా గ్రౌండ్‌వర్క్ మొదలుపెట్టిందట. “ఇంకా నోటిఫికేషన్ రాలేదు కదా? వస్తే చూసుకుందాంలే” అన్నట్టుగా అధికారపార్టీ నేతలు తాపీగా కూర్చున్నారట. ఇక్కడితో అయిపోలేదండీ… పాతపట్నం, రాజాం వంటి నియోజకవర్గాల్లో టీడీపీ పరిస్థితి ఇబ్బందికరంగా ఉందట. సర్వే రిపోర్టుల ఆధారంగా ఆయా నియోజకవర్గాల బాధ్యులైన కలమట వెంకటరమణ, కావలి ప్రతిభాభారతిలను ముఖ్యమంత్రి హెచ్చరించారట. అయినా వారిలో మార్పురాలేదని లోకల్ లీడర్స్ మాటల వల్ల తెలుస్తోంది.

జిల్లా సీనియర్ మంత్రి కళా వెంకట్రావు టీడీపీ కార్యక్రమాల్లో బిజీగా మారిపోయారు. రాజధానిలోనే ఆయన ఎక్కువ సమయం గడిపేస్తున్నారు. కళాకు రాష్ట్ర పార్టీ బాధ్యతలతో పాటు విద్యుత్‌శాఖ బాధ్యతలు కూడా ఉన్నాయి. దీంతో జిల్లాపై శ్రద్ధపెట్టే తీరిక ఆయనకు దొరకటం కష్టంగా మారింది. మరో మంత్రి అచ్చెంనాయుడి పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా లేదన్నది తమ్ముళ్ళ మాట! ఈ తరుణంలో జిల్లా టీడీపీకి దిశానిర్దేశం చేసే నేతలే కరువయ్యారని జెండా మోసే కార్యకర్తలు వాపోతున్నారు. పాతపట్నంలో ద్వితీయశ్రేణి నేతలు ఎమ్మెల్యే తీరుపై నేరుగానే బాణాలు ఎక్కుపెట్టడం గమనార్హం. ఇన్‌ఛార్జ్ మంత్రి వద్ద ఎమ్మెల్యేపై ఫిర్యాదులు, ఆరోపణలు, ప్రత్యారోపణలతో పొద్దు గడిపేస్తున్న సందర్భాలే అధికం. ఇన్‌ఛార్జ్ మంత్రి పితాని సత్యనారాయణ ఉదయం ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో జిల్లాకు చేరుకుంటారు. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు హోటల్‌లో అందుబాటులో ఉన్న నేతలతో కో-ఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహిస్తారు. కాలం వేగంగా కరిగిపోతుంది. అనంతరం ఆదరాబాదరాగా రైలెక్కి మంత్రిగారు వెళ్ళిపోతారు. దీంతో పట్టు తప్పుతున్న పార్టీని అదుపుచేసే నేతలే కరువయ్యారా అంటూ తెలుగు తమ్ముళ్ళు లోలోపల బాధపడుతున్నారట. ఈ పరిస్ధితుల్లో అధినేత చంద్రబాబు సిక్కోలు జిల్లాపై సీరియస్‌గా దృష్టిపెడితే తప్పా లాభం లేదంటోంది పసుపుదళం.

తెలుగుదేశం అంటే సిక్కోలు ప్రజలకు ఎనలేని అభిమానం. అనేక సందర్భాల్లో ఈ విషయం స్పష్టమయ్యింది కూడా. ఎన్ని రాజకీయ పార్టీలు జిల్లాలో చక్రంతిప్పాలని చూసినా ఇక్కడి ప్రజలు మాత్రం టీడీపీకి ఆదినుంచీ అండగానే ఉన్నారు. ఇలాంటి నేపథ్యం ఉన్న సిక్కోలు జిల్లాపై పార్టీ హైకమాండ్ దృష్టి సారించక తప్పదు. లేకపోతే వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితి చేయిదాటిపోయినా ఆశ్చర్యంలేదన్న భావన వ్యక్తమవుతోంది. చూద్దాం టీడీపీ పెద్దలు ఏంచేస్తారో!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *