Home > Politics > పశ్చిమలో టీడీపీ, బీజేపీ వార్

పశ్చిమలో టీడీపీ, బీజేపీ వార్

విభజన చట్టాన్ని అమలు చేయాలి : చంద్రబాబు
మోడీ, బాబు భేటీపై సర్వత్రా ఉత్కంఠ

tdp-bjp-adpuniaతాడేపల్లిగూడెం నియోజకవర్గంలో టీడీపీ, బీజేపీ నాయకుల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. ఒకరు చేస్తున్న పనులకు మరొకరు అడ్డంకులు సృష్టించుకోవడం, అభివృద్ధి పనులు సాగకుండా చేయడం వంటివి ఇప్పటివరకు జరిగాయి. రెండు రోజులగా జరుగుతున్న పరిణామాలతో విభేదాలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఒకరిపై ఒకరు ఖబడ్దార్‌ అని విమర్శించుకునే స్థాయికి చేరుకున్నారు. మాటల తూటాలు సోషల్ మీడియా హల్‌చల్‌ చేయడంతో కేసుల దాకా వెళ్లాయి. డిసెంబర్ 23న తెదేపా నాయకులు సమావేశం ఏర్పాటు చేసి ఓ బీజేపీ నాయకుడ్ని విమర్శించారు. ఇదీ కూడా సోషల్‌ మీడియాలో అప్‌లోడు చేశారు. దీనిపై భాజపా నాయకుడు నరిశే సోమేశ్వరరావు ఫిర్యాదు మేరకు తెదేపా నాయకులు నలుగురిపై కేసులు నమోదు చేశారు. ఏ1గా తెదేపా నాయకుడు గేదెల శ్రీనివాసు, ఏ2గా మునిసిపల్‌ ఛైర్మన్‌ బొలిశెట్టి శ్రీనివాసు, ఏ3గా పురపాలక సంఘ వైస్‌ ఛైర్మన్‌ కిల్లాడి ప్రసాదు, ఏ4గా ఏడుకొండలును పేర్కొన్నారు. మరో వైపు సొంత నియోజకవర్గంలో తనను అంటరానివాడిగా చూసే దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడిందని దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు ఆవేదన వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం రామన్నగూడెంలో జరిగిన జన్మభూమి సభలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలో ఏ కార్యక్రమాలకూ తనను పిలవడంలేదని, తన పాత్ర లేకుండా ఇక్కడ ఏ పనీ జరగదంటూ స్థానిక టీడీపీ నేతలపై ఆయన మండిపడ్డారు‘నన్నే నిలదీస్తారట.. ఏం నిలదీస్తారు.. నన్ను నిలదీసే పరిస్థితి వస్తే ప్రభుత్వాన్ని నిలదీస్తా.. నన్ను కట్ చేసే పరిస్థితి వస్తే ఆంధ్రప్రదేశ్‌ను కూడా కట్ చేస్తా. సొంత నియోజకవర్గంలో నన్నో అంటరానివాడిగా చూస్తున్నారు. సహనానికి కూడా హద్దులుంటాయి.. మూడున్నరేళ్లుగా సహనంతో ఉన్నా. ఏం వెంకటపతి.. ఊర్లో కార్యక్రమానికి ఎప్పుడైనా ఆహ్వానించారా.. ఎప్పుడైనా దీనిపై మీరేవరన్నా మాట్లాడారా..’ అని మాణిక్యాల రావు ప్రశ్నించారు.‘నేను శత్రువునా.. ఈ రాష్ట్రంలో నిరంతరం ప్రతి క్యాబినెట్‌లో ముఖ్యమంత్రి పక్కన కూర్చునే వ్యక్తిని. కేంద్రంలో, రాష్ట్రంలో కలిసి పనిచేస్తున్నాం.. ఇదా నాకు ఎదురయ్యేది..’ అంటూ మాణిక్యాల రావు మండిపడ్డారు. జన్మభూమి-మా ఊరు కార్యక్రమాన్ని కూడా కేంద్రం నిధులతోనే చేస్తున్నారని ఆయన అన్నారు.పక్కనే మహిళా తహసీల్దార్, సభలో మహిళలు ఉన్నారని కూడా చూడకుండా అసభ్య పదజాలంతో మంత్రి రెచ్చిపోయారు. జెడ్పీ చైర్మన్ ముళ్ళపూడి బాపిరాజుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘నన్ను నిలదీసే పరిస్థితి వస్తే.. మగాడిగా రెచ్చిపోతా’ అంటూ ధ్వజమెత్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Facebook Auto Publish Powered By : XYZScripts.com