Home > Editorial > ఖతర్ ఆర్ధిక దిగ్భంధనానికి వెనుక రహస్య అజెండా

ఖతర్ ఆర్ధిక దిగ్భంధనానికి వెనుక రహస్య అజెండా

జీఎస్టీకి సిద్ధమౌతున్న రాష్ట్రాలు
వ్యూహా, ప్రతివ్యూహాలతో రాష్ట్రపతి ఎన్నికలు

quatar_apduniaఈజిప్టు, గల్ఫ్‌లోని ఇతర మిత్ర దేశాల దన్నుతో సౌదీ అరేబియా పొరుగు దేశమైన బుల్లి ఖతార్‌ను ఆర్థిక అష్ట దిగ్బంధనంలో బిగించింది. ఇరాన్‌కు వ్యతిరేకంగా శత్రుపూరిత వైఖరి తీసుకోవాలని, ఈజిప్టులో సైనిక పాలకులకు మద్దతు ఇవ్వాలని సౌదీ అరేబియా ఖతార్‌ను కోరుతున్నది. అయితే ఖతార్‌ దృక్పథం వేరుగా ఉన్నది. అందుకని బలవంతంగానైనా సరే ఖతార్‌ను తన దారికి తెచ్చుకోవాలనే సంకల్పంతో ఖతార్‌పై సౌదీ ఇలాంటి దాడికి పాల్పడింది.అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ సౌదీ అరేబియాను పర్యటించినప్పుడు ఇరాన్‌కు వ్యతిరేకంగా సున్నీ అరబ్బు దేశాల సైన్యాన్ని కూడగట్టాలనే వ్యూహరచన జరిగింది. అయితే ఈ వ్యూహాన్ని సౌదీ అరేబియా తనదైన శైలిలో అమలు చేస్తున్నది. రెండు రోజుల క్రితం సౌదీ అరేబియాతోపాటు ఈజిప్టు, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌, బహరైన్‌, యెమెన్‌ దేశాలు ఖతార్‌కు వ్యతిరేకంగా అనేక చర్యలు తీసుకున్నాయి. ఖతార్‌తో తమకుగల దౌత్య సంబంధాలను, ఆర్థిక సంబంధాలను ఈ దేశాలు రద్దు చేశాయి. ఈ దేశాల పౌరులు ఖతార్‌ను దర్శించటాన్ని నిషేధించారు. ఖతార్‌ విమానయాన సంస్థ విమానాలను ఈ దేశాల గగన స్థలంలో ప్రవేశించటానికి కూడా వీలు ఉండదు. ఈ దేశాలలోని ఓడ రేవులలో ఖతార్‌కు చెందిన నౌకలను అనుమతించరు. సౌదీ అరేబియా, దాని అనుంగు మిత్ర గల్ఫ్‌ దేశాల సరిహద్దులను ఖతార్‌ పౌరులు ప్రవేశించకుండా మూసివేశారు. ఈ చర్యలన్నింటితో ఖతార్‌ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతున్నది. ఖతార్‌కు భూభాగ సరిహద్దు కేవలం సౌదీ అరేబియాతో మాత్రమే ఉన్నది. సౌదీ అరేబియా నుంచి వచ్చే ఆహార పదార్థాల సరఫరాపైనే ఖతార్‌ ఎక్కువగా ఆధారపడుతున్నది. ఖతార్‌లో నివసించే 23లక్షల మంది ప్రజలలో 80శాతం విదేశాల నుంచి వచ్చిన కార్మికులే. వీరందరూ నిత్యావసర సరుకులను కొని నిలువ చేసుకోవటానికి బారులు తీరుతున్నారని వార్తా సంస్థలు తెలియజేస్తున్నాయి. 2014లో ఈజిప్టులో ప్రజలచేత ఎన్నుకోబడిన అధ్యక్షుడైన ముస్లిం బ్రదర్‌హుడ్‌ నాయకుడు మహమ్మద్‌ మోర్సీని సైన్యం పదవీచ్యుతుడ్ని చేయటాన్ని ఖతార్‌ వ్యతిరేకించినప్పుడు సౌదీ అరేబియా, దాని మిత్ర దేశాలూ తమ దౌత్య సంబంధాలను నిలిపివేశాయి.