Home > Editorial > కిందకి దిగి రానంటున్న కూరల ధరలు

కిందకి దిగి రానంటున్న కూరల ధరలు

టీ-కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది
విద్యకు నాలుగు శాతం కూడా కేటాయించని రాష్ట్రాలు

vegetables market_apduniaకూరగాయల ధరలు పైపైకి ఎగబాకుతున్నా యి. ముఖ్యంగా టమాటా ధర సామాన్యునికి అందడం లేదు. ఇటీవల కురిసిన వర్షాలతో టమాటా, ఆకుకూరలు దెబ్బతినడంతో మార్కెట్‌కు సరఫరా తగ్గింది. ఫలితంగా ధరలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. మరో వారం, పది రోజులు కొత్త స్టాక్ వచ్చే వరకు ఇంతేనని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. టమాటాకు తోడు బీన్స్, కాకరకాయ, గోరుచిక్కుడు, చిక్కుడుకాయ, క్యాప్సికం ధరలు కూడా చుక్కలనంటుతున్నాయి. వంకాయ, చిక్కుడు, బెండ, ఆనపకాయ ధరలు కూడా పైపైకి ఎగబాకుతున్నాయి. వేసవిలో చాలా మంది రైతులు వివిధ రకాల కూరగాయలు సాగుచేసినప్పటికీ ఎండల కారణంగా ఆశించిన దిగుబడులు రాకపోవడం, కొద్దోగొప్పో చేతికొస్తుందనుకున్న తరుణంలో వర్షాలతో పంట దెబ్బతిన్నది. ఖరీఫ్ సీజన్లో కూరగాయల సాగు చేపట్టినా, అవి అందుబాటులోకి వచ్చే సరికి సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో మరికొన్ని రోజులు కూరగాయలకు అధిక ధరలు ఉండే అవకాశం ఉంది. టమాటా ధర పెరగడంతో కొనేవారు తమ అవసరానికి తగ్గట్లుగా ఒకటి, రెండు పూటలకు సరిపడా కొనుక్కుంటున్నారు. దీంతో పరోక్షంగా అమ్మకం తగ్గింది. టమాటా ధర బాగా పెరిగినా, ఇందులో రైతుకు దక్కేది చాలా తక్కువ. రైతులకు లాభం లేకపోవడానికి తోడు, వినియోగదారుని జేబుకు చిల్లు పడుతుంది. మధ్య దళారులు లాభపడుతున్నారు. మార్కెట్‌కు సరుకు వచ్చిందే తడవుగా దళారులు రంగప్రవేశం చేస్తున్నారు. దళారులకు ఇవ్వకుండా సరుకును ఉంచుదామంటే, పచ్చి సరుకు కావడంతో ఎక్కడ పాడవుతుందోనన్న ఆందోళనతో రైతులు దళారులు చెప్పిన ధరకే అమ్ముకుంటున్నారు. రాష్ట్ర అవసరాల్లో సుమారు 60 శాతానికి పైగా పక్క రాష్ట్రాల నుంచి తీసుకువస్తున్నారు. హైదరాబాద్‌లో అమ్మే కూరగాయల్లో 80 శాతం ఇతర రాష్ట్రాల నుంచే వస్తున్నాయి. ప్రభుత్వం మన కూరగాయలు అనే పథకం ద్వారా స్టాళ్లు ఏర్పాటు చేసి విక్రయిస్తున్నప్పటికీ డిమాండ్, సప్లయం మధ్య చాలా తేడా ఉంది. దేశవ్యాప్త కొరత కారణంగా ధరలు రెట్టింపు అయినప్పటికీ, తెలంగాణలో రవాణా చార్జీలు తడిసి మోపెడవుతున్నాయి. ఫలితంగా కూరగాయల ధరలు సామాన్యునికి అందడం లేదు. రైతులు సీజన్‌లోనే కూరగాయలు సాగు చేస్తున్నారు. దీంతో అన్ని ప్రాంతాల నుంచి అదే పంట ఒకేసారి చేతికొచ్చి మార్కెట్‌కు వస్తుంది. దీంతో ధరలు తీవ్రంగా తగ్గి రైతుకు గిట్టుబాటు ధర లభించడం లేదు. గతంలో టమాటాను చేలల్లోనే వదిలేసిన సందర్భాలు అనేకం. రూపాయి, రెండు రూపాయలకే కిలో చొప్పున కూడా టమాటాను అమ్మారు. అదేవిధంగా ఉల్లి ధరలు కూడా ఒకేసారి పెరుగుతాయి. లేదంటే ఒకేసారి తగ్గుతున్నాయి. మార్కెట్‌లో దళారీ వ్యవస్థ కారణంగా సీజన్లో కూరగాయల ధరలు బాగా తగ్గిపోవడం, ఇతర సమయాల్లో ధర బాగా పెరిగిపోవడం జరుగుతోందని మార్కెటింగ్ శాఖ వర్గాలు అంటున్నాయి. మార్కెట్లో ఏ సమయంలో ఏ పంట ధర ఎక్కువగా ఉంటుందో అంచనా వేసి, ఆ కాలంలో మార్కెట్‌కు వచ్చేలా పంటలు సాగుచేయడానికి ఉద్యానశాఖ ప్రత్యేక ప్రణాళిక రూపొందించాల్సిన అవసరం ఉంది. దళారుల దోపిడీని అరికట్టి, రైతులకు, వినియోగదారులకు నష్టం లేకుండా అమ్మితే బాగుంటుందన్న సూచనలు వినిపిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *