Home > Editorial > ఎవరికి ఆపద్బంధు?

ఎవరికి ఆపద్బంధు?

విద్యకు నాలుగు శాతం కూడా కేటాయించని రాష్ట్రాలు
తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్న డ్రగ్స్

appp_apduniaహైదరాబాద్‌ జిల్లాలో ఆపద్బంధు పథకం నిరుపయోగంగా మారింది. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు చేయూతనిచ్చే వారే కరువయ్యారు. ఆపద్బంధు సాయం కోసం 3 నుంచి కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ అర్హులు ఇబ్బందులు పడుతున్నారు. మండలాల వారీగా ఆపద్బంధు పథకం కింద ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నప్పటికీ తహసీల్దార్లు వాటిని పట్టించుకోవడం లేదు. అర్హులను ఎంపిక చేయడంలో అలసత్వం ప్రదర్శిస్తున్నారు. ఫలితంగా మరణించిన వారి కుటుంబాలకు భరోసా లేకుండా పోతోంది. జిల్లాలో మూడేళ్ల నుంచి కేవలం 250 మందిని మాత్రమే అర్హులుగా గుర్తించారు. అందులో 88 మందికి రూ. 44 లక్షలు మాత్రమే మంజూరయ్యాయి. అయితే ఈ నిధులు ఇంకా అర్హులకు చేరలేదు. ప్రొసీడింగ్‌ ప్రక్రియకు ఇంకెన్ని రోజులు పడుతుందో కూడా అంతుపట్టడం లేదు. ప్రమాదవశాత్తూ మరణించిన వ్యక్తుల కుటుంబాలను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం 50 వేల రూపాయల ఆర్థిక సాయం చేయాల్సి ఉంటుంది. కరెంట్‌ షాక్‌, రోడ్డు ప్రమాదాలు, పాముకాటు, నీటిలో మునక ఇంకా ఆకస్మికంగా కలిగే ప్రమాదాల్లో మరణించిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలనే ఉద్ధేశంతో ఆపద్బంధు స్కీంను ప్రభుత్వం తీసుకొచ్చింది. అయితే ఈస్కీంను మండల అధికారులు కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. ముషీరాబాద్‌, సైదాబాద్‌ తదితర మండలాల్లో అధికారులు పెద్దగా ప్రచారం చేయడం లేదు. ప్రమాదంలో తమవారిని కోల్పోయిన కుటుంబ సభ్యులకు భరోసా ఇవ్వడంలో విఫలమవుతున్నారు. ప్రభుత్వ పథకాలు ప్రకటనలకే తప్ప క్షేత్ర స్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలు చేరుతున్నాయా? లేదా? అని ఆరా తీసేవారే కరువయ్యారు. మండలాల్లో ఏ పథకం కింద ఎలాంటి లబ్ధి పొందొచ్చు, అసలు ఎలాంటి పథకాలున్నాయి? సంక్షేమ పథకాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడంలో తహసీల్దార్లు విఫలమవుతున్నారు. కొంతమంది తహసీల్దార్లకు ప్రభుత్వ పథకాల గురించి కూడా తెలియడం లేదంటే అతిశయోక్తి లేదు. ప్రజలు పథకం గురించి తెలుసుకొని దరఖాస్తు చేసుకోవడానికి వస్తే వారిని ఇబ్బందులు పెడుతున్నారు. ‘‘ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలియకుండానే ఇక్కడికి వచ్చావా..? అక్కడికి వెళ్లి అడుగుపో. ఎందుకొస్తారో మీలాంటి వాళ్లు’’ అని మరణించిన వారి కుటుంబ సభ్యులను దబాయించడం ఓ మహిళా తహసీల్దార్‌కే చెల్లింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *