Home > Politics > కోమటి బ్రదర్స్….కిం కర్తవ్యం

కోమటి బ్రదర్స్….కిం కర్తవ్యం

చిన్నారెడ్డిపై దాడిని ఖండించిన మల్లు రవి
ఇండియాలో వారసత్వ రాజకీయాలు సాధారణం

komatireddy-brothers-apduniaకోమటిరెడ్డి బ్రదర్స్‌, ఉమ్మడి నల్గొండ జిల్లాలో రాజకీయాలకు అతీతంగా ఈ పేర్లు తెలియనివారుండరు. అంతటి చర్చనీయాంశ రాజకీయనాయకులుగా వీరి పేర్లు నల్గొండ ప్రజల్లో నానుతుంటాయి. కీర్తి శేషులు వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డికి చాలా విశ్వాసమైన వ్యక్తిగా కోమటిరెడ్డికి గుర్తింపు ఉంది. ఆ సమయంలోనే తమ్ముడు రాజగోపాల రెడ్డిని భువనగిరి ఎంపీగా పార్లమెంటుకు పంపించారు. అయితే వైఎస్‌ మరణాంతరం కోమటిరెడ్డి బ్రదర్స్‌కు చెక్‌ పడిందనే చెప్పుకోవచ్చు. అనివార్య పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర సాధన పేరుతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. అదే సమయంలో ఉత్తమ్‌కు మంత్రి పదవి లభించింది.మొదటి నుండి ఎడమొహం పెడమొహంగా ఉన్న కోమటిరెడ్డి, ఉత్తమ్‌ల నడుమ కిరణ్‌ కుమార్‌ రెడ్డి హయాంలో మంత్రి పదవులు మారాయి. దీంతో వీరిద్దరి మధ్య మరింత దూరం పెరిగింది. పరస్పర విమర్శలు చేసుకుంటూ, ఎన్నికల్లో సైతం ఒకరినొకరు ఓడించుకునేందుకు ప్రయత్నించారనే విమర్శలు సొంత పార్టీ నేతల నుండి వ్యక్తమయ్యాయి. ఈ సందర్భంలో టీపీసీసీ పగ్గాలు ఉత్తమ్‌కు దక్కడం కోమటిరెడ్డి బ్రదర్స్‌కు పెద్ద దెబ్బగా చెప్పవచ్చు. నాటి నుండి అవకాశం దొరికినప్పుడల్లా ఉత్తమ్‌ను విమర్శిస్తూ టీపీసీసీని తాము పరిగణలోకి తీసుకోవడంలేదని బహిరంగంగానే ప్రకటించారీ ఇద్దరు సోదరులు.సాధారణ ఎన్నికల్లో టీపీసీసీ బాధ్యతల్లో ఉన్న ఉత్తమ్‌ వైఖరి వల్లే కాంగ్రెస్‌ ప్రజల్లోకి వెళ్లలేకపోయిందని కోమటిరెడ్డి బ్రదర్స్ ప్రచారం చేశారు. తమకు వీలున్న మార్గాల ద్వారా అధిష్ఠానం వద్దకు పదే పదే ఈ విషయాన్ని తీసుకెళ్లారు. గతంలో పార్టీ ఇంచార్జ్‌గా ఉన్న దిగ్విజయ్‌ సింగ్‌ వైఎస్‌ వర్గానికి సన్నిహితంగా ఉండటం వల్లే టీపీసీసీపై విమర్శలు చేసినా కోమటిరెడ్డి బ్రదర్స్‌పై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలున్నాయి. ఉత్తమ్‌ వైఖరితో 2019 ఎన్నికలకు వెళ్తే తెలంగాణలో పార్టీ మరింత దిగజారిపోతుందని కోమటిరెడ్డి వర్గం ప్రచారం చేస్తూ వస్తోంది. తెలంగాణాలో పార్టీకి పూర్వవైభవం రావాలంటే కోమటిరెడ్డి లాంటి మాస్‌ ఫాలోయింగ్‌ ఉన్న నాయకులు పార్టీ పగ్గాలు చేపట్టాలని సామాజిక వెబ్‌సైట్‌ల ద్వారా, తన క్యాడర్‌ ద్వారా విస్తృతంగా ప్రచారం చేయించారు కోమటిరెడ్డి బ్రదర్స్‌. దీంతో టీపీసీసీ నాయకత్వం మార్పు జరుగుతుందని, బ్రదర్స్‌లో ఒకరికి పదవి వరిస్తుందని ప్రచారం జరిగింది.అదే సమయంలో టీఆర్‌ఎస్‌లోకి కోమటిరెడ్డి వెళ్తున్నారన్న ప్రచారం జరగడం, అనూహ్యంగా ఎంపీ గుత్తా సుఖేందర్‌ రెడ్డి గులాబీ పార్టీకి చేరడంతో కోమటిరెడ్డి బ్రదర్స్‌ వెనక్కి తగ్గారన్న ఆరోపణలున్నాయి. అప్పటివరకు కేసీఆర్‌పై పెద్దగా విమర్శలు చేయని కోమటిరెడ్డి బ్రదర్స్‌ ఆ తర్వాత తీవ్రమైన విమర్శలకు దిగడం చర్చనీయాంశంగా మారింది. అప్పటి నుండి ఈ బ్రదర్స్‌ బీజేపీలో చేరనున్నట్లు ప్రచారం జరిగింది. ఈ సమయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా నల్గొండలో నాలుగు రోజుల పాటు మకాం వేయడంతో ప్రచారం నిజమవుతుందని భావించారు. అయితే సెప్టెంబర్‌లో టీపీసీసీ పగ్గాలు మారే అవకాశం ఉండటంతో తమకు కొంత సమయం కావాలని, తర్వాత నిర్ణయం తీసుకుంటామని కోమటిరెడ్డి బ్రదర్స్‌ బీజేపీ నేతలకు చెప్పినట్టు ప్రచారం జరిగింది. ఆ తర్వాత కొంత కాలం పాటు ఈ ప్రచారాలు సద్దుమనిగినా ఇటీవల మళ్లీ ఈ చర్చ తెరపైకి వచ్చింది. ఇటీవల కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్‌గా దిగ్విజయ్‌ స్థానంలో కుంతియా బాధ్యతలు చేపట్టడం కోమటిరెడ్డి బ్రదర్స్‌ను మరింత ఇరకాటంలో పెట్టినట్టయింది. కుంతియా ఉత్తమ్‌ వర్గంతో సన్నిహితంగా ఉన్నారనే అభిప్రాయాలున్నాయి. ఉత్తమ్‌ తన నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన పార్టీ సభలకు కుంతియా హాజరుకావడంతో టీపీసీసీలో మార్పులు జరగవనే ప్రచారం జరిగింది. దీంతో టీపీసీసీ కోసం ఎదురు చూస్తున్న కోమటిరెడ్డి బ్రదర్స్‌కు అవకాశాలు సన్నగిల్లిపోయాయని కాంగ్రెస్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఉత్తమ్‌ సారధ్యంలోనే వచ్చే శాసనసభ ఎన్నికలను ఎదుర్కుంటామని కుంతియా ప్రకటించడం సొంత పార్టీలోనే తీవ్ర చర్చకు దారితీసింది.కుంతియా ప్రకటనతో కోమటిరెడ్డి డోలాయమానంలో పడినట్టు తెలుస్తోంది. ఇప్పటికే నల్గొండ నియోజకవర్గం లక్ష్యంగా సీఎం కేసీఆర్ పావులు కదుపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో కుంతియా వ్యాఖ్యలు తమ క్యాడర్‌ను నైరాశ్యంలోకి నెట్టాయని బ్రదర్స్‌ భావిస్తున్నట్టు సమాచారం. ఈ వ్యవహారాన్ని రాహుల్‌ దగ్గరే తేల్చుకుంటామనుకున్నా కుంతియా వ్యాఖ్యలలోని అంతరార్థం గురించి బ్రదర్స్‌ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం జాతీయ స్థాయిలో ఉన్న రాజకీయ పరిణామాలతో మొదటి నుండి వ్యాపార ప్రయోజనాల కోసం బీజేపీకి వెళ్లడం శ్రేయస్కరమని సోదరులు భావిస్తున్నారు. కాని రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు బీజేపీ ప్రభావిత శక్తిగా ఎదిగే అవకాశం లేకపోవడంతో కేవలం ఎమ్మెల్యేగా సరిపెట్టుకోవాలా అన్న ఆలోచనలో వెంకటరెడ్డి ఉన్నట్లు సమాచారం. వెంకటరెడ్డి బీజేపీలో చేరే అవకాశాలున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అక్టోబర్‌లో ఇందుకు ముహూర్తం ఖరారు చేసినట్టు సమాచారం. టీపీసీసీ పగ్గాలు రాకపోతే కమలం గూటికి చేరడం ఖాయమని కోమటిరెడ్డి అనుచరులు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. ఏదేమయినప్పటికీ కోమటిరెడ్డి బ్రదర్స్‌ పార్టీ మార్పు ప్రచారం వారి రాజకీయ స్థిరత్వాన్ని ప్రశ్నార్థకంగా మార్చిందనడంలో ఎలాంటి సందేహం లేదు. మొదటి నుండి ఉమ్మడి నల్గొండ జిల్లాలో బలంగా ఉన్న బ్రదర్స్‌ ప్రస్తుతం ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారనేది అక్టోబర్‌ మాసంలో తెలియనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Facebook Auto Publish Powered By : XYZScripts.com