Home > Editorial > కట్టుబాట్లకు, ఒప్పందాలకు విలువలు ఉండవా

కట్టుబాట్లకు, ఒప్పందాలకు విలువలు ఉండవా

గ్రామాల్లో తీవ్రంగా మంచి నీటి సమన్య
తాత్కలిక భవనాల్లో కస్తూర్బాలు

paris_apduniaఅభివృద్ధి చెందిన దేశాల తప్పిదాలకు ఇవాళ వాతావరణం వేడెక్కి ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో పర్యావరణ పరిరక్షణ కోసం ప్యారిస్ ఒప్పందం నుంచి అమెరికా వైదొలుగుతున్నదని ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడం దురంహకారమే. ప్యారిస్ ఒప్పందం ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో జరిగింది. ఈ ఒప్పందం నుంచి ఏకపక్షం గా వైదొలిగే అవకాశం ఏ దేశానికి లేదు. అమెరికా కూడా వైదొలుగడం నిబంధనలకు విరుద్ధం. అయినప్పటికీ తాము తప్పుకుంటున్నట్టు ఏకపక్షంగా ప్రకటించడం తమది బలమైన దేశమనే దురహంకారమే. నిజానికి ప్యారిస్ ఒప్పందం పట్ల ఏ ఒక్క దేశానికి పూర్తి సంతృప్తి లేదు. ఈ ఒప్పందానికి కట్టుబడి ఉండటానికి ప్రతి దేశమూ ఇబ్బంది పడుతున్నది. ఉదాహరణకు భారత్ కూడా ప్యారిస్ ఒప్పందం పట్ల ఇబ్బంది పడుతున్నది. అభివృద్ధి చెందిన దేశాలు ఇంతకాలం శిలజ ఇంధనాలు ఉపయోగించుకొని ఎదిగాయి. పర్యావరణ హితమైన కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని వర్ధమాన దేశాలకు ఉచితంగా అందజేయాలె.అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ట్రంప్ తాను గెలిస్తే ప్యారిస్ ఒప్పందం నుంచి వైదొలుగుతానని ప్రచారం చేసిన మాట వాస్తవమే. అయినప్పటికీ ట్రంప్ ఈ ప్రమాదకరమైన నిర్ణయం తీసుకోకుండా అమెరికాలోని విజ్ఞులు చాలామంది అడ్డుకునే ప్రయత్నం చేశారు. ట్రంప్ శిబిరమే రెండు వర్గాలుగా చీలిపోయింది. ట్రంప్ కుమార్తె ఇవాంకా సహా అనేకమంది హితులు ఈ బాధ్యతారహితమైన నిర్ణయం తీసుకోకుండా నచ్చచెప్పడానికి ప్రయత్నించారు. కానీ ట్రంప్ శిబిరంలోని రెచ్చగొట్టే వర్గం ప్యారిస్ ఒప్పందం అమెరికా ప్రయోజనాలకు భంగకరమనే వాదనను ముందుపెట్టింది. కానీ ట్రంప్ ప్రజలకు వాగ్దానం చేశాననే సాకును చూపి ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. ఐక్యరాజ్యసమితి హరిత వాతావరణ నిధికి తమ వంతు నిధు లు ఇవ్వబోమని కూడా ట్రంప్ ప్రకటించారు. అమెరికా ప్రయోజనాలకు భంగం కలుగుతున్నది కనుక ప్యారిస్ ఒప్పందం నుంచి వైదొలుగుతున్నామని, కొత్తగా చర్చలు జరిపి కొత్త షరతులతో మళ్ళా ఈ ఒప్పందంలో చేరడానికి సిద్ధంగా ఉన్నామని ట్రంప్ అంటున్నారు పర్యావరణ పరిరక్షణ నినాదాన్ని కూడా వర్ధమాన దేశాలను దెబ్బతీయడానికి ఉపయోగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. బొగ్గు