Home > Politics > పవన్ ప్లాన్ ఏంటి..?

పవన్ ప్లాన్ ఏంటి..?

కాంగ్రెస్ నేతల్లో మొదలైన కాక
నిందలు వేసి పబ్బం గడుపుకుంటున్న చంద్ర‌బాబు

pawan-janasena-apduniaజనసేన అధినేత రాజకీయ వ్యూహాలను అమలు చేయడం ప్రారంభించారా? ముద్రగడతో జనసేన కోశాధికారి భేటీలో ఏ ఏ అంశాలు చర్చకు వచ్చాయి? ముద్రగడను కలవాలని పవన్ కల్యాణ్ నిర్ణయించుకోవడం దేనికి సంకేతం..? జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీని కింది స్థాయి నుంచి నిర్మించుకునే విషయంలో నింపాదిగా వ్యవహరిస్తున్నారు. జిల్లాల వారీగా శిబిరాలు నిర్వహించి జనసైనికులను ఎంపిక చేసుకున్నారు. సభ్యత్వ నమోదును కూడా ప్రారంభించారు. మార్చిలో ప్లీనరీ నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నారు. ప్లీనరీ జరిగినప్పటి నుండి పవన్ కల్యాణ్, ఇక పూర్తి సమయం రాజకీయాలకే కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది.

కొత్త తరహా రాజకీయ సంస్కృతికి జనసేన అర్థం చెబుతుందని పవన్ కల్యాణ్ పదే పదే చెబుతూంటారు. దానికి తగ్గట్లుగానే కొన్ని అంశాలపై నిర్ధిష్టమైన అభిప్రాయాలను వెల్లడించేవారు. కాపులకు రిజర్వేషన్ల ఉద్యమం హింసాత్మకంగా మారినప్పుడు ఆ ఘటనలను ఖండించారు కానీ, రిజర్వేషన్ల ఉద్యమానికి నేరుగా మద్దతు ప్రకటించలేదు. ప్రభుత్వం చేయలేకపోతే ఆ విషయాన్ని సూటిగా చెప్పాలని మాత్రం డిమాండ్ చేశారు. ఇతర అంశాల్లో పవన్ కల్యాణ్, రాజకీయ ప్రయోజనాలు కలుగుతాయన్న ఉద్దేశంతో నిర్ణయాలు తీసుకోలేదు. పూర్తి స్థాయి రాజకీయ కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్న పవన్ కల్యాణ్ ఇప్పుడిప్పుడే తన వ్యూహాలకు పదనుపెడుతున్నట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి.

కాపు రిజర్వేషన్ ఉద్యమ నేత ముద్రగడ పద్మానాభంతో జనసేన కోశాధికారి మారిశెట్టి రాఘవయ్య చడీచప్పుడు కాకుండా సమావేశమయ్యారు. పవన్ కల్యాణ్ దూతగా వచ్చినట్లుగా చెప్పి.. అనేక అంశాలపై చర్చలు జరిపారు. జనసేన పార్టీ నిర్మాణం, రాజకీయ వ్యూహాలు, రిజర్వేషన్లపై సలహాలు, సూచనలు తీసుకున్నట్లు సమాచారం.
త్వరలోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్ కలుస్తారని ముద్రగడ పద్మనాభంకు రాఘవయ్య చెప్పారు. మామూలుగా అయితే జనసేనకు సంబంధించి ఎలాంటి రాజకీయ అంశాన్నైనా పవన్ కల్యాణ్ సోషల్ మీడియా ద్వారా స్వయంగా వెల్లడిస్తారు. కానీ ముద్రగడలో రాఘవయ్య భేటీ విషయంపై మాత్రం ఎలాంటి ప్రకటనా చేయలేదు. పవన్ కల్యాణ్ రాజకీయ వ్యూహాల్లో వస్తున్న మార్పునకు ముద్రగడ పద్మనాభంతో జరుపుతున్న చర్చలే సాక్ష్యమని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.

నిజానికి ముద్రగడతో జనసేనకు సన్నిహిత సంబంధాలు లేవు. రిజర్వేషన్ ఉద్యమం తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు ముద్రగడ ఇతర పార్టీల్లోని సామాజికవర్గ ప్రముఖులతో తరచూ సమావేశమయ్యేవారు. కానీ పవన్ కల్యాణ్‌ను కలిసే అవకాశం మాత్రం రాలేదు. పైగా జనసేన కూడా రిజర్వేషన్ల పోరాటానికి బహిరంగంగా ఎలాంటి మద్దతూ ప్రకటించలేదు. అందుకే ముద్రగడ పద్మనాభం కూడా పవన్ కల్యాణ్‌పై చాలాసార్లు తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ ఎవరో తనకు తెలియదని కూడా ప్రకటించారు.

అయితే ఇప్పుడు పవన్ కల్యాణ్ ఎవరో తనకు తెలియదన్న ముద్రగడతోనే జనసేన నేత రాఘవయ్య చర్చలు జరపడానికి రాజకీయ వ్యూహమే కారణమన్న అంచనాలున్నాయి. పార్టీకి అండగా ఉంటాయనుకున్న సామాజికవర్గాల మద్దతును పూర్తి స్థాయిలో సమీకరించడంతో పాటు సీనియర్ రాజకీయనేతల సూచనలు, సలహాలతో పార్టీ నిర్మాణం చేపట్టాలన్న వ్యూహాన్ని జనసేన అధినేత అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. స్వయంగా పవన్ కల్యాణ్ దూతగా మారిశెట్టి రాఘవయ్య రావడంతో ముద్రగడ పద్మనాభం కూడా జనసేన బలోపేతానికి సూచనలు, సలహాలు ఇచ్చినట్లు సమాచారం. ముఖ్యంగా కాపు సామాజికవర్గం పవన్ కల్యాణ్ పై ఎన్నో ఆశలు పెట్టుకుందని వాటిని నెరవేర్చే దిశగా పవన్ కృషి చేయాలని ముద్రగడ సూచించినట్లు తెలుస్తోంది.

జనసేనకు కుల ముద్ర అంటేనే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసే పవన్ కల్యాణ్ ఇప్పుడు స్వయంగా ముద్రగడ పద్మనాభంతో ఎందుకు చర్చలు ప్రారంభించారన్నది రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారింది. కాపు సామాజికవర్గం జనసేనకు బేస్‌గా ఉంటుందనే భావనతోనే పవన్ వ్యూహంలో మార్పు వచ్చి ఉంటుందని భావిస్తున్నారు. త్వరలో ముద్రగడతో భేటీ అయ్యేందుకు కూడా పవన్ సిద్ధపడటం దీనికి సూచిక అని రాజకీయవర్గాలు చెబుతున్నాయి. కాపు రిజర్వేషన్ ఉద్యమం నడిపిన ముద్రగడను పార్టీలోకి తీసుకుని రాజకీయ అనుభవాన్ని ఉపయోగించుకుంటారన్న విశ్లేషణలు కూడా ప్రారంభమయ్యాయి.

భిన్నమైన రాజకీయ సంస్కృతికి నాంది పలుకుతానంటున్న పవన్ కల్యాణ్ రాజకీయ పార్టీగా జనసేన నిలబడాలనుకుంటే ఇప్పటివరకూ తను చెప్పిన కొద్ది సిద్ధాంతాలను పక్కన పెట్టక తప్పదన్న అభిప్రాయానికి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. జనసేనకు అండగా ఉండే వర్గాలకు ముందుగా భరోసా కల్పించడం, ఆ తర్వాత సీనియర్ రాజకీయ నేతలను పార్టీలోకి తీసుకుని, వారి సలహాలు, సూచనలతో ముందుకెళ్లడం కూడా పవన్ వ్యూహాల్లో భాగంగానే భావిస్తున్నారు. ఇదే నిజమైతే త్వరలోనే జనసేన పార్టీలో చేరికల పర్వం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ప్లీనరీ తర్వాత జనసేన నుంచి అసలు సిసలు రాజకీయం వెల్లడయ్యే సూచనలున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *