Home > Editorial > దేశ ప్రగతి ప్రధాన ధ్యేయం కావాలి

దేశ ప్రగతి ప్రధాన ధ్యేయం కావాలి

ఈ-ముందులెట్లగ...
సంస్కరణలో దిశగా బ్యాంకింగ్ రంగం

china india_apduniaదేశ సార్వభౌమాధికార పరిరక్షణలో ప్రభుత్వానికి పూర్తి మద్దతు ప్రకటించింది ప్రతిపక్షం.దేశం సుసంపన్నం కావాలన్నా, బలం పుంజుకోవాలన్నా దానికి కావలసింది దేశాభివృద్ధి, సగటు మనిషి అభివృద్ధి, పారిశ్రామిక ప్రగతి, ఆర్థికాభివృద్ధి. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినప్పుడే దేశం సుసంపన్నం, బలవంతం అవుతుంది. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ సక్రమంగా పని చేయాలంటే అధికార పక్షంతో పాటు ప్రతిపక్షం కూడా సమాన బాధ్యత వహించవలసి ఉంటుంది. అధికార పక్షం చేసే మంచిపనులను ప్రతిపక్షం అడ్డుకుంటుందనే ఆలోచనా విధానానికి కాలం చెల్లాలి. ప్రభుత్వ విధానాలను అడ్డుకోవటమే లక్ష్యంగా విపక్షం పని చేస్తోందనే భావన సమర్థనీయం కాదు. అధికార, ప్రతిపక్షాలు దేశాభివృద్ధి లక్ష్యంగా పని చేయాలి తప్ప పార్టీ విధానాలు, సిద్ధాంతాల కోసం సంఘర్షణ పడడం మానివేయాలి. ఈ రెండు పక్షాలకూ దేశ ప్రగతి ప్రధాన ధ్యేయం కావాలే తప్ప, రాజకీయాల్లో ఆధిపత్యం కోసం ఆరాటం తగదు. మరోవైపు దేశ సరిహద్దుల్లో అక్రమ చొరబాట్లు, ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. సిక్కిం సెక్టార్‌లో భారత, చైనా సైనికుల మధ్య ఉద్రిక్తత నెలకొన్నది. చైనా అంగుళం, అంగుళం చొప్పున భూభాగాన్ని కబళించేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నది. ఆక్రమణ వ్యూహంలో భాగంగానే చైనా ఇప్పుడు భూటాన్ మీదుగా ఈశాన్న రాష్ట్రాలను మనతో కలిపి ఉంచే ‘చికెన్ నెక్’ ప్రాంతంపై ఆధిపత్యం సంపాదించేందుకు ఎత్తుగడ వేసింది. ఈ ఎత్తుగడలో భాగంగానే చైనా సిక్కిం సెక్టార్‌లోని ‘ట్రై జంక్షన్’ వద్ద సైనిక రోడ్డును నిర్మించటం ప్రారంభించింది. దీనిని అడ్డుకున్నందుకే చైనా సైన్యం మనపై కనె్నర్ర చేసింది. బేషరతుగా వెనక్కి తగ్గుతారా? లేక 1962లో మాదిరిగా శిక్షించమంటారా? అంటూ చైనా దాదాగిరి చేస్తోంది. భారత సైన్యం ఈ సారి చైనా సైన్యానికి దీటుగా నిలబడింది. నాలుగు వారాల నుండి కొనసాగుతున్న ఈ పరిస్థితి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం మనోధైర్యానికి అద్దం పడుతోంది. గతంలో మాదిరిగా బెదిరిస్తే బెదిరిపోతుందనుకున్న భారత సైన్యం ఎంతకైనా సిద్ధమేనంటూ ప్రతి సవాల్ చేయడంతో చైనా ఆలోచనలో పడింది. మామూలుగా అయితే ఈ పాటికి చైనా మన సైనికులను వెనక్కి తోసి వేసేందుకు బలప్రయోగం చేసేది. కానీ, ఈసారి ఇంతవరకు ఆ ధైర్యం చేయలేదు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వమే ఇందుకు కారణం దీంతో బలప్రయోగానికి వెనకంజ వేస్తోంది.