వంటి శిలాజ ఇంధనాలు ఉపయోగించకుండా అభివృద్ధి చెందడం అసాధ్యం. ఇన్ని అభ్యంతరాలు ఉన్నప్పటికీ ప్యారిస్ ఒప్పందంపై భారత్ సంతకం చేసింది. ఇప్పటికీ కట్టుబడి ఉన్నది. చైనా తన ఆర్థికాభివృద్ధికి ప్రతిబంధకమైనప్పటికీ ప్యారిస్ ఒప్పందానికి కట్టుబడి ఉంటానని ప్రకటించింది. దాని అమలుకు చర్య లు తీసుకుంటున్నది. ప్రపంచమంతా వెలువరిస్తున్న కాలుష్యంలో అమెరికా, చైనాలే అగ్రస్థానంలో ఉన్నాయి. 25 శాతం కాలుష్యాన్ని చైనా వెలువరిస్తుండగా 15 శాతం అమెరికా నుంచి వెలువడుతున్నది.భారీ కాలుష్యాన్ని వెలువరించే దేశంగా అమెరికా మరింత బాధ్యతాయుతంగా ఉండవలసింది. 2030 నాటికి ప్రపంచమంతా తగ్గించవలసిన కాలుష్యంలో ఐదో వంతు అమెరికా వం తుగా ప్యారిస్ ఒప్పందం నిర్దేశిస్తున్నది. అమెరికా వైదొలిగితే ఐదోవంతు కాలుష్యం తగ్గదు. వాతావరణం ఈ మేరకు వేడెక్కితే ప్రకృతి వైపరీత్యాలు పెరుగుతాయి. భరించలేని వడగాడ్పులు వీస్తాయి. సముద్ర మట్టాలు పెరుగుతాయి. ఉత్పాతాల మూలంగా లక్షలాది మంది నిర్వాసితులవుతారు. సముద్ర తీరాలలోని పగడపుదీవులు ఇతర సహజసిద్ధ జీవ వ్యవస్థ దెబ్బతింటుంది. ఇప్పటికే చిన్న దీవుల ప్రజలు సముద్ర మట్టం పెరుగడం వల్ల భవిష్యత్తులో తమ భూభాగం మొత్తం మునిగిపోతుందనే భయంలో ఉన్నారు. అమెరికాతో పాటు ఇతర దేశాలు కూడా ఒప్పం దం నుంచి వైదొలగితే కాలుష్యం అడ్డు అదుపులేకుండా పెరిగి మానవాళి మనుగడకే ముప్పు ఏర్పడుతుంది.ప్యారిస్ ఒప్పందంలో కొనసాగితే తమ దేశానికి నష్టమని ట్రంప్ అంటున్నారు. కానీ వైదొలుగడం వల్ల కూడా అమెరికా ప్రజల మనుగడకు ప్రమాదం వాటిల్లుతుంది. ఈ వాస్తవాన్ని గ్రహించి ట్రంప్‌పై ఒత్తిడి తేవలసింది అమెరికా ప్రజలే. అమెరికా వైదొలిగినప్పటికీ, ప్యారిస్ ఒప్పందాన్ని విచ్ఛిన్నం కాకుండా కాపాడుతామంటూ చైనా, యూరప్ దేశాలు ప్రకటించడం హర్షణీయం. అమెరికా ఇటీవలి కాలంలో యూరప్ దేశాల పట్ల అసహనంగా ఉంటున్నది. యూరప్ కూటమి చైనాతో కలిసి వ్యూహరచన చేశారు. అంతర్జాతీయ సంబంధాలు ఎట్లా ఉన్నా మానవాళి సంక్షేమానికి సంబంధించి ఏకతాటిపై నిలువడం అవసరం.పారిస్ పర్యావరణ ఒప్పందం నుంచి వైదొలగాలన్న ట్రంప్ నిర్ణయంపై అమెరికా ప్రజలతోపాటు, ప్రపంచదేశాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. భూతాపం నియంత్రణకు అనుగుణంగా 2015లో కుదుర్చుకున్న పర్యావరణ ఒప్పందం నుంచి అమెరికా వైదొలుగుతున్నట్లు అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడం నిరసనలకు కారణమైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Facebook Auto Publish Powered By : XYZScripts.com