అయితే ప్రస్తుతం ఈ దేశాల మధ్య చెలరేగుతున్న తగవు తీరు వేరుగా ఉన్నది. ఖతార్‌ ఆర్థిక వ్యవస్థను నాశనం చేసే ఉద్దేశంతో సౌదీ ఖతార్‌పై ఆర్థిక దిగ్బంధనాన్ని విధించింది. తమను ఒక సామంత రాజ్యంగా మార్చటానికి సౌదీ అరేబియా ప్రయత్నిస్తున్నదని ఖతార్‌ అంటున్నది. ఇరాన్‌ విషయంలో లాగానే ఖతార్‌ కూడా టెర్రరిజానికి మద్దతిస్తున్నదని సౌదీ అరేబియా ఆరోపిస్తున్నది. బహరైన్‌లో రాచకుటుంబ వ్యతిరేకులను, యెమెన్‌లో సౌదీ వ్యతిరేక హౌతీ తిరుగుబాటుదారులను, సౌదీ అరేబియాలో షియాలు నివసించే ప్రాంతంలో సౌదీ పాలనకు వ్యతిరేకులను ఖతార్‌ సమర్థిస్తున్నదని సౌదీ అరేబియా ఆరోపిస్తున్నది. ఖతార్‌ ఈ ఆరోపణలను నిర్ద్వందంగా ఖండిస్తున్నది. సిరియాలో ఐసిస్‌తో ఖతార్‌ కుమ్మక్కయినదని కూడా సౌదీ అరేబియా ఆరోపిస్తున్నది. నిజానికి ఈ రెండు రాజరిక దేశాలు సిరియాలో అస్సద్‌ ప్రభుత్వాన్ని మార్చేందుకు అమెరికా పన్నిన వ్యూహంలో ప్రధానపాత్రను పోషించాయి. ఐసీస్‌తోసహా వివిధ ఇస్లామిక్‌ ఫండమెంటలిస్టు ప్రగతి నిరోధక శక్తులకు ఈ రెండు దేశాలు ఆర్థిక సహకారాన్ని, ఆయుధ సరఫరాను అందించాయి. ప్రాంతీయంగా తన ప్రధాన శత్రువైన ఇరాన్‌తో ఖతార్‌ దగ్గరవకుండా చూడటమే సౌదీ అరేబియా ప్రధాన లక్ష్యం. రాబోయే రోజుల్లో ఖతార్‌పై సౌదీ సైనిక చర్యకు దిగటాన్ని కొట్టిపారేయలేము. అమెరికా దన్నుతో ఇప్పటికే ఆ దేశం యెమెన్‌లో యుద్ధాన్ని చేస్తున్నది. సౌదీ చర్య ఇరాన్‌ను బలహీనపరుస్తుందనే భావనతో సౌదీ అరేబియా ఖతార్‌పై తీసుకున్న చర్యను ఇజ్రాయిల్‌ స్వాగతిస్తున్నది. సౌదీ అరేబియావలెనే ఇజ్రాయిల్‌ కూడా ఇరాన్‌ను తన వ్యూహాత్మక శత్రువుగా పరిగణిస్తున్నది. ట్రంప్‌ పాలన కూడా ఇరాన్‌ను చక్రబంధంలో ఇరికించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నది. ఇరాన్‌పై తీవ్రస్థాయి ఆంక్షలను విధించటమే కాకుండా అవసరమైతే ఇరాన్‌పై సైనిక చర్య తీసుకోవాలని అమెరికా భావిస్తున్నది. అయితే ఖతార్‌పై సౌదీ చర్యను అమెరికా సమర్థిస్తున్న దాఖలాలు ఏమీ కనపడటం లేదు. ఎందుకంటే ఖతార్‌ అమెరికా ఐదవ నావికా దళ ప్రధాన కేంద్రం. ఇక్కడి నుంచే అమెరికా అప్ఘానిస్తాన్‌, ఇరాక్‌, సిరియాలపై యుద్ధాలను చేస్తుంటుంది. ఇరాన్‌పై యుద్ధ వ్యూహాలను రచిస్తుంటుంది. అమెరికా గల్ఫ్‌ మిత్ర దేశాల మధ్య రగిలిన చిచ్చు అమెరికా సైన్యానికి సమస్యలను కొనితెస్తుందని నూయార్క్‌ టైమ్స్‌ పత్రిక రాసింది. మధ్యప్రాచ్యం, గల్ఫ్‌ దేశాలలో చమురు, సహజ వాయు వనరులపై ఆధిపత్యం చెలాయించటానికి పచ్చి అభివృద్ధి నిరోధక ప్రభుత్వాలకు మద్దతునిస్తున్న ప్రాంతాన్ని ఎడతెగని యుద్ధాలకు నిలయంగా మారుస్తున్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Facebook Auto Publish Powered By : XYZScripts.com