కేంద్రంలో బలమైన ప్రభుత్వం ఉన్నందుకే చైనా బలప్రయోగానికి ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తోంది. కేంద్ర ప్రభుత్వం మాదిరిగానే దేశం కూడా బలవర్థకమైతే చైనా మనవైపు కన్నెత్తి కూడా చూడలేదు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీలు సంక్షేమ పథకాల అమలు, సగటు మనిషి ఆకాంక్షలు, రైతుల కష్టాలు, ఉపాధి కల్పన, అధిక ధరలు వంటి సమస్యలపై దృష్టి కేంద్రీకరించాలి. అధికార పక్షాన్ని దెబ్బ తీసేందుకు ఏదోఒక అంశం ఆధారంగా ఉభయ సభలను స్తంభింపజేయటంమే ప్రతిపక్షం ప్రధాన లక్ష్యం కాకూడదు. పార్లమెంటు ఉభయ సభల నిర్వహణకు రోజుకు ఎంత ఖర్చు అవుతుందనేది ప్రతి ఎంపీకి తెలుసు. ప్రజలకు సంబంధించిన వివిధ సమస్యలపై పార్లమెంటు సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు సిద్ధం చేసేందుకు సంబంధిత శాఖల అధికారులు నెలల తరబడి కష్టపడి పని చేస్తారు. ఆ తరువాత వారు సదరు ప్రశ్న చర్చకు వచ్చే రోజు పార్లమెంటుకు వచ్చి అదనపు సమాచారం అందజేసేందుకు సిద్ధంగా ఉంటారు. గందరగోళం మూలంగా లోక్‌సభ లేదా రాజ్యసభ ఒక గంట వాయిదా పడినా కొన్ని లక్షల రూపాయలు వృథా అవుతాయి. లక్షల రూపాయల వృథాతో పాటు సదరు ప్రశ్నకు సంబంధించిన అంశంతో ముడిపడి ఉన్న సమస్యలు కొన్ని నెలలకు కానీ చర్చకు వచ్చే అవకాశం లభించదు.పార్లమెంటు ఉభయ సభల్లో ఒక్క నిముషం వృథా అయినా దాని ప్రభావం పలు అంశాలపై సుదీర్ఘంగా ఉంటుంది. పార్లమెంటు వాయిదా పడటం మనకు అలవాటైపోయినందున, దాని వలన కలుగుతున్న అపార నష్టం గురించి మనం పెద్దగా పట్టించుకోవటం లేదు. ఇది మన బాధ్యతా రాహిత్యానికి అద్దం పడుతోంది. అధికార, ప్రతిపక్షాలు ఇకనైనా తమ ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలి. ప్రజల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయటం ప్రతిపక్షాల బాధ్యత. ప్రతిపక్షాలు ఈ బాధ్యతను ఎంత బాధ్యతాయుతంగా నిర్వహిస్తే సగటు మనిషికి అంత ప్రయోజనం, లాభం కలుగుతుంది. గొడవలు, గందరగోళంతో పార్లమెంటును వా యిదా వేయించటం వలన అధికార పక్షానికి నష్టం జరిగినా, జరుగకపోయినా ప్రజలకు మాత్రం తీరని నష్టం వాటిల్లుతోందనే నిజాన్ని ప్రతిపక్షాలు గ్రహించాలి. ప్రతిపక్షాలు వీలున్నంత వరకు ఉభయ సభలను స్తంభింప జేయకుండా ప్రభుత్వ విధానాలను, పాలనతీరును ఎండగట్టాలి. ఈ ప్రయత్నంలో సఫలమైనప్పుడు ప్రతిపక్షాలు ఆశించిన విధంగా ప్రజలకు, దేశానికి ప్రయోజనం కలగడమే కాదు, అధికార పక్షం చేసే తప్పొప్పులు వెలుగులోకి వస్తాయి. ప్రతిపక్షాలు పార్లమెంటును అడ్డుకుంటే ప్రజల దృష్టిలో అవి తమ ప్రతిష్టను కోల్పోతాయి. పార్లమెంటు ఉభయ సభలు స్తంభించినంత మాత్రాన అధికార పక్షం పరువు, ప్రతిష్ట దిగజారే రోజులు ఏనాడో పోయియి. ప్రభుత్వం చేసే తప్పులను పార్లమెంటులో సమర్థంగా ఎండగట్టగలిగితేనే ప్రజల మన్ననలను ప్రతిపక్షం పొందగలుగుతుంది. మోదీ పాలన పట్ల దేశ ప్రజలలో మద్దతు పెరిగిన ప్రస్తుత తరుణంలో ప్రతిపక్షాలు పార్లమెంటులో మరింత బాధ్యతతో వ్యవహరించవలసి ఉంటుంది. పార్లమెంటును అడ్డుకోవడం ద్వారా ప్రభుత్వాన్ని దెబ్బ తీయాలనుకుంటే ప్రజల దృష్టిలో ప్రతిపక్షాలకున్న విలువ మరింత పలుచన అవుతుంది. ఆర్‌జెడి పార్టీ అధినాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్ తదితరుల అవినీతి, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అపరిపక్వ రాజకీయాల మూలంగా ఇప్పటికే ప్రతిపక్షం విశ్వసనీయత బాగా తగ్గింది. బిహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ లాంటి నాయకులు కూడా నరేంద్ర మోదీతో కలిసి పని చేసేందుకు ముందుకు వస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Facebook Auto Publish Powered By : XYZScripts.com