Home > Editorial > ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్న విజయ్ మాల్యా

ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్న విజయ్ మాల్యా

అక్కడో మాట....ఇక్కోడో మాట...
ఐటీడీఏ పాలనలతో కొరవడతున్న ట్రాన్స్ పరెన్సీ

Mallya22_Apduniaబడా పారిశ్రామికవేత్త, అంతే పెద్ద ఆర్థిక నేరస్థుడు విజయ్ మాల్యాను లండన్ నుంచి వెనక్కితెచ్చే భారత ప్రభుత్వ ప్రయత్నాలకు బ్రేకు పడింది. ఎప్పటికి సాధ్యమో కనీసం ఊహించలేని స్థితి. చట్టప్రకారం వెనక్కి రప్పించే ఎక్స్‌ట్రాడిషన్ పిటిషన్ వేశాం, త్వరలోనే తెచ్చి కోర్టు ముందు హాజరుపరుస్తాం అని కేంద్ర ప్రభుత్వం నుంచి వినిపించే ధ్వనులకు తగిన రీతిలో అధికార యంత్రాంగం కదలటం లేదని విదితమైంది. భారత ప్రభుత్వ ఎక్స్‌ట్రాడిషన్ పిటిషన్ మంగళవారంనాడు వెస్ట్ మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టులో విచారణకు వచ్చినప్పుడు ఈ విషయం స్పష్టమైంది. మాల్యాపై ఆరోపణలకు సంబంధించిన సిబిఐ దర్యాప్తు పత్రాలు ప్రాసిక్యూషన్‌కు చేరలేదు. అవి ఢిల్లీలోని బ్రిటిష్ హైకమీషన్‌కు గతవారం మాత్రమే అందాయట. వాటిని లండన్‌కు సకాలంలో చేర్చటం సాధ్యం కాలేదు. వాటిని విదేశీ వ్యవహారాలు, దేశీయ వ్యవహారాల కార్యాలయాలు అందుకుని, మేజిస్ట్రేట్ కోర్టులో భారత తరఫున వాదిస్తున్న క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీసుకు చేర్చాలి. విచారణ తేదీ ఎప్పుడో నిర్ణయమైనప్పటికీ సిబిఐ పత్రాలు పంపటంలో జరిగిన జాప్యం ఉద్దేశపూర్వకమేనని సందేహించాల్సి ఉంటుంది. ఇందుకు బాధ్యులెవరో నిర్ధారించాల్సి ఉంటుంది. భారత్ సకాలంలో సమాధానాలు పంపక పోవటాన్ని మేజిస్ట్రేట్ ఆక్షేపించారు. పర్యవసానంగా విచారణను వచ్చే ఫిబ్రవరి-మార్చికి వాయిదా వేయాలన్న డిఫెన్స్ వాదనతో పూర్తిగా ఏకీభవించని మేజిస్ట్రేట్ డిసెంబర్‌కు వాయిదా వేశారు. మాల్యాపై మరో కేసు జులై 6న విచారణకు వస్తున్నందుకు ఆ రోజు తేదీలు ఖరారవుతాయి.బ్యాంకులకు రూ॥9వేల కోట్లు ఎగనామం, ఇంకా పలు ఆర్థిక నేర కేసులు ఎదుర్కొంటున్న మద్యం వ్యాపార సామ్రాజ్య అధినేత, కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ అధిపతి, రాజ్యసభ సభ్యుడు విజయ్‌మాల్యా లండన్ ఉడాయించారు. తిరిగి రావాలని, కోర్టుముందు హాజరు కావాలని ఎన్ని నోటీసులు పంపినా స్పందించని ఈ బడా వ్యాపారి అక్కడ విలాస జీవితం గడుపుతున్నాడు. భారత ప్రభుత్వ విజ్ఞప్తులపై బ్రిటిష్ పోలీసులు ఏప్రిల్‌లో అతన్ని అరెస్టు చేయగా, ఆరున్నర లక్షల పౌండ్లు బాండ్‌తో బెయిలు పొందాడు. వెస్ట్ మినిస్టర్ మేజిస్ట్రేట్ ఆ బెయిలును డిసెంబర్ 4 వరకు పొడిగించారు. మాల్యాకు బ్రిటన్‌లో కూడా భారీ వ్యాపారాలున్నాయి. అక్కడ వచ్చిన ఆదాయాన్ని కుటుంబ సభ్యులకు బదలాయించి భారత్‌కు మొండిచేయి చూపారు. రూ॥ 4 వేల కోట్లు చెల్లించటానికి ఒక దశలో సిద్ధమైనాడు. ఒన్‌టైం సెటిల్మెంట్ వంటి సాంప్రదాయక పద్ధతులను బ్యాంకులు పాటించకుండా తనను వేధిస్తున్నాయని ప్రత్యారోపణ చేశారు తానెట్టి నేరం చేయలేదని అతను లండన్ కోర్టుముందు తెరపైకి తీసుకొచ్చారు. కాదు, నేరాలు చేశావని సాక్షాధారాలతో కోర్టును ఒప్పించాల్సిన బాధ్యత భారత ప్రభుత్వంపై ఉంది. కోర్టు విచారణ క్రమంలో మరిన్ని వివరణలు కోరవచ్చు, భారత్ వాటికి సమాధానాలు పంపుకోవాలి. ఇంగ్లండ్-భారత్‌ల మధ్య నేరస్థుల అప్పగింత ఒప్పందం ఉన్నప్పటికీ ఎక్స్‌ట్రాడిషన్ ప్రొసీడింగ్స్ కొలిక్కిరావటం సునాయాసంకాదు. ఐపిఎల్ ఆర్థిక నేరస్థుడు లలిత్‌మోడీ కూడా లండన్‌లో ఉంటున్నారు. అతని భార్యకు వైద్యం సందర్భంలో అతడు పోర్చుగల్ వెళ్లడానికి సహాయపడిన విదేశీవ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్ దాన్ని మానవతా సహాయంగా సమర్థించుకున్నారు. బడా వ్యాపారులకు ప్రభుత్వంలో, ఉన్నతాధికార వర్గంలో ఉండే సంబంధాలు అవసర సందర్భాల్లో ఉపయోగపడుతుంటాయి.విజయ్ మాల్యా ఆస్తులు స్వాధీనం చేసుకోవటం, వేలం ద్వారా అమ్మటం వంటి కొన్ని రికవరీ ప్రక్రియలను ప్రభుత్వం చేబడుతున్నప్పటికీ కొనుగోలుదారులు ముందుకు రావటం లేదు. వాటి ధర గిట్టుబాటు కాకపోవటమో లేక సంపన్నుల సంఘీభావమో ఊహించటం కష్టం. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తాజాగా రూ॥9000 కోట్ల మనీలాండరింగ్ కేసు మాల్యాపై పెట్టింది. భారత బ్యాంకులు దాదాపు రూ॥8 లక్షల కోట్ల పాత బాకీలు ఎదుర్కొంటున్నాయి. అందులో 25 శాతం 50 మంది ఖాతాలేనట. వారిపై కేసులు దాఖలుకు ప్రభుత్వం దివాలా చట్టం తెచ్చింది. బ్యాంకులకు గుదిబండగా మారిన నిరర్ధక ఆస్తులనబడే ఈ అప్పుల పరిష్కారం ఎంత కష్టతరమో మాల్యా కేసులో ప్రభుత్వ రికవరీ ప్రయత్నాలు వైఫల్యం తెలియ జేస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Facebook Auto Publish Powered By : XYZScripts.com