Home > Editorial > బీహార్ లో సంప్రాదాయాలకు తిలోదకాలు

బీహార్ లో సంప్రాదాయాలకు తిలోదకాలు

రాష్ట్రాలలో రాజకీయ ప్రకంపనలు
సోవరిన్ బంగారం బాండ్ల పధకం మార్గదర్శక సూత్రాల సవరణకు మంత్రివర్గ ఆమోదం
 
lalu_sonia_nitish1_apduniaబీహార్ లో సంప్రదాయాలకు తిలోదకాలు ఇచ్చేశారు. రాజకీయ సంక్షోభం తలెత్తినపుడు పెద్దపార్టీని ముందుగా ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలన్న సాంప్రదాయాన్ని గవర్నర్ ధిక్కరించారు. బొమ్మయ్ కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించలేదు. కాలహరణం జరిగితే జెడియు నుంచి ఫిరాయింపులు జరగవచ్చని సందేహించాడో ఏమో, గురువారం ఉదయాన్నే ప్రమాణ స్వీకారం చేయించి  ప్రభుత్వ బలనిరూపణను ఆదేశించారు.బీహార్‌లో ఆర్‌జెడి, జెడియు, కాంగ్రెస్‌లతో కూడిన మహాకూటమి విచ్ఛేదన, జెడియు, బిజెపిలతో ఎన్‌డిఎ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం- అంతా 12-13 గంటల వ్యవధిలో జరిగిపోయింది. జెడియు అధ్యక్షుడు కూడా అయిన ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ ఒక చేత్తో రాజీనామా పత్రం, మరో చేత్తో ప్రమాణ స్వీకారపత్రం పట్టుకున్నట్లు చకచకా పరిణామాలు చోటుచేసుకున్నాయి. గవర్నర్‌కు రాజీనామా పత్రం అందజేయగానే నితీష్‌కుమార్‌కు బిజెపి కేంద్ర నాయకత్వంనుంచి అభినందనలు, మద్దతు అందాయి. ఆ వెనువెంటనే రాష్ట్ర బిజెపి నాయకులు గవర్నర్‌ను కలిసి నితీష్‌కుమార్ తోడ్పాటు లేఖ అందజేశారు.జెడియు, బిజెపి శాసన సభ్యులు సమావేశమై నితీష్‌కుమార్‌ను కూటమి నేతగా ఎన్నుకున్నారు. అసెంబ్లీలో పెద్ద పార్టీ అయిన ఆర్‌జెడి ఉదయం 11గంటలకు గవర్నర్‌తో అపాయింట్‌మెంట్ కోరినట్లు తెలియగానే, ఎన్‌డిఎ నేతలు రాత్రి 12గంటలకు గవర్నర్‌ను కలిసి ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించాలని కోరారు. తాత్కాలిక గవర్నర్ కేశరినాధ్ త్రిపాఠి గురువారం సాయంత్రం 5 గంటలకు ప్రమాణ స్వీకారోత్సవం నిర్ణయించారు. అంతలో ఏమైందో, ఉదయం 10గంటలకే ముఖ్యమంత్రిగా నితీష్‌కుమార్, ఉప ముఖ్యమంత్రిగా బిజెపి నేత సుశీల్ కుమార్ మోడీ కొద్దిమంది సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. బిజెపి అధినాయకత్వం పథకం ప్రకారమే రాజకీయ పరిణామాలన్నీ జరగ్గా, గవర్నర్‌కూడా అందులో పావు అయినారు. నితీష్‌కుమార్ ‘ఘర్‌వాపసీ’ విజయవంతంగా జరిగింది. ఈ మొత్తం పరిణామాల్లో అధికార లాలస, అవకాశ వాదం తప్ప నైతిక విలువలేమీ లేవు. బీహార్ ఓటర్లు 20 మాసాల క్రితం ప్రధాని మోడీ హవాను, రూ.1లక్షా 65వేల కోట్ల ఆర్థిక ప్యాకేజీ ఆశను లక్షపెట్టకుండా మహాకూటమికి అధికారం కట్టబెట్టారు. నితీష్‌కుమార్ అన్నట్లు ఆ కూటమి ప్రభుత్వాన్ని ఇక నడపలేకపోతే రాజీనామా చేయటం సరైందే. అయితే లౌకిక’ ముసుగుతో పోరాడి అధికారం పొందారో, ఆ అధికార మిచ్చిన ప్రజలతీర్పును మళ్లీ కోరిఉంటే ఆయన మాటలకు నైతిక విలువ ఉండేది.2019 ఎన్నికలకు ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ప్రధాని మోడీని సవాలు చేయాలనుకున్న ఆశను నితీష్ కోల్పోయినట్లున్నారు. బిజెపి రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు ప్రకటించడమే ఆయనలోని బలహీనతను తెలియజేసింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల తదుపరి కూడా మోడీయే ప్రధాని అవుతారని నిర్మితమైన అభిప్రాయాన్ని ఆయన విశ్వసించి ఉంటారు. అందువల్ల అధికారం ఉన్నచోటికి చేరటమే తన రాజకీయ జీవితానికి శ్రేయస్కరం అని భావించి ఉండవచ్చు. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం, బీహార్ రాష్ట్ర ప్రయోజనాలు, అభివృద్ధి వగైరా అవసరం కొద్ది చెప్పే కబుర్లే! ఐదేళ్ల కొరకు ప్రజలెన్నుకున్న ప్రజాప్రతినిధులు స్వలాభంతో ఓటర్ల తీర్పును తుంగలోతొక్కి రంగులు మార్చినా వారు ఏమీ చేయలేని నిస్సహాయత చట్టంలో ఉన్నంతకాలం పార్టీ ఫిరాయింపులు జరుగుతుంటాయి; సభాపతులు వారిని కాపాడుతుంటారు. ప్రభుత్వాల రంగులే మారుతుంటాయి.కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం తమ వాళ్లనే గవర్నర్‌లుగా ఎందుకు నియమిస్తుందో బీహార్ పరిణామాలు మరోమారు నిరూపించాయి.  . రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి అభ్యర్థుల ఎన్నికను గ్యారంటీ చేసుకున్న తదుపరి బిజెపి-ఆర్‌ఎస్‌ఎస్ దూకుడు పెంచాయి. జయలలిత మరణం తర్వాత ఎఐఎడిఎంకె గ్రూపులపై అదుపు 
సాధించారు.. కొరకరాని కొయ్య అనుకున్న బీహార్ పై జెండా ఎగరేశారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *