Home > Politics > వైసీసీలో అంతర్గత సంక్షోభం

వైసీసీలో అంతర్గత సంక్షోభం

తెలుగులో మాట్లాడిన ప్రధాని
గురువుకు ప్రధమ స్థానం :వెంకయ్య నాయుడు

ysrcp-apduniaవైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో కొందరు నేతల వ్యవహార శైలి, అసందర్భ వ్యాఖ్యలు ఆ పార్టీకి పెనుశాపంలా మారాయి. ఏకంగా పార్టీ నుంచి ఒక ఎమ్మెల్యే బయటకు వెళ్లిపోయే పరిస్థితులు తలెత్తడంతోపాటు ఆమె అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేని దుస్థితి ఆ పార్టీ పెద్దలకు తలెత్తింది. పైగా తన గురించి చేసిన వ్యాఖ్యలున్న వాయిస్‌ రికార్డులు కూడా ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి వద్ద ఉండడం తీవ్ర దుమారం రేపుతోందిఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉంది. ఎవరిని ఎక్కడి నుంచి పోటీలోకి దించితే బాగుంటుందన్న అంశాలపై పార్టీలోని పెద్దలు సమాలోచనలు జరపడం సహజమే. కానీ ఆయా చర్చలు, తీసుకునే నిర్ణయాలు పార్టీని నమ్ముకుని ఉన్నవారి మనోభావాలను దెబ్బతీసేలా, కొందరి రాజకీయ భవిష్యత్తును నాశనం చేసేలా ఉండకూడదన్న మౌలిక విషయాన్ని వైకాపా పెద్దలు విస్మరించారు. పాడేరు ఎమ్మెల్యేగా గౌరవనీయ స్థానంలో ఉన్న ఆమెను రాజ్యసభ ఎన్నికల అనంతరం పక్కన పెట్టేయడమేనని, ఆమె సీటును వచ్చే ఎన్నికల్లో వేరొకరికి ఇవ్వనున్నట్లు సాక్షాత్తూ విజయసాయిరెడ్డే చెప్పినట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. దీంతోపాటు ఆ ఇద్దరు నేతలు కొద్దిరోజుల కిందట అరకు వెళ్లినప్పుడు కూడా కుంభా రవిబాబుకు అరకు టిక్కెట్‌ను ఇవ్వబోతున్నట్లు కూడా పేర్కొన్నారు. గిడ్డి ఈశ్వరికి సంబంధించి ఫోన్లలో మాట్లాడుకున్న వ్యాఖ్యలను రికార్డు చేసిన వ్యక్తులు వేరొకరికి పంపడం… ఆయా వాయిస్‌ రికార్డులు చివరకు గిడ్డి ఈశ్వరికి చేరడంతో ఆమె తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు.ఎందరో పార్టీని వదిలి వెళ్లిపోతున్నా తాను మాత్రం వైసీపీనే నమ్ముకుని ఉంటే తనను మార్చి వేరొకరికి సీటు ఇవ్వాలని నిర్ణయించడాన్ని ఆమె తట్టుకోలేకపోయారు. పార్టీలో ఉంటే ఇక భవిష్యత్తు లేదని అర్థమై పార్టీలోంచి వెళ్లిపోవాలని తీర్మానించుకున్నారు. ఆమెను బుజ్జగించడానికి పార్టీ పెద్దలు కృషి చేసినప్పటికీ వారి యత్నాలు ఫలించలేదు. వాస్తవానికి ఆమె గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై తీవ్ర స్వరంతో మాట్లాడారు. దీంతోపాటు ఆమె వర్గీయుల్లో అత్యధికులు కరడుగట్టిన టీడీపీ వ్యతిరేకులు. ఈ నేపథ్యంలో ఆమె పార్టీ మారే సాహసం చేయకపోవచ్చని వైసీపీ శ్రేణులు ధీమాలో ఉన్నాయి. శనివారం వైసీపీ నగర అధ్యక్షుడిగా మళ్ల విజయప్రసాద్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగినా ఆమె హాజరుకాలేదు. కార్యక్రమానికి రావాలని పార్టీలోని ఉత్తరాంధ్ర ప్రముఖులందరూ వస్తున్నారని చెప్పినా ఆమె ఖాతరు చేయలేదు. రాత్రి పది గంటల తరువాత ఆమె విజయసాయిరెడ్డిని కలిసి, వైసీపీలోని కొందరు నేతలు ఆమెపై చేసిన వ్యాఖ్యలున్న వాయిస్‌ రికార్డులను ఆయనకు వినిపించినట్లు సమాచారం. ఆయా వాయిస్‌ రికార్డులను విన్న ఆయన నిర్ఘాంతపోయినట్లు తెలుస్తోంది. ముందూ వెనకా ఆలోచించకుండా మాట్లాడిన ఆ ఇద్దరు నేతలు మధ్యలో విజయసాయిరెడ్డి పేరును కూడా ఇరికించడంతో ఆయనకు ఏవిధంగా స్పందించాలో కూడా అర్థంకాని పరిస్థితి తలెత్తినట్లు తెలుస్తోంది. తాను పార్టీలో ఉండబోవడం లేదని చెప్పి గిడ్డి ఈశ్వరి సమావేశాన్ని ముగించారు. అయితే సుమారు రెండు గంటలపాటు చర్చలు జరిపి, ఆమెకు నచ్చజెప్పడానికి ప్రయత్నించినా ఉపయోగం లేకుండా పోయింది. పార్టీలో తనకు అవమానం జరిగిందని, తాను పార్టీలో కొనసాగే పరిస్థితి లేదని ఆమె వారికి తేల్చిచెప్పారు. తరువాత విజయసాయిరెడ్డి ఫోన్లో మాట్లాడినా కూడా ఫలితం లేకుండా పోయింది. మరోవైపు గిడ్డి ఈశ్వరి పార్టీ నుంచి వెళ్లిపోవడానికి దారితీసిన వ్యాఖ్యలు చేసిన ఇద్దరు నేతల్ని పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ శనివారం గట్టిగా మందలించారు. పార్టీలో ఉంటూ ఇష్టారాజ్యంగా మాట్లాడితే తలెత్తే పరిస్థితులు పార్టీ ప్రతిష్ఠను దిగజారుస్తాయని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సంబంధం లేని విషయాల్లో కొందరు తలదూర్చి ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తుండడం, పార్టీ పెద్దలకు తప్పుడు సమాచారాలివ్వడం తదితరాలకు పాల్పడుతూ పలువురి రాజకీయ భవిష్యత్తును గందరగోళంలో పడేస్తున్నారని పార్టీలోని కొందరు అభిప్రాయపడుతున్నారు. మొత్తం పరిణామాలు వైకాపా శ్రేణులను విస్మయానికి గురిచేస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *