Home > Politics > రోజు రోజుకు ముదురుతున్న టీడీపీ, బీజేపీ వివాదం

రోజు రోజుకు ముదురుతున్న టీడీపీ, బీజేపీ వివాదం

వైసీపీ గూటికి పనబాక దంపతులు
పార్టీ దిశగా ఆర్ కృష్ణ‌య్య అడుగులు

telugudesam-bjp-apduniaపశ్చిమగోదావరిలో టీడీపీ, బీజేపీ విభేదాలకు ఇప్పట్లో ఫుల్‌స్టాప్ పడే సూచనలు కనిపించడంలేదు. జిల్లాలో టిడిపి, బిజెపి కూటమి పూర్తిస్థాయిలో విజయకేతనం ఎగురవేయడం, ఆ తరువాత అప్రతిహతంగా వారి హవా కొనసాగడం తెలిసిందే. అయితే తొలి నుంచి తాడేపల్లిగూడెం నియోజకవర్గం మిత్రపక్షాల మధ్య వివాదాలకు వేదికగా కొనసాగుతోంది. ఇక్కడ నుంచి బీజేపీ తరఫున విజయంసాధించిన పైడికొండల మాణిక్యాలరావు ప్రస్తుతం మంత్రిగా వున్నారు. అలాగే అంతకుముందు తాడేపల్లిగూడెం సీటును ఆశించి పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించడంతో జడ్పీ ఛైర్మన్‌గా స్థిరపడ్డ ముళ్లపూడి బాపిరాజు ఒక వర్గంగా మారిపోయారు. అటు మంత్రి, ఇటు జడ్పీ ఛైర్మన్ అన్న విధంగా ఇక్కడ రాజకీయాలు మారిపోయాయి. టీడీపీకి అనుకూల పరిస్థితులను కొనసాగిస్తూనే తన పట్టును మరింత పెంచుకోవడానికి ముళ్లపూడి బాపిరాజు ప్రయత్నాలు చేస్తూనేవచ్చారు. ఇది అనివార్యంగా మంత్రి మాణిక్యాలరావు వర్గానికి ఇచ్చగించలేదు. ఫలితంగా రెండు వర్గాల మధ్య వివాదం రాజుకుంటూనే వస్తోంది. తొలి నుంచి ఒకరిపై ఒకరు విమర్శల బాణాలు ఎక్కుపెట్టుకోవడంతో ఎప్పటికప్పుడు పతాకశీర్షికలకు ఎక్కడం, ఆ తరువాత పార్టీల నేతల మధ్య చర్చలు నిర్వహించి, ఆ వివాదానికి శుభం కార్డు వేశామని ప్రకటించడం జరుగుతూనే వుంది. అయితే తాజాగా మరోసారి ఈ వ్యవహారం పూర్తిస్థాయిలో వివాదంగా మారిపోయింది. ఈ రెండువర్గాలమధ్య సయోధ్యకు సంబంధించి జరుగుతున్న ప్రయత్నాలన్నీ ఎటువంటి ఫలితాన్ని ఇవ్వకపోగా చివరకు వీరి మధ్య వివాదం రాష్టస్థ్రాయికి కూడా చేరిపోవడం గమనార్హం. మంత్రి మాణిక్యాలరావు జన్మభూమి సందర్భంగా చేసిన కొన్ని వ్యాఖ్యలు ఈ రెండు పార్టీల మధ్య వున్న మిత్రత్వంలో కొంత వేడిని రాజేశాయనే చెప్పాలి. ఆ తరువాత దీన్ని కూడా ఏదో ఒక విధంగా సర్దుబాటుచేసి మైత్రిని ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నాలు సహజంగానే జరిగాయి. కానీ అవి అంతగా ఫలితాన్ని ఇచ్చినట్లు కనిపించడం లేదు. శనివారం ఏలూరులో జరిగిన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశానికి హాజరైన ఇన్‌ఛార్జి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో ఈ వ్యవహారానికి ఫుల్‌స్టాప్ పెట్టేందుకు ప్రయత్నం జరిగింది. అయితే ఇది అంత సానుకూలంగా జరిగిన సంకేతాలు కనిపించడం లేదు. మరోవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా ఈ విషయంలో జోక్యం చేసుకుని సర్దుబాటు చేస్తారన్న ప్రచారం జరిగినా ఆ పరిస్థితి ప్రస్తుతానికి కనిపించడంలేదు. అయితే పార్టీపరంగా కొంతమేరకు జడ్పీ ఛైర్మన్ బాపిరాజును శాంతిపంచేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. అయినప్పటికీ రెండువర్గాల మధ్య ఇప్పటికే రాజుకున్న వివాదం తీవ్రస్థాయికి చేరడంతో ఇప్పుడు ఎవరూ వెనక్కి తగ్గే పరిస్థితి కనిపించడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తాజా పరిణామాలతో గూడెం వివాదానికి పీట ముడి పడినట్లేనన్న అభిప్రాయం కూడా లేకపోలేదు. అవసరమైతే ఎంత వరకైనా వెళతామన్న రీతిలో మిత్రపక్షాలు రెండూ వ్యాఖ్యలు చేసుకుంటుండటంతో ఈ పరిణామాలు ఎక్కడికి దారితీస్తాయన్న ఉత్కంఠ రెండు పార్టీల నేతల్లోనూ వ్యక్తమవుతోంది. ఏది ఏమైనా తొలి నుంచి చిన్నగా ప్రారంభమైన వివాదం చివరకు రాష్టస్థ్రాయిని చేరుకోవడంతో దీనికి ఫుల్‌స్టాప్ పడుతుందా? లేక కొనసాగి చివరకు మిత్రత్వంపైనే అనుమానాలను స్థిరం చేస్తుందా? అన్న అంశం ఇప్పుడు రెండు పార్టీల నేతల్లోనూ తీవ్ర ఉత్కంఠను, ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *