Home > Editorial > టీ-కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది

టీ-కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది

గల్ఫ్ కష్టాలు
కిందకి దిగి రానంటున్న కూరల ధరలు
 
t congress2_apduniaకాంగ్రెస్ పార్టీలో కోవర్టులు తిష్ట వేశారా…? కీలక ఆలోచనలు క్షణాల్లో ప్రత్యర్థులకు చేరిపోతున్నాయా…? ప్రతిష్టాత్మక పథకాల రూపకల్పన సమాచారం పురిట్లోనే పక్క పార్టీల వాకిట్లో వాలిపోతోందా….? కోవర్టుల విషయంలో కాంగ్రెస్ ముఖ్యుల సందేహాలేమిటి…? కోవర్టుల విషయంలో తెలంగాణ కాంగ్రెస్ ఎదుర్కొంటోన్న సవాళ్లు ఏమిటి..? ఏపీ కాంగ్రెస్ లో కొత్త పుంతలు తొక్కుతోన్న కోవర్టుల కథేమిటి…? కోవర్టులు కాంగ్రెస్‌ పార్టీ వెన్నులో వణుకు పుట్టిస్తున్నారు. పార్టీలో దగ్గినా, తుమ్మినా సమాచారం పొల్లుపోకుండా ప్రత్యర్థులకు చేరిపోతోంది. వచ్చే ఎన్నికల కోసం తాము చేస్తోన్న మేధోమథనం క్షణాల్లో ప్రత్యర్థుల చేతికి చేరిపోతోంది. ప్రతిష్టాత్మక పథకంగా తాము భావిస్తోన్న పథకాల విశేషాలు అధికార పార్టీ చెంతకు చేరిపోతున్నాయి. వెను వెంటనే అవి అమలులోకి వచ్చేస్తున్నాయి. ఎరువులు ఫ్రీ పథకం అలాగే పుట్టుకొచ్చిందన్నది కాంగ్రెస్ ముఖ్యుల ఆరోపణ. తమ పార్టీలో జరిగిన చర్చల సారాంశమే ఆ పథకమని వారు వాపోతున్నారు. తాజాగా నిరుద్యోగ భృతికి సంబంధించి కూడా తాము ప్రకటించడానికి ముందే సమాచారం లీక్ అయిందన్న భావనలో కాంగ్రెస్ ముఖ్యులు ఉన్నారు. అయితే, కాపీరైట్ కామెంట్స్ రాకుండా తమ నిరుద్యోగ భృతి పథకానికి కౌంటర్ గా సీఎం సరికొత్త ఆలోచన చేశారంటున్నారు వారు. సుమారు 25 వేల మంది నిరుద్యోగులను ఎంపిక చేసి, భూ రికార్డుల పై సర్వే చేసే బాధ్యతను అప్పగించడానికి రంగం సిద్ధం చేశారు. వారికి ఇరవై వేల చొప్పున వేతనం చెల్లించడానికి సీఎం కేసీఆర్ సిద్ధ పడ్డారు. ఇది ఒకరకంగా తమ నిరుద్యోగ భృతి ఎఫెక్టే నని వారు అంచనా వేస్తున్నారు. ఇక పార్టీలో పీసీసీ మార్పు పై జరుగుతోన్న చర్చల సారాంశం పై కూడా తమకంటే అధికార పక్షానికే ఎక్కువ సమాచారం ఉంటోందని పలువురు కాంగ్రెస్ నేతలు వాపోతున్నారు. ఫలానా వారు పీసీసీ అధ్యక్షులు అవబోతున్నారంటూ పవర్ సర్కిల్ లో ప్రచారం జరగడం టీ కాంగ్రెస్ ముఖ్యులను విస్మయానికి గురి చేస్తోంది. అసలు పీసీసీని మార్చుతారో లేదో తెలియదు, మార్చితే ఎవరికి పట్టంకడతారో అంత కంటే తెలియదు…మాకు లేని సమాచారం అధికార పక్షానికి ఎలా వస్తుందో అర్థం కావడం లేదని ఓ నేత ఫీలయ్యారు. ఫలానా వారు పీసీసీ కావచ్చు అని గాలిలోకి రాయి విసరడం ఓ పద్ధతి… కానీ, ఓ సీనియర్ నేత పేరును ప్రస్తావిస్తూ వారే కచ్చితంగా పీసీసీ పగ్గాలు చేపట్టబోతున్నారని అధికార కేంద్రంలో కీలక వ్యక్తి ఒకరు క్లోజ్డ్ సర్కిల్ లో కామెంట్ చేయడం కాంగ్రెస్ ను తాజాగా కలవర పెడుతోంది. ఈ సమాచారం ఢిల్లీ నుంచి ఏమైనా లీక్ అయిందా లేక పవర్ గేమ్ లో భాగంగా విసిరిన వదంతా అన్నది అర్థం కావడం లేదంటున్నారు వారు. ఈ నేపథ్యంలో పార్టీలో కోవర్టులు ఎవరన్న ప్రశ్నకు మాత్రం సమాధానం లేదు. సమాచారమైతే లీక్ అవుతోంది… కానీ, కోవర్టు ఎవరన్నది మాత్రం భేతాళ ప్రశ్నగా చెబుతున్నారు. టీ కాంగ్రెస్ పరిస్థితి ఇలా ఉంటే… ఏపీ కాంగ్రెస్ లో అయితే… పార్టీ కమిటెడ్ నేతల కంటే కోవర్టులే ఎక్కువగా ఉన్నారంటున్నారు. రాహుల్ గాంధీ ఇచ్చిన ఆదేశాల కంటే జగన్ ఆలోచనలే తమ పార్టీలో ఎక్కువగా అమలవుతున్నాయన్నది ఏపీ కాంగ్రెస్ లో కొందరి ఆవేదన. జగన్ ను టార్గెట్ చేయాలన్న రాహుల్ ఆలోచనలను విస్మరించి… జగన్ తో కలిసి సంసారం చేద్దామన్న భావనలో మా పార్టీ ముఖ్యులు ఉన్నారని ఏపీ కాంగ్రెస్ నేత ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లాలో శిల్పా మోహన్ రెడ్డి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ గూటికి చేరిన తర్వాత ఏపీ కాంగ్రెస్ ముఖ్యులు ఇద్దరు రంగంలోకి దిగారట. శిల్పా చక్రపాణి రెడ్డిని ఓ ఫంక్షన్ లో కలిసి “నువ్వు తెలుగుదేశంపార్టీలో ఉండటం దేనికి… బ్రదర్ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌లోకి వెళ్లారు..నువ్వు కూడా అక్కడికే వెళితే బాగుంటుంది కదా!” అని మేనేజ్ చేసే ప్రయత్నం చేసినట్టు సమాచారం. వీళ్లు కాంగ్రెస్ పార్టీ నేతలా లేక వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలా అర్థం కావడం లేదని సన్నిహితుల వద్ద కొందరు నేతలు వాపోయారట. మొత్తం మీద పరిస్థితి ఇలాగే ఉంటే ఎన్నికల నాటికి పెను ప్రమాదాన్ని ఎదుర్కోకతప్పదన్న భావనలో హస్తం నేతలు ఉన్నారు. ఏపీలో కోవర్టుల వ్యవహారం పెద్ద సమస్య కాదు. ఎందుకంటే అక్కడ పార్టీ ఉన్నదీ లేదు కోవర్టుల వల్ల పెద్దగా పోయేది లేదు. కానీ, తెలంగాణలో అధికారం పై గంపెడు ఆశలు పెట్టుకున్న టీ కాంగ్రెస్ ముఖ్యులకు మాత్రం కోవర్టుల వ్యవహారం కంటిమీద కునుకులేని పరిస్థితి తెస్తుందా అన్న సందేహాలు ఉన్నాయి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *