Home > General > మూడేళ్లలో మూడు లక్షల ఎకరాలు సాగు తగ్గింది

మూడేళ్లలో మూడు లక్షల ఎకరాలు సాగు తగ్గింది

పరిహారం అందక మత్స్య కారుల ఆందోళన
17 శాతం పడిపోయిన ఐటీ కంపెనీల నియామాకాలు

grain0s_apduniaవరి సాగు విస్తీర్ణం ఏడాదేడాదీ క్షీణిస్తోంది. టీడీపీ అధికారంలోకొచ్చాక గడచిన మూడేళ్లలో వరి సాగు నేల చూపులు చూస్తోంది. మూడేళ్ల అనుభవాలతో 2017 ఖరీఫ్‌లో వరి సాగు లక్ష్యాన్ని ప్రభుత్వం తగ్గించింది. ఒకపక్క వాణిజ్యపంట పత్తిని తగ్గిస్తామని చెప్పి దాని సాగు విస్తీర్ణాన్ని పెంచిన ప్రభుత్వం అత్యధిక ప్రజలు ఆహారంగా ఉపయోగించే వరి సాగు లక్ష్యాలను కుదిస్తోంది. ఉమ్మడిరాష్ట్రంలో 2013-14లో పదమూడు జిల్లాల ఏపీలో ఖరీఫ్‌, రబీ కలుపుకొని 25.23 లక్షల హెక్టార్లలో వరి సాగైంది. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక మూడు సంవత్సరాల్లో ఆ స్థాయిలో వరి పండలేదు. సాగు విస్తీర్ణం గ్రాఫ్‌ కిందకు దిగుతోంది. ఖరీఫ్‌ కంటే రబీ సేద్యం బాగా తగ్గుతోంది. 2014 రెండు సీజన్లూ కలుపుకొని 23.94 లక్షల హెక్టార్లలో వరి సాగైంది. రెండవ సంవత్సరం 2015-16లో అంతకుముందు ఏడాది కంటే కూడా వరి సాగు తగ్గి 21.61 లక్షల హెక్టార్లలోనే సాగైంది. ముచ్చటగా మూడోయేట 2016-17లో 20.37 లక్షల హెక్టార్లకు వరి సాగు క్షీణించింది. కృష్ణాడెల్టాకు పట్టెసీమ నీరు తోడిపోసి ఖరీఫ్‌ పంటలు కాపాడామని చెప్పినప్పటికీ చివరి భూముల్లో వరి సాగు కాలేదు. కొన్ని చోట్ల పంట ఎడింది. వరికి బదులు చాలాచోట్ల మినుములు, కందులు, పెసలు తదితర పంటలు సాగు చేశారు. గుంటూరు, ప్రకాశం జిల్లాలకు నాగార్జునసాగర్‌ కుడికాల్వ నుంచి నీరు ఇవ్వనందున వరి సేద్యం లేదు. కెసి కెనాల్‌ ఆయకట్టుకు చుక్కనీరు లేక అక్కడా వరి పంట వేయలేదు. హంద్రీ-నీవా అన్నా అతీగతీ లేదు. ఖరీఫ్‌లోనే నీటికి కటకట ఏర్పడటంతో రబీలో కృష్ణాడెల్టా, నాగార్జునసాగర్‌. కెసి కెనాల్‌ ఆయకట్టులో వరి సాగు చేయలేదు. నెల్లూరులో నిరుడు దుర్భర కరువు ఏర్పడటం, సోమశిలకు పెద్దగా నీరు చేరకపోవడంతో పెన్నార్‌ డెల్టాలోనూ వరి సాగు తగ్గింది. ఈ పరిణామాలతో నిరుడు వరి సాగుకు కోత పడింది. వరుసగా వరి సాగు తగ్గుతుండటంతో 2017లో సగటు సాగు లక్ష్యాలూ తగ్గాయి. ఖరీఫ్‌ వరి సాగు టార్గెట్లను వ్యవసాయశాఖ, ప్రభుత్వం రెండూ నిరుటి మీద దిగ్గోశాయి. 2016 ఖరీఫ్‌లో సర్కారు లక్ష్యం 17.50 లక్షల హెక్టార్లు కాగా వ్యవసాయశాఖ లక్ష్యం 16.03 లక్షల హెక్టార్లు. 2017 ఖరీఫ్‌కొచ్చేసరికి ప్రభుత్వ టార్గెట్‌ 16.25 లక్షల హెక్టార్లు కాగా వ్యవసాయశాఖ లక్ష్యం 15.63 లక్షల హెక్టార్లు. 2017-18 రబీ లక్ష్యాన్ని సైతం 8 లక్షల హెక్టార్ల నుంచి 7.50 లక్షల హెక్టార్లకు కుదించాయి. నిరుడు తొలుత 8 లక్షల హెక్టార్లని అంతలోనే ఏడు లక్షల హెక్టార్లకు తగ్గించారు. వచ్చే రబీలోనూ ఇలానే ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *