Home > Politics > బీజేపీ వాయిస్ మారుతోందా….

బీజేపీ వాయిస్ మారుతోందా….

రెంటికి చెడ్డ రేవడిలా జగన్ పార్టీ
హస్తంలో వార్

bjp-apduniaవారం, పది రోజుల నుంచి… అరుపులు, కేకలతో హడావిడి చేసిన కమలం నేతల వాయిస్ మారుతోందా…. అంటే ఔననే సమాధానమే వస్తోంది.ఆంధ్రప్రదేశ్ లోని భారతీయ జనతా పార్టీ నాయకులకు ఒకే ఒక్క రోజులో కిక్కు దిగింది. వాపు కూడా లేకుండానే.. బలం ఉన్నదని తమను తాము ఆత్మవంచన చేసుకునే భాజపా నాయకులు భేషజాలకు పోయి.. బీరాలు పలికి.. అంతలోనే నాలిక్కరుచుకుని.. మాట దిద్దుకునే పనిలో పడ్డారు. బెజవాడలో పార్టీ సీనియర్ నాయకుల సమావేశం పెట్టుకునే సరికి.. మంది పోగయ్యే సరికి.. తమ బలం గురించి వారికి మహా నమ్మకం కుదిరిపోయినట్లుంది. చంద్రబాబునాయుడు తమతో మైత్రి ని తెంచుకోవడానికి ఆలోచించడం ఏమిటి? మనమే తెంచేసుకుందాం.. అంటూ దూకుడు ప్రదర్శించారు. మాకసలు తెదేపాతో స్నేహమూ అవసరం లేదు. వారి ప్రభుత్వంలోని మంత్రిపదవులూ అవసరం లేదు అంటూ తెగ రెచ్చిపోయారు. కానీ కనీసం ఒక్కరోజైనా గడవక ముందే.. వారి వైఖరిలో మార్పు వచ్చేసింది. సమావేశం నుంచి ఇళ్లకు వెళ్లేసరికి, వారి అసలు బలమేమిటో వారికి బోధపడిపోయినట్లుంది. ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీకి సొంతంగా సీటు గెలుచుకునే సత్తా లేదనే సంగతి అందరికీ తెలిసిందే. అయితే చంద్రబాబునాయుడుతో పొత్తుల పుణ్యమాని మాత్రమే వారు ఈసారి రాష్ట్రంలో అధికారంలో భాగస్వాములు కాగలిగారు. అంతమాత్రాన అంతా తమ పటిమే అనుకుంటే ఎలా? ప్రాక్టికాలిటీతో సంబంధం లేని కొందరు నాయకులు.. తొలినుంచి కూడా చంద్రబాబు మీద విమర్శలు చేయడమూ, తమ పార్టీ బలం వంద రెట్లు పెరిగిపోయిందని, వచ్చే ఎన్నికల్లో తాము సొంతంగా పోటీచేసేయబోతున్నాం అని.. తామే సింగిల్ పార్టీగా అధికారంలోకి కూడా వచ్చేయబోతున్నాం అని ఎవరికి తోచినట్లు వారు మాటలు చెప్పుకుంటూ పోయారు. తీరా రెండు పార్టీల మధ్య విభజన హామీల ప్రతిష్టంభన వచ్చిన తర్వాత.. కేంద్రం చేస్తున్న ద్రోహాన్ని లేటుగా అయినా సరే ఎండగట్టడానికి చంద్రబాబు డిసైడ్ అయిన తర్వాత.. ప్రజల్లో తమకెంత ఛీత్కారాలు ఉన్నాయో భాజపాకు అర్థమైంది. అయినా సరే.. ఏదో డాంబికాలకు పోయి మేమే కటీఫ్ చేసుకుంటాం.. రాజీనామాలు చేస్తాం అని అన్నారు గానీ.. మరురోజే.. తెలుగుదేశాన్ని వీడి ఉండలేం.. మా పార్టీకి చెడ్డపేరు వస్తుంది.. అంటూ ఇహలోకంలోకి వచ్చారు. శివసేన, అకాలీదళ్, బీజేడీ వంటి పార్టీలన్నీ భాజపాను ఛీకొట్టి కూటమినుంచి వెళ్లిపోతున్న నేపథ్యంలో తెదేపాకూడా వెళ్లిపోతే.. పరువు సాంతం గంగలో కలుస్తుందని వారికి తత్వం బోధపడినట్లుంది. అందుకే పొత్తులు మీరిపోయేది లేదు.. కేంద్రం సాయం తప్పకుండా చేస్తుంది.. మా బంధం తెగిపోదు అంటూ ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *